భగవంతుడిని ఎలా ధ్యానించాలి ? (How to pray)
భగవంతుడిని ఎలా ధ్యానించాలి ? (How to pray?)
భక్తిగా ప్రార్థన చేస్తే, ప్రేమతో, భక్తితో పిలిస్తే పలకని, తలిస్తే తరింపచేయని దైవం ఉంటుందా ?
భక్తుల ప్రార్థనలోని వేడికోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా?
ద్రౌపదిని వస్త్రాపహరణం నుండి కాపాడింది ప్రార్థనే!
గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే!
మార్కేండేయుడిని యమగండం నుండి తప్పించింది ప్రార్థనే!
ప్రార్థన అంటే భక్తుడు భగవంతునితో జరిపే సంభాషణ. భగవంతుడు అందరివాడు. అందరిలోనూ ఉన్నాడు. ప్రార్థన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు. అందుకే మనం చేసే ప్రతి ప్రార్థనకూ ఫలం ఉంటుంది.
కీర్తి, ప్రతిష్ట, గౌరవం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఏదడిగినా భగవంతుడు మనము కోరినవన్నీ ప్రసాదిస్తాడు. మనం కోరుకునేవీ అవే! చేసే ప్రార్థనలో దేవుడు కావాలని చేసే ప్రార్థన ఒక్కటీ ఉండదు. జ్ఞానాన్ని ప్రసాదించమని ఒక్కరూ భగవంతుడిని కోరుకోరు.
ఒకసారి కుంతీదేవితో శ్రీకృష్ణుడు ‘అత్తా ఏదైనా వరం కోరుకో!’ అని అడిగాడట. ‘నాపై నీకు దయ ఉంటే ఎడతెగకుండా కష్టాలు ప్రసాదించు’ అని కోరుకున్నదట కుంతీదేవి. ‘అదేమిటి? ఎవరైనా భోగభాగ్యాలు, సుఖసంతోషాలు కోరుకుంటారు నువ్వేమో కష్టాలు కోరుకుంటున్నావు?’ అని అన్నాడట శ్రీకృష్ణుడు.
‘కష్టాలలో ఉన్నప్పుడే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది. సుఖాలకు మరిగితే ఇక నీ అవసరమే ఉండదు. నాకు భగవంతుని సాంగత్యమే కావాలి. అందుకే భగవంతుడిని ఎప్పుడూ ధ్యానించాలి. అది కావాలంటే కష్టాలు ఉండాలి. కాబట్టి నాకు కష్టాలనే ఇవ్వు’ అని కోరుకున్నది కుంతీదేవి.
భగవంతుడు చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించడం, మనసును కష్టపెట్టుకోవడం ఎవరికి మాత్రం ఇష్టం? మన కోరికలు తీర్చుకుంటునే భగవంతుడిని ఎలా ధ్యానించాలి?
ఇవన్నీ భక్తుడిని సందిగ్ధంలో పడవేసే ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు షిరిడీ సాయిబాబా వంటివారు భువిపై 60 ఏళ్ల పాటు నడయాడి మానవుల పాపకర్మలు తనపై వేసుకుని వాటినన్నిటినీ తాను అనుభవించిన సాయినాధుడు భక్తసులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో ఆయన స్వయంగా ఆచరించి చూపాడు. ఆదర్శ జీవనానికి బాటలు వేశాడు. ఆయన అడుగుజాడలే మానవాళికి శిరోధార్యం.