జగన్నాథ రథయాత్ర.. రథ నిర్మాణం నుండి.. బహుదా యాత్ర వరకు.. పూర్తీ వివరాలు ఇవి!

 

జగన్నాథ రథయాత్ర.. రథ నిర్మాణం నుండి.. బహుదా యాత్ర వరకు.. పూర్తీ వివరాలు ఇవి!

 జగన్నాథ రథయాత్ర 2026 జూలై 16న ప్రారంభమవుతుంది, కానీ రథయాత్ర సన్నాహకానికి  ముందు చాలా ఆచారాలు పాటిస్తారు. భారతదేశంలో పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర ఎంతో గొప్పగా జరుగుతుంది. రథయాత్రలో పాల్గొనే ఏ భక్తుడైనా 100 యజ్ఞాలకు సమానమైన పుణ్యాన్ని పొందుతాడని చెబుతారు. ఈ రథ యాత్రకు ముందు  రథ నిర్మాణం జరుగుతుంది,  ఆ తరువాత  చివరగా, గుండిచా ఆలయానికి చేరుకోవడం, హేరా పంచమి, బహుదా యాత్ర , ఆలయానికి తిరిగి రావడం.. ఇలా చాలా జరుగుతాయి.  వీటి గురించి చాలా మందికి వివరంగా తెలియదు. ముఖ్యంగా జగన్నాథ రథయాత్రను తిలకించడానికి వెళ్లాలని అనుకునేవారు ఈ కార్యక్రమాల గురించి వివరంగా తెలుసుకుంటే.. రథయాత్ర స్మృతులు మరువలేనివిగా మిగులుతాయి.  వీటి గురించి వివరంగా తెలుసుకుంటే..

రథనిర్మాణం..

మూడు రథాలను మేకులు లేదా లోహం లేకుండా వేప చెక్కతో తయారు చేస్తారు. బలరాముని 'తలధ్వజం' (ఎరుపు-ఆకుపచ్చ) ముందు భాగంలో, సుభద్ర 'దర్పదాలం' (నలుపు/నీలం-ఎరుపు) మధ్యలో,  జగన్నాథుని 'నంది ఘోషం' (ఎరుపు-పసుపు) వెనుక భాగంలో ఉంటాయి.

స్వామి అనారోగ్యం..

రథయాత్రకు పదిహేను రోజుల ముందు, 108 కుండల నీటితో అభిషేకం చేసిన తర్వాత స్వామివారు అనారోగ్యానికి గురై ప్రత్యేకంగా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటారు. కోలుకున్న తర్వాత, ఆయన నవ యవ్వన దర్శనంతో ప్రత్యక్షం అవుతాడు.

ఛేరా పహారా..

థయాత్రకు ముందు, పూరీ గజపతి రాజు బంగారు చీపురుతో రథ మండపాన్ని , మార్గాన్ని శుభ్రం చేస్తారు.

గుండిచా మర్థనం..

రథయాత్రకు ఒక రోజు ముందు, భక్తులు గుండిచా ఆలయాన్ని పవిత్ర జలంతో కడిగి శుభ్రం చేస్తారు.

రథయాత్ర..

ఆషాఢ మాసంలోని శుక్ల పక్షం ద్వితీయ తిథి నాడు డప్పులు, బూరల వాద్యాలతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. మొదట బలరాముడు, సుభద్ర, చివరగా జగన్నాథుని రథాలను లాగుతారు. రథాన్ని లాగేవారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు.

గుండిచా ఆలయానికి ప్రయాణం..

ఈ ఊరేగింపు ప్రధాన ఆలయం నుండి ప్రారంభమై, 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా  ఆలయం వద్ద ముగుస్తుంది. ఇక్కడ అమ్మవారు ఏడు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడి దర్శనాన్ని "ఆడప్ దర్శనం" అని అంటారు.

హేరా పంచమి..

యాత్రలోని ఐదవ రోజున, లక్ష్మీదేవి జగన్నాథుని వెతకడానికి గుండిచా ఆలయానికి వస్తుంది.

బహుదా యాత్ర..

ఆషాఢ దశమి తొమ్మిదవ రోజున, రథాలు ప్రధాన ఆలయానికి తిరిగి వస్తాయి, ఈ ఆచారాన్ని బహుదా యాత్ర అని పిలుస్తారు.

ఆలయ ప్రవేశం..

తొమ్మిదవ రోజు తిరిగి వచ్చిన తర్వాత కూడా విగ్రహాలు రథాలలోనే ఉంటాయి. మరుసటి రోజు, ఏకాదశి నాడు, ఆచారం ప్రకారం  స్నానం , పూజలు చేసిన తర్వాత  విగ్రహాలను ఆలయంలో తిరిగి ప్రతిష్ఠిస్తారు.

                                             *రూపశ్రీ.