శ్రీ చక్రకాళి ఆలయం, వందలూరు, తమిళనాడు
శ్రీ చక్రకాళి ఆలయం, వందలూరు, తమిళనాడు
దేవుడి మీద నమ్మకం వున్న వాళ్ళంతా వీలున్నప్పుడు దేవాలయానికి వెళ్ళటం, వారి వారి శ్రధ్ధాసక్తులనుబట్టి పూజలు చెయ్యటం అందరికీ తెలుసు. అయితే భక్తులు వెళ్ళినా, వెళ్ళక పోయినా, వారి గోత్ర నామాలు చెప్పినా, చెప్పక పోయినా, ప్రపంచంలోని ప్రతివారికీ చెందేటట్లు రోజూ పూజలు చేసే ఆలయం వున్నది తెలుసా? మరీ విడ్డూరాలు చెప్పకండి అంటున్నారా!? నేను విడ్డూరం చెప్పినా అది నిజమేనండీ. ఎందుకంటే నేను చూస్తే గానీ చెప్పను కదా. చూశాను అంటే వున్నట్లే కదా???
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనుషులంతా 27 నక్షత్రాలలో, 12 రాశులలో, 12 లగ్నాలలో జన్మించినవారే కదండీ. మరి వీరందరికీ ఒకేసారి సంకల్పం చేసి అందరి మంచి కోసం, లోక క్షేమం కోసం రోజూ ఉదయం శ్రీ లలితా సహస్ర నామార్చన చేస్తే అది అందరి కోసం చేసిన పూజ కాదా.
సాయంత్రం మళ్ళీ శ్రీ దక్షిణ కాళీ సహస్ర నామ పూజ చేసి ఆ కుంకుమ అందరికీ ప్రసాదంగా ఇస్తారు. వచ్చిన అందరికీ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో కుంకుమ కొంచెం కొంచెం ఇస్తారు. ఆ కుంకుమ ధరించటంతో అర్చన చేసిన శక్తి మనకి వస్తుంది అన్నారు అక్కడి పూజారులు. భక్తులు ఎక్కువగా వుండి కుంకుమ నిండుకుంటే, తిరిగి అర్చన చేసిన తర్వాతే ఇస్తారు కానీ మధ్యలో ఏదో కుంకుమ ప్రసాదంగా ఇవ్వరు.
అలాగే హారతి కూడా. మనకి ఆలయాలలో భక్తులు వెళ్ళినప్పుడల్లా హారతి ఇవ్వటం అలవాటు. అలాగే కొందరికి వెళ్ళగానే హారతి ఇవ్వండి (భగవంతుడికే లెండి) అని అడగటం కూడా అలవాటు. అయితే ఇక్కడ అవ్వేమీ ముడియాద్. భక్తులు వున్నా, లేక పోయినా, గంటకోసారి అమ్మవార్లకు హారతి ఇస్తారు. రోజూ పొద్దున్న అలంకారం చేసి 8 గం. లకి మహా దీపారాధన (హారతి), తిరిగి సాయంత్రం 6 గం. లకొకసారి. ఇవ్వన్నీ వినటానికి చాలా హాయిగా వున్నాయికదా. అలాంటి ఆలయాన్ని దర్శించాలనిపిస్తోంది కదా. అందుకే ఆలయ వివరాలు తెలుసుకోండి....
తమిళనాడులో రత్నమంగళంలో శ్రీ లక్ష్మి కుబేరుల ఆలయం పక్క సందులోనే వున్నది ఈ శ్రీ చక్రకాళి ఆలయం. ఈ ఆలయాలన్నీ దాదాపు ఒకే విధంగా వున్నాయి. మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు. కానీ ప్రత్యేక శక్తులు కలిగినవిగా పేర్కొనబడుతున్నాయి. అన్నీ నూతన ఆలయాలే. శ్రీ రచక్రకాళి ఆలయంలో అమ్మవార్ల విగ్రహాలు రెండు వున్నాయి. వెనక వున్న పెద్ద విగ్రహం శ్రీ భవతారిణిది. ఈ విగ్రహం ఒకే రాతిలో మలచబడ్డ 12 అడుగుల అద్భుతమైన విగ్రహం. భవతారిణి అంటే భవ బంధాలనుంచీ తరింప చేసేది, ప్రపంచాన్ని రక్షించేది.ఆ విగ్రహానికి ముందు వున్న చిన్న విగ్రహం శ్రీ చక్రకాళి. ఈవిడ పంచ భూతాలను తన త్రిశూలంతో అదుపులో వుంచుతుంది.
