ఆనందమయ జీవితం కావాలంటే ఈ రెండింటిని అధిగమించాలి!

 

ఆనందమయ జీవితం కావాలంటే ఈ రెండింటిని అధిగమించాలి!

ప్రతి మనిషీ తన జీవితం సుఖసంతోషాలతో ఆనందంగా సాగిపోవాలని ఆశిస్తాడు, ప్రశాంతమైన జీవితాన్ని ఆకాంక్షిస్తాడు. అలా ఆనందమయ జీవితాన్ని ఆశించడం, ఆకాంక్షించడం మానవ సహజం. దీన్ని సాధించాలంటే రెంటింటిని అధిగమించాలి..

శారీరక అవరోధం ..

జీవితంలో ఏమి సాధించాలన్నా మనం మొట్టమొదట శారీరక సోమరితనాన్ని వదలిపెట్టాలి. దీనినే వేదాంత పరిభాషలో 'తమోగుణం' అంటారు. జీవితమంతా తిండి, నిద్రలకే పరిమితమై సుఖభోగాలే జీవిత లక్ష్యమనుకుంటే మనిషి పశుత్వం నుండి ఎన్నటికీ బయట పడలేడు. జీవిత లక్ష్య సాధనలో ముందడుగు వేయాలంటే శారీరక సుఖాలే సర్వస్వమనే భ్రాంతిని వీడి మనలోని పశుస్వభావానికి స్వస్తి చెప్పాలి.

మానసిక అవరోధం..

సుఖదుఃఖాల్లోనూ, జయాపజయాల్లోనూ, నిందాస్తుతుల్లోనూ చలించని మనసు కలవాడే నిజమైన శాంతిని పొందగలడు. కామ, క్రోధ, లోభం మొదలైన శత్రువుల బారి నుండి నిశ్చల మనసు కోటలా రక్షిస్తుంది. కాబట్టి కోటలాంటి దృఢమైన మనసును నిర్మించుకొని దుష్టచింతనల్ని మనసులోనికి చొర నీయకుండా సదా మనసుని అప్రమత్తంగా ఉంచుకోవాలి. 'కట్టులేని మనస్సు కట్టతెగిన సరస్సు' లాంటిది. అది మనిషిని అశాంతి పాలుచేస్తుంది.

ఇంద్రియాణాం హి చరతాం యన్మనో అనువిధీయతే | 

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ॥ 


ఇంద్రియాలవెంట పరుగులుతీసే మనస్సు విచక్షణా జ్ఞానం కోల్పోతుంది. అటువంటి మనసు సముద్రంలో చుక్కాని లేని నావలా గమ్యం తెలియక ప్రమాదానికి గురి అవుతుంది. ఇంద్రియాలపై ఆధిపత్యం సంపాదించుకోవటానికీ, మనోద్వేగాలను అదుపు చేసుకోవటానికీ క్రమశిక్షణతో కూడిన ప్రయత్నం అవసరం. మనోవికారం కలిగించే ఏ విషయమైనా దానిని మొదట్లోనే త్రుంచివేయాలి.

బెంగాలీ భాషలో 'మానుష్' అంటే 'మనిషి' అని అర్థం. ఎవరు నిజమైన మానుష్? ఎవరి మన్ (మనసు) హుష్ (సంతోషం) గా ఉంటుందో వారే మానుష్ (మనిషి). ఆత్మవశ్యైఃవిధేయాత్మా - ఎవరు తన మనసును వశం చేసుకుంటారో వారే శాంతికి ప్రతిరూపాలు.

మనిషి సమాజంతోనూ, ప్రకృతితోనూ, తన మనసుతోనూ సమన్వయం చేసుకోగలిగిననాడే శాంతిని పొందుతాడని బండ్ రస్సెల్ "The Kingdom of Happiness" అనే పుస్తకంలో వ్రాసాడు. మనసు ఆధీనంలో ఉంటే జీవితంలో ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా స్థిరంగా, ప్రశాంతంగా ఉండగలం. అటువంటి నిశ్చల మనసుతోనే జీవన్ముక్తి సాధ్యమవుతుందని శ్రీశంకరాచార్యులు 'భజగోవింద స్తోత్రం' లో 'నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః" అని ప్రబోధించారు.

                                             ◆నిశ్శబ్ద.