గౌతమ ముని కొడుకుల గురించి ఓ ఆసక్తి కథ!!
గౌతమ ముని కొడుకుల గురించి ఓ ఆసక్తి కథ!!
ఏకతన్, ద్వితన్, త్రితన్ ఇవి గౌతముని ముగ్గురి కొడుకుల పేర్లు. ఈ ముగ్గురు తండ్రిలాగే.. మహామేధావులు. వేదములను ఎలాంటి దోషాలు లేకుండా అభ్యసించారు. గౌతమునకు వీరంటే చాలా అభిమానము. ఇలాంటి తేజస్సంపన్ను లైన కుమారులను కనినందుకు గౌతముడు చాలా సంతోషించేవాడు. అలా చాలాకాలము సుఖంగా గడిపి గౌతముడు దేవలోకమునకు వెళ్ళినాడు. గౌతముడు పురోహితుడిగా ఎంతోమంది రాజుల దగ్గర ఉండేవాడు. ఆయన దేవలోకం వెళ్లిన తరువాత ఆ రాజులందరు గౌతముని ముగ్గురు కొడుకులను తండ్రిని ఎలా గౌరవించే వారో అలాగే గౌరవించేవారు. అయితే ఈ ముగ్గురిలో త్రితన్ అనేవాడు మిగిలిన ఇద్దరి కంటే అన్నివిధములా గొప్పవాడుగా అయ్యాడు. అందువల్ల అందరు అతనిని ఎక్కువగా గౌరవిస్తూ అతనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. మిగిలిన ఇద్దరి మీద ఆసక్తి చూపడం తగ్గించారు.
ఒకసారి ఈ ముగ్గురికి సోమయాగము చేయాలనే ఆశ పుట్టింది. దానికి కావలసిన ధనము, పశువులు, అవసరమైన వాటికోసం ముగ్గురిలో ఇద్దరూ త్రితన్ అను చిన్న వానిని ముఖ్యునిగా ఉంచుకొని ధనము, పశువులు మొదలగు వానిని సేకరించుకొనిరి. త్రితన్ మీద ఉన్న గౌరవముతో ధనవంతులు, రాజులు ధారాళముగ విరాళములనిచ్చారు. ఆ ధనమును, వస్తువులను, పశువులను తీసుకుని సోమయాగము చేయడానికి తూర్పుదిక్కున ఉన్న సరస్వతీనదీ తీరమునకు వెళ్లారు.
త్రితన్ ముందు వెళ్తుంటే మిగిలిన ఇద్దరూ వెనుక వస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ త్రితన్ మీద చాలా అసూయ కలిగింది. చెడుగా ఆలోచించి త్రితన్ ను చంపేసి పశువులను డబ్బును వాళ్ళిద్దరే తీసుకుని వెళ్లాలని అనుకున్నారు.
వారు అలా అనుకోగానే వారికి మంచి సమయం కూడా దొరికింది. సరస్వతి నది తీరంలో ఒక పాడుబడిన బావి దగ్గర వారు బస చేశారు. రాత్రి సమయంలో అక్కడికి ఒక తోడేలు వచ్చింది. త్రితన్ దాన్ని చూసి భయపడ్డాడు. తప్పించుకునే ప్రయత్నంలో బావిలో పడిపోయాడు. లోపలి నుండి తన అన్నలను పిలిస్తే వారు పలకలేదు. వాళ్లిద్దరూ ఇదే మంచి అవకాశం అనుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
యాగం కోసం అన్ని ఏర్పాట్లు చేసాము కదా ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చింది యాగాన్ని పూర్తి చేయడం ఎలా అని త్రితన్ బాధపడ్డాడు.
మనస్సు దృడం చేసుకుని దేవతలను మొరపెట్టి ప్రార్థించడం మొదలుపెట్టాడు. దిక్కు లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు.. నాలుగు వైపులా చూసిన తరువాత అతనికి ఒక మూల ఒక తీగ కనిపించినది. అది సోమలత అనే తీగ. అతను దాన్ని గుర్తుపట్టి వెంటనే అక్కడే సోమయాగము చేయవలెనని అనుకున్నాడు. రాళ్ళతో ఆ తీగను నూరి రసమును పిండినాడు. ఆ పాడు బావిలో కొంచెము నీరుకూడ ఉండుటచే ఆ నీటిని ఉపయోగించుకున్నాడు. త్రేతాగ్నులను, యాగ వేదికను మనసులోనే సృష్టించుకొన్నాడు. అనేకమంది ఋత్విక్కులు పెద్ద గొంతుకతో మంత్రములను ఘోషించినట్లు తానొక్కడే పెద్ద గొంతుతో మంత్రములను చదువడం ప్రారంభించాడు.
అతనికి మంత్రములన్నీ కంఠస్థమే అతని ధ్వని దేవలోకము వరకు వ్యాపించినది. ఇంద్రుడు మొదలగు దేవతలందరు పరుగు పరుగున అతని వద్దకు వచ్చిరి. గౌతముని ఉత్తమ కుమారుడు యాగము చేస్తుడు దీనికి వెళ్ళకపోతే ఏమి సమస్య ఏర్పడుతుందో అవి ఆ దేవతలు భయపడ్డారు. సోమరసమును యధాక్రమముగ వారందరికీ పంచి ఇచ్చినాడు త్రితనుడు. తానుకూడ దానిని సేవించాడు. అతని కోరిక నెరవేరింది.
దేవతలు సంతోషించి అతన్ని ఒక వరము కోరుకోమన్నాడు .
"ఈ పాడుబావి నుండి నన్ను బయటపడియండి" అని అతడు అడిగాడు.
వారు సరేనన్నారు. ఆ భూమిలో చాల లోతున సరస్వతీ నది ప్రవహిస్తున్నది. ఆ బావికి దిగువన ఉన్న నది ఈ బావి మీదుగ పొంగి ప్రవహించ సాగింది. ఆ నదీ ప్రవాహములోపడి సులభముగ గట్టు చేరినాడు త్రితనుడు. అతడు దేవతలను ఇంకొక వరమును అనుగ్రహించవలసినదిగా ప్రార్థించాడు.
ఇకపై ఎవరు ఈ బావిలోని నీటిలో స్నానము చేస్తారో వారికి సోమరసపానము చేసిన ఫలము లభించాలని అతను అడిగాడు. దేవతలు సంతోషముతో అతనికి ఆ వరమును కూడా ఇచ్చారు.
ఇలా గౌతమ ముని కుమారుడు కష్టసమయంలోనూ అనుకున్నది సాధించాడు.
◆నిశ్శబ్ద.