ఇక్కడ రెండు మేరులున్నాయి. ఒకటి శ్రీ లలితా మహామేరు...అన్ని ఆలయాలలో చూడవచ్చు. రెండవది దక్షిణ కాళి మహా మేరు. కేవలం ఇక్కడే వున్నది. ఈ అమ్మ ప్రజలని రక్షించటమేగాక, అవసరాన్నిబట్టి శిక్షిస్తుంది కూడా. అందుకే ఇక్కడ అనుకూల, ప్రతి కూల శక్తులకు పూజలు చేస్తారు. జీవితంలో రెండూ కావాలి. దక్షిణ కాళి పంచ భూతాలను తన త్రిశూలంతో అదుపు చేసి ప్రజలకు ఎప్పుడు ఏమి కావాలో ఇస్తుంది. ప్రపంచంలో మంచిని ఎలా కాపాడుతుందో, అలాగే ఒక్కొక్కసారి విపరీతాలను సృష్టించి ప్రకృతిలోని సమతుల్యాన్ని కూడా కాపాడుతుంది. ఇందులో లలితా మేరు పెద్దది. దక్షిణ కాళి మేరు బాగా చిన్నది. ఈ విగ్రహాలకి కింద వరుసగా మహా గణపతి, మహాలక్ష్మి, మహా కాళి, రెండు మేరులు, మహా సరస్వతి, చాముండేశ్వరి, కార్తికేయన్ లు పూజలందుకుంటున్నారు.
ఇక్కడ మనకి బాగా నచ్చే విషయం ఇంకొకటి వున్నది. మన ప్రాంతాలలో ఆలయాలలో పూజారులకి దక్షిణ ఇవ్వటం మనకి అలవాటు. పైగా ఆ ఆలయం గురించి, భాషా అసౌకర్యం వున్నా ఓపికగా మాకీ విషయాలన్నీ వివరించినవారు యువకుడే. దక్షిణ ఇస్తే తీసుకోలేదు. బహుశా ఎవరి దగ్గరా తీసుకోరనుకుంటాను. పైగా, అమ్మవారి గురించి, ఆలయం గురించీ రాస్తానన్నారు కదా, దాని వల్ల ఎక్కువమందికి తెలుస్తుందికదా, అది చాలు అంటూ సున్నితంగా వద్దన్నారు. ఆలయానికి ఉపయోగ పడుతుంది కదా అంటే వెంటనే రశీదు ఇచ్చారు.
యుగాంతంలో ప్రళయం అంటూ ఎప్పుడో వచ్చే ప్రళయం గురించి ఇప్పటినుంచీ దిగులుపడి రోజూ చస్తూ బతికే మనలాంటి వాళ్ళకి ప్రపంచంలో మనం తరచూ చూసే చిన్న చిన్న ప్రళయాలు అనేకం వున్నాయని, వీటికి కూడా కారణం ఆ దైవమేనని తెలుసుకుని భారమంతా దైవంమీద వేసి, మన కర్తవ్యాన్ని మనం త్రికరణ శుధ్ధిగా పాటిస్తే ఆ భవతారిణి మన భవాలని సుఖంగా తరింప చేస్తుంది కదా అనుకుంటూ ఆలయంనుంచీ ప్రశాంత చిత్తాలతో తిరిగి బయల్దేరాము.
దర్శన సమయాలు
ఉదయం 6గం. ల నుంచీ 12 గం. ల దాకా, తిరిగి సాయంత్రం 4-30 నుంచీ 8 గం. ల దాకా.ఈ ఆలయంవారి ఫేస్ బుక్ లో అమ్మ వారి ఫోటోలు చూడవచ్చు. అందులో చూసినదే...అమ్మవారికి చక్ర పొంగలి నైవేద్యం పెడతారు. అమ్మవారి ముందు పెద్ద పళ్ళెంలో చక్ర పొంగలి పెడితే, అందులో అమ్మవారి ఆకారం ప్రతి బింబిస్తుంది. భక్తులు ఈ ఉత్సవానికి విరివిగా వస్తారుట. తర్వాత ఆ పొంగలిని ప్రసాదంగా పంచి పెడతారు.
శ్రీ సాయిబాబా ఆలయం
ఈ ఆలయం ఎదురుగా శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం వున్నది. ప్రశాంతంగా వున్న ఈ ఆలయంలో హుండీ లేదు. తీర్ధం ఇచ్చినాయనకి 10 రూ. ల దక్షిణ ఇస్తే, వెంటనే రశీదు రాసిచ్చారు.
సమీప ఆలయాలు
అరై కాసు అమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీ కుబేరుల ఆలయం.
మార్గము
చెన్నైనుంచి చెంగల్పట్ వెళ్ళే రైలులో వందలూరు చేరుకోవాలి. అక్కడనుంచి కేలంబాకం వెళ్ళే తోవలో, వందలూరు జూనుంచి 4 కి.మీ. ల దూరంలో వున్నది. వందలూరునుంచి ఆటోలు లభిస్తాయి.
.. పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)