మహాలయ అమావాస్య రోజు గోకర్ణంలో నారాయణ బలికి ఉన్న ప్రాముఖ్యత తెలుసా..

 

మహాలయ అమావాస్య రోజు గోకర్ణంలో నారాయణ బలికి ఉన్న ప్రాముఖ్యత తెలుసా..


భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య లేదా పెద్దల అమావాస్య అని అంటారు.  ఈ రోజున గోకర్ణ క్షేత్రంలో  చేసే నారాయణ బలికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీని వెనుక  పౌరాణిక,  ఆధ్యాత్మికత కారణాలు చాలా ఉన్నాయి. అసలు నారాయణ బలి అంటే ఏమిటి? గోకర్ణ క్షేత్రంలోనే దీన్ని నిర్వహించడానికి గల కారణమేమిటి? మహాలయ అమావాస్య రోజు దీన్ని ఎందుకు నిర్వహిస్తారు? పూర్తీగా తెలుసుకుంటే..

నారాయణ బలి..

పితృదోష నివారణకు చేయబజే ప్రత్యేక శ్రాద్దకర్మను నారాయణ బలి అని అంటారు.  పితృదేవతలు అంటే మరణించినవారు.  అనూహ్య మరణం సంభవించిన వారైనా, అకాల మరణం పాలైనా,  ఆత్మలు శాంతి పొందకపోయినా,  పితృకర్మలు చేయకపోవడం వల్ల అయినా కుటుంబంలో చాలా అడ్డంకులు వస్తుంటాయి.  వీటి కారణంగా కుటుంబాలు ప్రశాంతతను కోల్పోయి, చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి సమస్యలన్నీ పోవడానికి నారాయన బలిని నిర్వహిస్తారు.  సాధారణంగా శ్రాద్దకర్మలు నిర్వహించేటప్పుడు విష్ణువుకు ప్రతిరూపంగా భోక్తను కూడా ఆహ్వానిస్తుంటారు. అలాగే విష్ణువును ఆహ్వానించి పితృదేవతలకు శాంతి కలిగించే విధంగా హోమ, తర్పణ, పిండప్రదానం చేస్తారు.  ఇదే నారాయణ బలి పేరుతో పిలవబడుతుంది.

గోకర్ణం ఎందుకు శ్రేష్టం..

గోకర్ణ క్షేత్రంలో మహాభలేశ్వర లింగం ఉంది. ఇది సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆత్మలింగం.  ఈ కారణంగా దీన్ని భూలోక కైలాసం అని పిలుస్తారు.  శివుడే పితృదేవతలకు ప్రధానమైన కరుణ చూపించే దైవం.  ఈ కారణంగా ఈ గోకర్ణ క్షేత్రంలో నారాయణ బలికి చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.

పురాణాల ప్రకారం ఇక్కడ యమధర్మరాజు తీర్థం కూడా ఉంది.  అందువల్ల ఇది పితృకర్మలకు అత్యంత శక్తివంతమైన స్థలంగా మారింది.

స్కాంద పురాణం,  గరుడ పురాణం మొదలైనవాటిలో గోకర్ణంలో పితృకార్యాలు చేస్తే ఆత్మలకు త్వరగా మోక్షం లభిస్తుందని స్పషంగా ఉంది.

గోకర్ణం వెనుక కథలు..

రాక్షసరాజు రావణుడు శివలింగాన్ని గోకర్ణంలోనే భూమి మీద ఉంచాడు. అక్కడ శివశక్తి అపారంగా వ్యాపించి, పాపక్షయానికి శ్రేష్ఠంగా మారింది. పితృకర్మలు ఇక్కడ చేస్తే, ఆ శక్తి పుణ్యాన్ని గుణపాతం చేసి పితృదేవతలకు చేరుస్తుందని నమ్మకం.

ఇక్కడ "కోటితీర్థం", "భద్రకాళీ తీర్థం", "గంగావళీ నది" మొదలైన పవిత్ర తీర్థాలు ఉన్నాయి. వీటిలో స్నానం చేసి నారాయణబలి చేస్తే, పితృలు అక్షయ లోకాన్ని పొందుతారని గరుడపురాణం చెబుతుంది.

ఫలితాలు..

గోకర్ణ క్షేత్రంలో  నారాయణ బలి చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయట.  పితృ దేవతలు  శాంతిని పొందుతారు.  ఇక్కడ పితృదేవతలకు నారాయణ బలి ఇచ్చే వారికి    పుణ్యఫలం లభిస్తుంది.

కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం లాంటి సమస్యలు తగ్గుతాయి. కర్మరహిత ఆత్మలు కొన్ని ఉంటాయి. అవి  మోక్షాన్ని పొందుతాయి.

                                 *రూపశ్రీ.