వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు?

 

వేంకటేశ్వర అవతారానికి 3 ప్రధానమైన కారణాలు?


1.ఒక నాడు నారద ముని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి అడిగారట. కలియుగంలో మానవులు తక్కువ కాలం జీవిస్తున్నారు, భగవంతుడి మీద అస్సలు మనస్సు లేదని. అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నారట, నేను వారి పాపాలని కడగడానికి, వారిని ఉద్ధరించడానికి శ్రీ వేంకటేశ్వరునిగా అవతరిస్తాను. వారు ఒక్కసారి నా కొండకి వచ్చి, తల నీలాలు సమర్పించి, నా దర్శనం చేసుకుని, ఒక్క ఆర్జిత సేవ చేసినా (కలియుగంలో అశ్వమేథయాగం చేసినంత పుణ్యం. అసలు కలియుగంలో చెయ్యడం చాలా కష్టం మరియు నిషిద్ధం కూడా) వారి పాపాలని నేను తీసేస్తాను. వారి డబ్బు వెయ్యకపోయినా సరే, తల నీలాలు సమర్పిస్తే చాలు.
 

 

 


2. ద్వాపర యుగంలో యశోదమ్మ చిన్నికృష్ణున్ని పెంచే అదృష్టం కలిగింది. ఈ లోకంలో యశోదమ్మవంటి అదృష్టవంతురాలు ఇంక ఎవ్వరులేరు. యశోదమ్మ అడక్కుండా రెండు మూడు సార్లు విశ్వరూప దర్శనభాగ్యం ఆమెకి మాత్రమే కలిగింది. కృష్ణుడి బాల్య క్రీడలు అంత సాధారణమైనటువంటివి కావు. వ్యాస భగవానుడు సంస్కృతంలో భాగవతాన్ని రాస్తే, పోతనాచార్యుల వారు తెలుగులోకి ఆంధ్రీకరించారు. కానీ యశోదమ్మకి ఒక కోరిక మిగిలి పోయింది. రుక్మిణి కల్యాణం చూడలేకపోయింది. అప్పుడు ఆమె అడిగితే, కృష్ణుడు వాగ్థానం చేశాడట నేను కలియుగంలో వేంకటేశ్వరునిగా అవతరిస్తాను, నీవు వకుళమాతగా వచ్చి నా కల్యాణం చేయించు అని.


3. వేదవతిని పరిగ్రహించాలి (వివాహ మాడాలి)
సీతమ్మ దొరికినట్లుగానే, ఈమె కూడా దర్భల మీద దొరికింది. నెమ్మదిగా పెరిగి యుక్త వయ్యస్సులోకి రాగానే, ఆమె తండ్రి వివాహం చేద్దామని సంకల్పించారు. అప్పుడు ఆమె చెప్పిందట నేను సాక్షాత్తు శ్రీనివాసుడిని వివాహమాడతాను అని. అప్పుడు తండ్రిగారు అన్నారు, శ్రీనివాసుడిని పరిణయమాడడమంటే మాటలా. పార్వతి దేవి చూడు ఎంత తపస్సు చేసింది శంకరుడు గురించి. అప్పుడు వేదవతి కూడా హిమవత్ పర్వతానికి వెళ్లి తపస్సు చేసిందట. ఆమె తపస్సు చేస్తుంటే, రావణాసురుడు వచ్చి ఎత్తుకుపోవాలని చూస్తే, వేదవతి వాడిని శపించి (నువ్వు ఒక స్త్రీ వల్లే నాశనం అవుతావని, ఆమెయే సీతమ్మ) అగ్ని ప్రవేశం చేసింది. ఆ సమయంలో అగ్నిహోత్రుడు  ఆమెను కాపాడి, కూతురిగా స్వీకరించాడు. కొన్నాళ్ళ తరువాత, రావణుడు సీతమ్మని ఎత్తుకు పోతుండగా అగ్నిహోత్రుడు తారసపడ్డాడు. రావణాసురుడు నమస్కారం కూడా చేయలేదని ఆగ్రహించి అన్నాడట, నీ రథంలో ఉన్న సీత నిజ మైన సీత కాదు, మాయ సీత అని. అసలు సీత నా దగ్గర ఉందని. అప్పుడు రావణాసురుడు చాలా సంతోషపడి, అగ్ని హోత్రుడి దగ్గర ఉన్న మాయాసీతని నిజమైన సీత అనుకుని లంకకి తీసుకుపోయాడు. నిజమైన సీత మాత్రం అగ్ని హోత్రుడి దగ్గర ఉండిపోయింది. అసలుసీత తరపున వేదవతి అశోక వనంలో 12 నెలలు ఉండి, రాముడిని రప్పించి, రావణ వాత చేయించింది. వేదవతి తన కార్యం పూర్తి అయ్యాక, అగ్నిహోత్రుడు దగ్గరకి వెళ్ళిపోయింది.
 

 
 వేదవతి యొక్క స్వరూపమే సీత. సీతమ్మ స్వరూపమే వేదవతి. నిజానికి ఇద్దరు లేరు, ఉన్నది ఒక్కరే. రావణాసురుడి గురుంచి చెబుతూ, రావణుడు వేదాలు చదివాడు, క్రమం తప్పకుండా సంధ్యా వందనం చేసేవాడు. చాలా తపస్సు చేసాడు కాని శ్రద్ధ లేదు, వక్ర బుద్ధి పోలేదు. అందుకే రాముడి చేతిలో మరణించాడు. శంకరుడుకి చాలా పూజలు చేసాడు కానీ, సీతయే పార్వతి అని తెలుసుకోలేక పోయాడు.  తన కులదేవత స్వరూపాన్నే కావాలనుకున్నాడు. 12 నెలలు సీతమ్మ తరపున వేదవతి అశోకవనంలో ఉంది కనుక, అగ్నిహోత్రుడు రాముడితో వేదవతిని కూడా భార్యగా స్వీకరించమన్నాడు. అప్పుడు రాముడన్నాడు, ఈ అవతారం లో నేను ఏకపత్ని వ్రతున్ని. నేను కలియుగంలో శ్రీ వేంకటేశ్వరునిగా అవతరించి వేదవతిని (పద్మావతి అమ్మవారు) పరిణయమాడతనన్నాడు.