బ్రతికున్న వ్యక్తులు తమ సొంత పిండప్రదానం చేసుకునే సంప్రదాయం ఎక్కడో మీకు తెలుసా!
బ్రతికున్న వ్యక్తులు తమ సొంత పిండప్రదానం చేసుకునే సంప్రదాయం ఎక్కడో మీకు తెలుసా!
గయలో పిండప్రదానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గయలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే, తమ పూర్వీకుల ఋణం నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు. అందుకే పితృ పక్ష సమయంలో దూర ప్రాంతాల నుండి ప్రజలు తమ పూర్వీకుల ఆత్మల శాంతి కోసం పిండప్రదానాలు చేయడానికి గయకు వస్తారు. అయితే గయలో ఉన్న జనార్థన ఆలయం మాత్రం చాలా ప్రత్యేకం. గయలో దాదాపు 54 పిండ దేవతలు, 53 పవిత్ర స్థలాలు ఉన్నాయి. కానీ జనార్ధన ఆలయంలో మాత్రం జీవించి ఉన్న వ్యక్తులు తమ సొంత శ్రాద్దకర్మ లేదా పిండప్రదానం చేసుకునే సంప్రదాయం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు జరిగే ఏకైక ఆలయం ఇదే.. ఈ ఆలయం భస్మకుట పర్వతంపై మంగళ గౌరీ ఆలయానికి ఉత్తరాన ఉంది. ఈ ఆచారం, సంప్రదాయం గురించి.. ఈ ఆలయం గురించి పూర్తీగా తెలుసుకుంటే..
జనార్థన ఆలయంలో ఎవరెవరు పిండప్రదానం చేయవచ్చు..
సాధారణంగా పిల్లలు లేనివారు లేదా వారి తర్వాత పిండప్రదానం చేయడానికి కుటుంబంలో ఎవరూ లేనివారు తమ శ్రాద్ధాన్ని తామే నిర్వహించుకోవడానికి గయలోని జనార్థన ఆలయానికి వెళ్తుంటారు . అంతేకాకుండా.. సన్యాసం స్వీకరించినవారు లేదా కుటుంబం లేనివారు కూడా ఈ ఆలయంలో పిండం ఆచరిస్తారు. ఇక్కడ జనార్దనుడు స్వయంగా పిండం స్వీకరిస్తాడని నమ్ముతారు. ఇది వ్యక్తికి మోక్షాన్ని, పూర్వీకుల రుణం నుండి విముక్తిని ఇస్తుంది.
ఆలయ ప్రత్యేకత..
జనార్దన ఆలయం పూర్తిగా రాతితో చెక్కబడిన పురాతన ఆలయం. ఇందులో జనార్దన రూపంలో విష్ణువు దివ్య ప్రతిమ ఉంటుంది. ప్రజలు తమకు, అలాగే తమ పూర్వీకులకు పిండ ప్రధానం నిర్వహిస్తారు.
ఇదీ పద్దతి..
పిండప్రదానం, శ్రాద్ద కర్మ కోసం జనార్థన ఆలయానికి వెళ్లిన వారు మొదట వైష్ణవ సిద్ధి ప్రతిజ్ఞ చేసి తమ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారట. దీని తరువాత జనార్దన ఆలయంలో పూర్తి ఆచారాలతో పూజ, జపం చేస్తారు. నువ్వులు ఉపయోగించకుండా పెరుగు, బియ్యంతో చేసిన మూడు పిండాలను భగవంతుడికి సమర్పిస్తారు. పిండాలను అర్పించేటప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తారు, మోక్షాన్ని కోరుకుంటారు. ఈ ప్రక్రియ మూడు రోజుల పాటు కొనసాగుతుంది.
*రూపశ్రీ.