రథసప్తమి రోజు ఈ సాధన మొదలు పెడితే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది..!

 

రథసప్తమి రోజు ఈ సాధన మొదలు పెడితే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది..!


సూర్యుడు ఈ సృష్టిలో శక్తి నిండి ఉండటానికి మూల కారకుడు. సూర్యుడిని ఆరోగ్య దాయకుడు అని కూడా అంటారు.  సూర్యుడి ఆరాధన వల్ల ఆరోగ్యం సిద్దిస్తుంది,  శత్రునాశనం అవుతుంది, జీవితం బాగుంటుంది అని పురాణాలు, పురాణ పండితులు చెబుతున్నారు. శ్రీరాముడు రావణుడితో యుద్దం చేస్తున్న సమయంలో శారీరకంగా మానసికంగా అలసిపోతే.. అప్పుడు అగస్త్య మహర్షి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య హృదయం ఉపదేశం ఇస్తాడు.  ఈ ఆదిత్య హృదయం వల్ల శ్రీరాముడిలో ధైర్యం,  శక్తి తిరిగి వచ్చాయని,  రావణుడితో యుద్దాన్ని చేసి విజయం సాధించాడని చెబుతారు.  ఆదిత్య హృదయంను ప్రతి రోజు సూర్య భగవానుడికి ఎదురుగా  నిలబడి పఠిస్తే.. దైర్యం,  బలం,  జ్ఞానం,  విజయ శక్తి పెరుగుతాయని చెబుతారు. అయితే ఆరోగ్య సమస్యలకు సూర్య భగవానుడి మరొక మంత్రం ఉంది.  దీన్ని ఆదివారం రోజు మొదలు పెట్టి ప్రతి రోజూ సాధన చేస్తే మంచిది.  ఎలాగో రథసప్తమి.. ఆదివారం రోజు కలసి వచ్చిన సందర్భంగా ఈ మంత్ర సాధన మొదలు పెడితే.. కంటి ఆరోగ్యంతో ఇబ్బంది పడే వారికి చాలా గొప్ప ఫలితం ఉంటుంది. అదేంతో.. ఎలా సాధన చేయాలో తెలుసుకుంటే..

సూర్య శ్లోకం..

"ఓం నమో భగవతే సూర్యాయ ఆదిత్యాయ అక్షితేజనే అహో వాహిని వాహిని స్వాహా.."

పై మంత్రం వైదిక సూర్యోపాసన సంప్రదాయానికి చెందినది.  ముఖ్యంగా ఆదిత్య హృదయ స్తోత్రానికి అనుభందమైన జప మంత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ మంత్రం సూర్యోపాసనకు  చాలా బాగా పనిచేస్తుంది.

ఎవరు సాధన చేయాలి..

కంటి సంబంధ సమస్యలు ఉన్నవారు ఈ మంత్రాన్ని సాధన చేయవచ్చు.  దృష్టి తక్కువగా ఉన్నవారు,  కంటి మసక, కంటి ఇన్ఫెక్షన్లు,  కంటిలో నీరు కారడం వంటి సమస్యలు..  ఇలా కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు ఎవరైనా ఈ మంత్రాన్ని సాధన చేయవచ్చు.

సాధన..

ప్రతిరోజూ సూర్యోదయం కంటే ముందే స్నానం చేసి, సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో సూర్యుడికి ఎదురుగా నిలబడి మొదట అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తరువాత సూర్యుడికి ఎదురుగా కూర్చుని లేదా నిలబడి పైన పేర్కొన్న మంత్రాన్ని 108సార్లు జపం  చేయాలి. ఇలా కనీసం 21 రోజులు,  తరువాత 41 రోజులు అనగా మండలం పాటు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఫలితాలు పొందగలుగుతారు.

వైద్యం విడవకూడదు..

మంత్ర శక్తి మనిషి శరీరాన్ని దృడం చేస్తుంది.  రోగం ఏదైనా సరే.. వైద్యం చేయించుకుని మందులు వాడుతూ మంత్ర సాధన చేస్తే మందు అద్బుతంగా పనిచేస్తుంది.  ఇదే విషయాన్ని ఆయుర్వేదం,  ఋషులు కూడా చెబుతారు.  కాబట్టి రెండింటిని కొనసాగించాలి.

                                *రూపశ్రీ.