చక్వవేణుడు అనే రాజు గురించి విన్నారా??
చక్వవేణుడు అనే రాజు గురించి విన్నారా??
ఒకానొకప్పుడు చక్వవేణుడు అనే పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు. అతడు గుణ సంపన్నుడు. సదాచారపరాయణుడు, ధర్మాత్ముడు, సత్యవాది. తనపైతాను ఆధారపడేవాడు. బాగా కష్టపడే స్వభావము గలవాడు. త్యాగశీలుడు, విరాగి, జ్ఞాని, భక్తుడు, తేజశ్శాలి, తపోమూర్తి, ఉన్నతశ్రేణికి చెందిన అనుభవశాలియైన మహాపురుషుడు. అతడు రాజ్యసంబంధమైన ద్రవ్యాన్ని తన కోసము, తన భార్యకోసము వినియోగించుకోవడం దోషంగా భావించి దానిని ముట్టుకోకుండా ఆ డబ్బుకు దూరంగా ఉండేవాడు.
పన్నుల రూపములో ప్రజలనుండి వసూలుచేసిన ద్రవ్యాన్ని వారి క్షేమంకోసమే వినియోగించే వాడు. రాజ్యకార్యాలను అతడు ప్రతిఫలాపేక్షను, అభిమానాన్ని వర్ణించి 'తనువును, మనసును లగ్నంచేసి నిర్వర్తించేవాడు. ప్రజలమీద అతని ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. రామరాజ్యంలో లాగా అతని రాజ్యంలోని ప్రజలందరూ దుఃఖమంటే ఏమిటో తెలియక అన్ని రకాల సుఖసంపదలతోను ఎంతో సంతోషంగా ఉండేవారు.
మహారాజు తను, తన భార్య జీవించడానికి రాజ్యానికి సంబంధించిన డబ్బు ముట్టకుండా ప్రత్యేకముగా వ్యవసాయం చేసుకొనేవాడు. ఆ వ్యవసాయానికి కూడా ఎద్దులు ఉపయోగించేవారు కాదు. ఎద్దులకు బదులుగా మహారాణి స్వయముగా నాగలిని లాగేది. మహారాజు విత్తనాలను చల్లేవాడు. వారు తమ పొలములో పండిన పంటతోనే తమ జీవితాన్ని హాయిగా సాగించుకొనేవారు. వారు వారి పొలములో చెరకు, ప్రత్తి, ధాన్యము, ఫలాలు, ఆకుకూరలు పండించుకొనేవారు. అంతేకాదు వారి పొలములో పండిన ప్రత్తితోనే వస్త్రం తయారు చేసుకొని ధరించేవారు. తన పొలములో పండిన చెరకుతోనే బెల్లం తయారుచేసుకొని తినేవారు. పొలములో పండిన అన్నాన్ని, తమ ఫలాలను, ఆకుకూరలను మాత్రమే ఆహారంగా ఆరగించేవారు.
చక్వవేణుడి భార్యకు ధరించడానికి ఆభరణాలు ఏమీ ఉండేవి కావు. కారణమేమంటే అతడు రాజ్యద్రవ్యాన్ని వినియోగించి ఆమెకు ఆభరణాలు ఏవీ చేయించేవాడు కాదు. వారి పొలంలో పండేపంట వారికి సాధారణమైన అన్నవస్త్రాదులతో కాలం గడపడానికే సరిపడుతూ ఉండేది. ఒక్క పొలం పనులకే కాక అతడు రాజ్యకార్యాలకోసం కూడా కాలాన్ని వినియోగిస్తూ ఉండేవాడు. అతని జీవనం సదాచారసంపదతో సాదాగా బ్రతికే ఒకరైతు జీవితాన్ని పోలి ఉండేది. ప్రతిదినము ఆరుగంటల కాలము నిద్రకుపోగా మిగిలిన కాలమంతా అతడు దేవుడిని పూజించడం, ఇతరులకు సహాయం చేయడం, రాజ్యం పనులు చూసుకోవడం, పొలం పనులు చేసుకోవడం వంటి వాటితో మునిగి తేలుతూ ఉండేవాడు.
అతనికి అన్ని జీవుల పట్లా సమానత్వ భావన ఉండేది. జంతువుల పట్ల దయ, ప్రేమ కలిగి ఉండేవి. అన్ని రకాల జీవులను, ప్రాణులను పరమాత్మ స్వరూపములుగా భావించేవాడు. అందరికీ సమాన ప్రేమాభిమానాలతో సేవలు చేసేవాడు. అయితే అతనికి ఏదైనా అవసరం అయితే ఎవరినీ అడిగేవాడు కాదు. తనమీద తాను ఆధారపడి కష్టపడి తనకు అవసరమైనది సంపాదించుకునేవాడు. సహజంగానే అతనిలో దీనిమీద వ్యామోహం ఉండేది కాదు. సేవకులచేత కాని, రాజ్య సంబంధమైన పనులు చేసే వారిచేత కాని తాను ఏ పనీ చేయించుకొనేవాడుకాడు. అతడు ఏ పని చేసినా ఆసక్తిని, అహంకారాన్ని విడిచిపెట్టి ఎంతో ఉత్సాహంతోను, ధైర్యంతోను వేస్తూ ఉండేవాడు.
ఇలా పురాణాలలో చూస్తే.. చక్వవేణుడు అనే ఓ గొప్ప రాజు ఉన్నాడు.
◆నిశ్శబ్ద.