ఇంద్రుడి సంపద ఎలా పోయింది?

 

ఇంద్రుడి సంపద ఎలా పోయింది?

అత్రికి అనసూయకు శంకరాంశతో జన్మించిన వాడు దుర్వాసుడు. కోపానికి పురుషరూపం. కోపించాడంటే బ్రహ్మాదులను కూడా గడగడలాడించ గల అపరరుద్రుడు. తాపసులలో మిన్నగా పేరున్నవాడు.

ఒకప్పుడు భూమిని అంతా తిరిగి ఇంద్రలోకానికి వెళ్లాడు. అప్పుడు ఒక విద్యాధరకాంత నందనవనములో ఉన్న పారిజాతం నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని ఎదురువచ్చి దుర్వాసుణ్ణి చూసి ఆ దండ ఇచ్చి నమస్కరించి వెళ్లిపోయింది. దుర్వాసుడు దండను తన జడలకు వేలాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారూఢుడై వస్తూన్న ఇంద్రుణ్ణి చూసి కొంచెం ప్రక్కకు ఒత్తిగిలి నిల్చున్నాడు. 

ఒకింత సేపటికి ఇంద్రుడు దగ్గరగా వచ్చాడు. వెంటనే దుర్వాసుడు తన జడలలో ఉన్న పూదండను తీసి ఇంద్రుడికి అందించి దీవించాడు. ఇంద్రుడు ఆ దండను అంకుశముతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం కుంభస్థలంపైన ఉంచాడు. ఆ పూలదండ పరిమళానికి గండు తుమ్మెదలు రొద చేస్తూ దానిమీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండముతో కిందపడవేసి కాళ్లతో తొక్కి రేకులూడగొట్టి నలిపి విసిరి వేసింది. ఇటూ అటూ ఉన్నవారు, ఇంద్రుడు ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పకాపకా నవ్వసాగారు. 

దుర్వాసుడా వికారపు పనిచూసి నిప్పులు రువ్వే కళ్లతో చూసి ఔరా! ఇంద్రా! అమరాధిపతివని ఆదరించి మన్ననగా పూలదండ ఇస్తే రాజ్యాధికారమదముతో ఇలాంటి దుర్వినీతి పని చేస్తావా? నీ సిరీ, సంపదా సముద్రములో కలియుగాక! అని శపించి వేడినిట్టూర్పులు విడుస్తూ వడివడిగా అడుగులు వేస్తూ వెళ్లబోయాడు.

వెంటనే ఇంద్రుడు ఏనుగు మీంచి దిగి పరుగెత్తిపోయి దుర్వాసుని పాదాలకు సాష్టాంగముగా నమస్కరించి లేచి చేతులు జోడించి మహామునీంద్రా! క్షమించు! నా తెలివి తక్కువతనం క్షమించు! అనుగ్రహించు అని గద్గదుడై ప్రార్థించగా దుర్వాసుడు నెయ్యి పోసిన అగ్గిలాగ మరింత ఉడుకెత్తి...

దురాత్మ! మర్యాదా, మన్ననా లేక నన్ను అవమానిస్తావా? మూడు లోకాల దొరతనం అంతమత్తెంకించిందా? అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో అని నన్ను వలలో వేసుకోవాలని చూస్తున్నావా? నోరు మూసుకుని పోతివా సరే, లేదా నీ పేరూ ఊరూ లేకుండా శపిస్తాను చూడు.

ఆనాడు దొంగవేషం వేసి అహల్యను అవమానించి గౌతమునిచే దయదలచి బ్రతికి వచ్చావు. నేను గౌతముణ్ణి కాను. నా కోపానికి అగ్ని కూడా బూడిద అవుతాడు. అత్రి మహాముని కొడుకును తెలుసునా? పో! నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బ్రతుకు నడివీథి మెతుకవుతుంది. భరించరాని అవమానం చేశావు. పోరా!... అని వడివడిగా పరుగెత్తినట్టు వెళ్లిపోయాడు. చేసేది లేక ఇంద్రుడు వెనుదిరిగి వచ్చి కందిపోయిన హృదయముతో ఐరావతం ఎక్కి ధారగా కన్నీరు కారే కళ్లతో భవనానికి వెళ్లాడు.

అంతే!! అమరావతిలో ఒకటే కలకలం. ఏమిటా అని బిక్కమొగముతో భవనము నుంచి వెలుపలకు వచ్చి నిల్చున్నాడు. అప్సరసలు, కల్పవృక్షాలూ కామధేనువు, ఐరావతం, ధనరాసులూ ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్టు పోయి అదృశ్యమయాయి. ఇంద్రజాలంలాగా అయి అమరావతి సర్వశూన్యం అయిపోయింది.

ఇలా దూర్వ్యాసుడి శాపానికి ఇంద్రుడి సంపద అంతా పోయింది.

                                      ◆నిశ్శబ్ద.