క్రమశిక్షణ స్పష్టతను ఎలా ఇస్తుంది?
క్రమశిక్షణ స్పష్టతను ఎలా ఇస్తుంది?
జీవితంలో అందరికీ ఓ విషయం ప్రత్యక్షంగా అర్థం అవుతోంది. అది ఏమంటే, మనసు నిశ్శబ్దంగా వుంటే తప్ప స్పష్టతకు ఆస్కారం లేదు. తూర్పుదేశాలలో ధ్యాన ప్రక్రియ ప్రయోజనం అంతా ఇలాంటి మానసిక స్థితి కొరకే. అంటే ఆలోచనను నిగ్రహించుకోవడం, మనసును ప్రశాంత పరచడం కోసం ఏవో స్తోత్రాలు చదువుకుని, తరువాత సమస్యను అవగాహన చేసుకునే ప్రయత్నం చేయడం. కాని, పునాది వేసుకుంటే తప్ప భయం, దుఃఖం ఆదుర్దాల వంటి బోనులలో పడకుండా మనసు తాజాగా వుండలేదు. మనసు నిజంగా ఇలాంటి ప్రశాంతతను చిక్కించుకోవడం ఎలానో తెలియదు. ఇది మరొకళ్ళకు చెప్పడం చాలా కష్టం. మరొకళ్ళతో ప్రస్తావించడంలో వున్న ఇబ్బంది ఏమిటంటే అర్థం చేసుకున్న దానిని మాటలలో ఇమడ్చడం. అంతకన్నా కష్టం ఇద్దరమూ ఒకే రకమైన తీవ్రతతో ఏకకాలమందు వ్యవహరించడం. సమతలంలో వుండగలగడమూను.
చదువుతున్న దానిని పూర్వ పాండిత్యం ద్వారా ఇష్టం వచ్చినట్లు భాష్యం చెప్పుకుంటూ వుంటే ఈ భావ ప్రసారం జరగదు. మన సుఖాలు, అభిప్రాయాలు, అర్థం చేసుకోవడంలో పడే యాతన ఇవన్నీ ఏమీలేనప్పుడే భావ ప్రసారం చక్కగా వుంటుంది.
జీవితంలో క్లిష్టాతి క్లిష్టమయిన విషయం ఏమిటంటే అందుకోవటానికి, సాధించటానికి, పొందటానికి పడే యాతన. మనం చిన్నతనం నుంచి స్వంతానికి పొందడంలోను, సాధించడంలోను మంచి శిక్షణ పొందాం. మెదడులోని కణాలు ఇలాంటి సాధనకు అలవాటు పడిపోయినాయి. భౌతిక భద్రత కోసం అవి ఈ రకమైన పద్ధతిని తయారు చేసుకుంటాయి. అయితే, మానసిక భద్రత, ఈ సాధన క్షేత్రంలోనిది కాదు. మనకు అన్ని సంబంధ బాంధవ్యాలలోను భద్రత కావాలి. వైఖరులు, కార్యకలాపాలు అందుకు అనుగుణంగానే వుంటాయి. అయితే .. ముందే మనం గమనించినట్లు అసలు భద్రత అనేది ఏమీలేదు. ఏ సంబంధంలోనైనా భద్రతకు ఆస్కారం లేదని గమనించడం, మానసికంగా శాశ్వతత్వం అనేది లేదని గ్రహించడం, జీవితానికి పూర్తిగా వేరయిన దృక్పథాన్ని తీసుకువస్తుంది.
ఇల్లు, బట్ట, భోజనం విషయంలో బాహిర భద్రత వుండడం తప్పనిసరే. అయితే, అంతరిక భద్రత కోసం వెంపర్లాడడంలో ఈ బాహిర భద్రత కూడా నాశనం అయిపోతోంది.
చేతనావర్తపు పరిధులను అధిగమించటానికి స్థలవైశాల్యం, నిశ్శబ్దం అవసరం. స్వలాభం కోసం నిర్విరామంగా పనిచేస్తున్న మనసు ప్రశాంతంగా వుండడం ఎలా సంభవిస్తుంది? మనసును నిగ్రహించవచ్చు, సంయమ పరచవచ్చు. సరిదిద్దవచ్చు కాని, ఈ యాతనలు ఏవీ దానిని ప్రశాంత పరచలేవు. రూపు దానిని మొద్దుబారేట్లు మటుకు చేస్తాయి. ప్రశాంత చిత్తం వుండాలి అనే ఆదర్శం, దానికోసం వెంపర్లాడడం బొత్తిగా విలువలేనివి. ఎందుకంటే, మనం బలవంతం చేసిన కొద్దీ అది ఇంకా, సంకుచితం స్తబ్ధం అయిపోతుంది.
నిగ్రహం అనేది ఏ రూపంలో వున్నా అణచివేత మాదిరే సంఘర్షణనే సృష్టిస్తుంది. నిగ్రహము, బాహ్యమైన క్రమశిక్షణ సరైనా మార్గం కాదు. అలాగే క్రమరాహిత్యం లేని జీవితం గూడా ఏ మాత్రమూ విలువైనది కాదు.
మన జీవితాలు చాల మటుకు సాంఘిక ఒత్తిడులకు, కుటుంబ అవసరాలకు, వ్యక్తిగత బాధలు అనుభవాలకు, ఏవో ఆదర్శసిద్ధాంతాలకు అనుగుణంగా వుండటానికి చట్రంలో ఇమిడి పోవటానికి అలవాటు పడిపోయినాయి. ఇలాంటి క్రమశిక్షణ మరణసదృశం. క్రమశిక్షణ అనేది ఎలాంటి నిగ్రహం లేకుండా జరగాలి. అణచివేత వుండగూడదు. భయం ఏ రకంగానూ స్థావరించుకు వుండగూడదు. ఈ రకమైన క్రమశిక్షణ ఎలా లభిస్తుంది? ముందు క్రమశిక్షణ తరువాత స్వేచ్ఛ అనేది కాదు వరుస. స్వేచ్ఛ అనేది మొట్టమొదటగా ప్రారంభదశనుంచీ వుండాలి, ఎప్పుడో చిట్టచివర కాదు. ఏదో ఏర్పాటుకు కట్టుబడి పోయి వుండే శిక్షణనుండి స్వేచ్ఛ కావాలి. ఇలాంటి స్వేచ్ఛను అవగాహన చేసుకోవడమే క్రమశిక్షణ. అసలు నేర్చుకోవడం అంటేనే క్రమశిక్షణ. ఆ మాటకు ఉన్న వ్యత్పత్తి అర్థం ప్రకారం. నేర్చుకోవడమే స్పష్టతను తీసుకువస్తుంది.
◆నిశ్శబ్ద.