శివుడిని పశుపతినాథుడు అని పిలవడం వెనుక ఉన్న రహస్యం ఇదే!

 

శివుడిని పశుపతినాథుడు అని పిలవడం వెనుక ఉన్న రహస్యం ఇదే!

పరమేశ్వరడిని ఆదిదేవుడు అని పిలుస్తారు. భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాలలో కూడా పరమేశ్వరుడికి సంబంధించిన దేవాలయాలు చాలా ఉన్నాయి.  అయితే నేపాల్ లోని బాగమతి నది ఒడ్డున ఉన్న పశుపతినాథ్ ఆలయం చాలా ప్రత్యేకం.  ఈ ఆలయాన్ని సందర్శించకుండా కేదార్‌నాథ్ యాత్ర అసంపూర్ణం అని చెబుతారు. ఈ ఆలయంలో పంచముఖ శివలింగం ప్రతిష్ఠించబడి ఉంది,  దీనిని దర్శించుకోవడానికి నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అసలు ఈ ఆలయాన్ని పశుపతినాథ్ ఆలయం అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుంటే..


కేదార్నాథ్ తో సంబంధం..

మహాభారతంలో వర్ణించబడిన గాథ ప్రకారం, మహాభారత యుద్ధంలో పాండవులు చేసిన మారణహోమానికి శివుడు వారిపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. యుద్ధ పాపాల నుండి ప్రాయశ్చిత్తం కోసం పాండవులు శివుడిని ఆశ్రయించినప్పుడు, శివుడు ఒక మహిష రూపం ధరించి కేదార్‌నాథ్‌లో భూగర్భంలో దాక్కున్నాడట. అయితే భీముడు మహిషాన్ని కనుగొని, వెనుక నుండి పట్టుకుని బయటకు లాగడం ప్రారంభించాడు. అలా లాగినప్పుడు పశుపతినాథ్ ఆలయం ఉన్న పశుపతినాథ్‌లో శివుని శిరస్సు ఆవిర్భవించిందట.  ఆయన మిగిలిన శరీరం కేదార్‌నాథ్,  ఇతర పంచ కేదార్ క్షేత్రాల మధ్య విభజించబడిందట. అందువల్ల శివుని శరీరం కేదార్‌నాథ్‌లోనూ, ఆయన ముఖం పశుపతినాథ్‌లోనూ కనిపిస్తుందని నమ్ముతారు.

పురాణం ప్రకారం..

ఒక పురాణ కథనం ప్రకారం ఒకప్పుడు శివుడు హిమాలయాల్లోని ఒక గుహలో జింక రూపంలో నివసించేవాడు. ఇంతలో పార్వతీ దేవి,  ఇతర దేవతలు ఆయన కోసం వెతకడం ప్రారంభించారు. వారు ఆయనను హిమాలయాల్లోని ఒక గుహలో జంతువు రూపంలో నివసిస్తున్నారని కనుగొన్నారు. వారందరూ కలిసి ఆయనను తన నిజరూపానికి తిరిగి వచ్చి సకల జీవులకు అధిపతి కావాలని అభ్యర్థించారు. ఈ అభ్యర్థనకు సంతోషించిన శివుడు పశుపతినాథుడిగా అవతరించాడట.

మరొక పురాణ కథ..

పశుపతినాథ్ అనే  పేరు ఎలా వచ్చిందనే దానికి  మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఆ గాథ ప్రకారం, చాలా మంది రాక్షసులు ఈ ప్రాంతంలో భయభ్రాంతులను సృష్టించి, మనుషుల నుండి జంతువుల వరకు అందరికీ కష్టాలను కలిగించారు. అప్పుడు సకల జీవులు మహాదేవుని సహాయం కోరాయి. శివుడు వారిని సంహరించాడు. ఆయన "సకల జీవుల రక్షకుడి" పాత్రను స్వీకరించాడు, అందువల్ల ఈ ప్రదేశంలో శివుడు పశుపతినాథ్‌గా ప్రసిద్ధి చెందాడని చెబుతారు.

                           *రూపశ్రీ.