సూర్య భగవానుడి అనుగ్రహాన్ని తెచ్చి పెట్టే రథసప్తమి రోజు చేయాల్సిన, చేయకూడని పనులు!
సూర్య భగవానుడి అనుగ్రహాన్ని తెచ్చి పెట్టే రథసప్తమి.. ఈ రోజు చేయాల్సిన, చేయకూడని పనులేంటో తెలుసా!
సూర్యుడిని ప్రత్యక్షం దైవం అని అంటారు. సంక్రాంతి పండుగ నాటికి సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ కారణంగా దీన్ని మకర సంక్రాంతి అని అంటున్నారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన తర్వాత నుండి సూర్యుడి వెలుగు పెరుగుతూ వస్తుంది. పుష్య మాసంలో సంక్రాంతి అయిపోయిన తర్వాత.. మాఘ మాసంలో వచ్చే రథసప్తమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసపు శుద్ద సప్తమినే రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈరోజు సూర్యుడిని ఆరాధించడం చాలా ముఖ్యం. అయితే రథసప్తమి రోజు ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఈ రోజు సూర్య ఆరాధన ఎలా చేసుకోవాలి? విధి, నియమాలు ఏమిటి? తెలుసుకుంటే..
మాఘ మాస శుద్ద సప్తమిని రథ సప్తమి అని అంటారు. ఈ రోజు సూర్య భగవానుడిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది. సూర్య భగవానుడిని ఆరాధించడానికి ముందు రోజే సిద్దం కావాల్సి ఉంటుంది.
షష్టి రోజు..
మాఘ శుద్ద షష్టి రోజే సూర్య భగవానుడి ఆరాదనకు సిద్దం కావాలి. ఇందుకోసం షష్టి రోజు నూనె వేయకుండా వండిన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి, షష్టి రోజు రాత్రి సమయంలో ఆహారం తీసుకోకూడదు, ఉపవాసం ఉండాలి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నవారు, గర్భవతులు లేదా శరీరం సహకరించని వారు అయితే తగినంత ఆహారం తీసుకోవచ్చు. భూశయనం చేయాలి.. అంటే చాప లేదా దుప్పటి వంటివి నేల మీద పరుచుకుని వాటి మీద పడుకోవాలి. ఇలా చేస్తే రథసప్తమి పాటించడానికి మొదటి అడుగు పూర్తైనట్టే..
రథ సప్తమి రోజు..
రథ సప్తమి రోజు నాలుగు పనులు చేయాల్సి ఉంటుంది.
స్నానం..
సాధారణంగా నదీ స్నానం శ్రేష్టం అని భావిస్తారు. నది అందుబాటులో లేని వారు ఇంట్లోనే స్నానం చేయవచ్చు. అయితే స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు తెచ్చుకుని వాటిని బ్రహ్మరంధ్రం.. అంటే తల మీద బ్రహ్మరంధ్రం ఉంటుంది.. తల మీద పెట్టుకుని నీటిని పైనుండి ధారగా పోసుకుంటూ స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు దీనికి సంబంధించిన శ్లోకాలు పఠించాలి.
రథ సప్తమి స్నాన శ్లోకం..
నమస్తే రుద్ర రూపాయా రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే
యధా జన్మ కృతం పాపం, మయా జన్మసు జన్మసు
తన్మే రోగంచ శోకంచ మఖరీ హంతు సప్తమి
ఏతత్ జన్మ కృతం పాపం , యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ, జ్ఞాతా జ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం, స్నానాన్ మే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి
ఈ విధంగా శ్లోకం చెప్పుకుంటూ స్నానం చేస్తే జన్మజన్మలో చేసిన పాపాలు కూడా నశిస్తాయని చెబుతారు.
ఉపాసన..
రథ సప్తమి రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఇది సూర్య శక్తి ఆకర్షించడంలో సహాయపడుతుందని చెబుతారు. చాలామంది రథసప్తమి అనగానే.. ఇంటి ముందు రథం ముగ్గు వేస్తారు. అలాగే చిక్కుడు కాయలతో రథంను తయారు చేస్తారు. ఈ రథం మధ్యలో సూర్యుడి చిత్రపటాన్ని పెట్టి పూజించాలి. ఒక వేళ పోటో లేకపోతే.. సింధూరం లేదా ఎర్ర చందనంతో సూర్య భగవానుడి ఆకారాన్ని ఒక ఆకు మీద గీసి ఆ ఆకును చిక్కుడు రథం మధ్యలో ఉంచాలి.
రథ సప్తమి నాడు చిక్కుడు కాయలతో ఇలా రథం చేయడం వెనుక కొన్ని కారణాలు కూడా చెప్తారు. వీటి వల్ల ప్రకృతి లో ఉన్న శక్తి ఆకర్షణ మనుషులకు చేరుతుందటం అందుకే ఈరోజు ఇలా చేయాలని చెబుతారు. ఇంకొక విషయం ఏమిటంటే.. రథసప్తమి తర్వాత చిక్కుడు కాయలు తినకూడదు అని చెబుతారు. ఎందుకంటే.. రథసప్తమి తర్వాత ఈ కాయలలో సన్నగా పురుగులు వస్తుంటాయి. ఈ కారణంగానే చాలామంది ఇంటి దగ్గర ఉన్న చిక్కుడు పందిరిని కూడా పీకేస్తుంటారు.
నైవేద్యం..
రథసప్తమి రోజు సూర్యుడికి నైవేద్యం చాలాముఖ్యం. కేవలం రథసప్తమి రోజే కాదు.. మాఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆరాధించడం చాలామంచిది. నైవేద్యం కోసం ఆవు పాలు, బెల్లం, కొత్త బియ్యం వేసి తీపి పొంగలి లాగా వండి నైవేద్యం పెట్టాలి.
తులసి కోట ముందు ఆవు పేడతో అలికి ముగ్గు పెట్టాలి. ఆ ముగ్గు మీద ఆవు పిడకలను పేర్చి వాటిని వెలిగించి.. వాటి మీద ఒక కుండ పెట్టి నైవేద్యం వండాలి.
దానం..
రథ సప్తమికి, అక్షయ తృతీయ తిథికి ఉన్నంత గొప్ప ప్రాధాన్యత , అంత గొప్ప ఫలితం ఉంటుంది. ఈ రోజు చేసే ఏ చిన్న దానం అయినా విశేష ఫలితాన్ని ఇస్తుంది.
రథ సప్తమి రోజు ఆహారం, బట్టలు, డబ్బు.. ఇలా ఏదైనా దానం చేయవచ్చు.
రథ సప్తమి రోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ఎవరైనా కొత్త నోములు, వ్రతాలు, పారాయణలు, సాధనలు వంటిని చేయాలి అనుకుంటే వాటికి తగిన రోజు ఇది. ఈ రోజు ప్రారంబించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పైన పేర్కొన్నవి అన్నీ పాటిస్తూ రథ సప్తమి చేసుకుంటే సూర్యుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
*రూపశ్రీ.