Read more!

ఓంకారంలో ఇంత గొప్ప శక్తిని మీరెన్నడైనా చూసారా?

 

ఓంకారంలో ఇంత గొప్ప శక్తిని మీరెన్నడైనా చూసారా?

ఓంకారం ఉచ్చరించడానికి ఎంత సులువైనదో.. దాని వల్ల కలిగే ఫలితం అంత అద్బుతమైనది. 

ఓంకారం మహత్తరమైన మంత్రమే కాదు, అది ఏకాక్షర బ్రహ్మ స్వరూపమని భగవద్గీతలో అభివర్ణించారు. ‘భగవద్గీత’ (8వ అధ్యాయం/ 13వ శ్లోకం)లో శ్రీకృష్ణ పరమాత్మ సైతం ఇలా అన్నాడు:


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ । యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ||


'ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును హృదయంలో నిలిపి, భ్రూమధ్యంలో ప్రాణాన్ని స్థాపించి, ఆత్మయోగంలో ఉంటూ, బ్రహ్మకు ప్రతీక, ఏకాక్షరమూ అయిన ఓంకారాన్ని ఉచ్చరిస్తూ, నా గురించే స్మరిస్తూ, ఎవడైతే శరీరాన్ని వదలిపెడతాడో, ఆ వ్యక్తి శ్రేష్ఠమైన గతిని పొందుతాడు' అని శ్రీకృష్ణ ఉవాచ.


అలాగే, 'భగవద్గీత'లోనే మరోచోట (17వ అధ్యాయం/ 24వ శ్లోకం) "వేదవాదులు ముందుగా బ్రహ్మవాచకమైన ఓంకారాన్ని ఉచ్చరించి, ఆ తరువాతే శాస్త్రోక్తమైన యజ్ఞ, దాన, తపః క్రియలను అనుష్ఠిస్తున్నారు" అని శ్రీకృష్ణ పరమాత్మ ఓంకార మాహాత్మ్యాన్ని పేర్కొన్నాడు.


ఇటు హిందూ మతంలోనూ, అటు బౌద్ధ మతంలోనూ మంత్రాల్లో మొట్టమొదటి భాగంగా 'ఓమ్' ఎంతో ముఖ్యమైనది. ఉదాహరణకు, మనం 'ఓమ్ నమశ్శివాయ' అంటాం. బౌద్ధంలో 'ఓమ్ మణిపద్మేహం' అంటారు. రెంటిలోనూ ముందుగా కలిపిన 'ఓమ్' అనే శబ్దం ఎంతో కీలకం.


అలాగే, ఓంకారాన్ని ముందుగా చేర్చకుండా, ఏ మంత్రాన్ని ఉచ్చరించినప్పటికీ ఆ మంత్రం ఫలించదని 'గోపథ బ్రాహ్మణం' పేర్కొంటోంది. మంత్రానికి ముందు ప్రణవాన్ని చేర్చడం వల్ల ఆ మంత్ర శక్తి ఇనుమడిస్తుంది. మంత్రాల సంగతికొస్తే, 'ఓమ్' అనేది శివుడికి ప్రతీక. మంత్రమేమో శక్తికి ప్రతీక. రెంటినీ కలిపి ఉచ్చరించడం వల్ల ప్రయోజనం సిద్ధిస్తుంది. ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు, గాయత్రీ మంత్రం, యజ్ఞం చేస్తున్నప్పుడు ఉపయోగించే మంత్రాలు, దేవీ దేవతల నామావళులు 'ఓమ్'తోనే మొదలవుతాయి.


ప్రణవోచ్చారణ ఫలితం ఏమిటి?


నిత్యం ఉదయం అయిదు నిమిషాల పాటు ఓంకార జపం చేస్తే చాలు. ఆత్మకూ, శరీరానికీ శాశ్వతమైన ప్రశాంతత లభిస్తుంది. ఓంకారాన్ని ఎంతో భక్తిగా, పెద్ద స్వరంతో, సుదీర్ఘంగా ఉచ్చరించాలి. అలా ఓంకారోచ్చారణ వల్ల మనలో తెలియని స్పందన కలుగుతుంది. అంతర్గత శక్తి పెంపొందుతుంది. శరీరంలోని ప్రతి భాగంపై అది ప్రభావం చూపుతుంది. ఓంకార నాదం అంతస్రావి గ్రంథులను ఉత్తేజపరుస్తుంది. అలాగే, సాధారణ స్పందనల ద్వారా మెదడు తనంతట తానే చైతన్యం పొందేందుకు తోడ్పడుతుంది.


అలాగే, శరీరంలోని అత్యంత ప్రధానమైన ఏకైక నాడిగా శాస్త్రజ్ఞులు పరిగణించే వ్యాగన్ నాడిని కూడా ఓంకారోచ్చారణ ఉద్దీప్తం చేస్తుంది. స్వరపేటిక, కంఠబలం, ఊపిరితిత్తులు, హృదయం, ఆహారనాళాలకు ఈ నాడి విస్తరించి ఉంటుంది. మనస్సు ఏకాగ్రతనూ, దృఢత్వాన్నీ సంతరించుకుంటుంది. గొంతు మృదువుగా మారుతుంది. మనస్సులోని ప్రతికూల ఆలోచనలను ధ్వంసం చేస్తుంది. శరీరం తేలికగా మారుతుంది.


ప్రణవోచ్చారణ వల్ల లౌకికమైన ఆలోచనలు తగ్గుతాయి. నిద్రాణంగా ఉన్న అంతర్గత శక్తి మేల్కొంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రాణశక్తి పైకి కదులుతుంది. అందువల్ల 'ఓం'కారాన్ని 7 సార్లు, 11 సార్లు, 21 సార్లు, 51 సార్ల వంతున ఉచ్చరించడం వల్ల దుఃఖం, నైరాశ్యం దూరమవుతాయి. ఆత్మసంతృప్తి పెరుగుతుంది. ఇక, సామూహికంగా ప్రణవాన్ని ఉచ్చరించడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యం సంతరించుకోవాలంటే, ప్రతి ఒక్కరూ రోజూ కొంతసేపు ప్రశాంత చిత్తంతో ఓంకార ధ్యానం చేయాలి.


ఓంకారాన్ని ఉచ్చరించిన తరువాతే భగవంతుడు సృష్టిని ప్రారంభించినట్లు చెబుతారు. దాంతో, ఏ కార్యక్రమం ప్రారంభిస్తున్నా, ఓంకారంతో శ్రీకారం చుట్టడం శుభప్రదమని భావిస్తారు. మనం గుడి గంట మోగిస్తే, దాని ప్రతిధ్వని సైతం ఓంకారాన్నే తలపిస్తుంది. ఓంకార ధ్యానం వల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఓంకారం మీద, దాని అర్థం మీద ధ్యానం సాగిస్తూ, ఆత్మజ్ఞాన సాధన చేసేవారు ఎంతోమంది ఉన్నారు.కాబట్టి ఓంకార సాధన మీరూ రోజులో భాగం చేసుకుని అద్భుతమైన ఫలితాన్ని పొందండి.


                                      ◆నిశ్శబ్ద.