వ్యాసుడు.. దేవకీ వసుదేవులను ఎలా ఊరడించాడు!

 

వ్యాసుడు..  దేవకీ వసుదేవులను ఎలా ఊరడించాడు!

కంసుడి దగ్గర బందీగా ఉన్న దేవకీ, వసుదేవులను వేదవ్యాసుడు కలిశాడు. చెరసాలలో.. సంకెళ్లతో బంధించబడిన వారిద్దరినీ చూడగానే వ్యాసుడి మనసు బరువెక్కింది. ఆయన వారిని ఊరడించాలని..  "దేవకీ, వసుదేవులారా! భయపడకండి. ధైర్యంగా వుండండి. కష్టాలెవరికీ కలకాలం వుండవు. వుండేది "కల" కాలమే. దురదృష్టం కొద్దీ కంసుడు దుష్టలక్షణాలు అసురీ ప్రవృత్తితో జన్మించాడు. అందుకే ఈ బాధలు కష్టాలు. ఇవి తప్పవు. పురాకృత పాపం కొద్దీ వీటిని అనుభవించక తప్పదు. పాపం పండితేనే తప్ప, పుణ్యఫలం దక్కదు.

మీరిద్దరు నాతో వస్తే మంచిది. కానీ అలా జరగదు. అంతా కాలమహిమ, వసుదేవా.. నువ్వు ఒంటరిగా వస్తే ఫలితముండదు. దేవకి ఒంటరిదవుతుంది. ఆమెకు ఇటువంటి కష్ట సమయంలోనే నీ అవసరం, నీకు ఆమె అనురాగం తప్పదు. అందుకే నీ బదులు, ఈ అక్రూరుడు నాతో వస్తున్నాడు. ఇదంతా నాకు తెలిసిన విషయమే. మేము ఇంద్రప్రస్థానికి వెళ్ళాక, అక్కడ అక్రూరుడు తన మనస్సు విప్పి మహావీరుడు ధర్మాత్ముడైన భీష్మునికి విషయం అంతా తెలియబరుస్తాడు. తర్వాత ఏం జరుగుతుందని ఆలోచించకు. అంతా కాలమహిమ. విధి నిర్ణయం. దాని ప్రకారమే సర్వం సాగుతుంది." అని చెప్పాడు.

దానికి వసుదేవుడు.. "నిజం చెప్పారు. అక్రూరుడు ధర్మాత్ముడే కాదు, నాకు మిత్రుడు కూడా. నాకన్న నా పరిస్థితిని విశ్లేషించి వివరించి చెప్పగల సర్వసమర్థుడుగా నా సోదరుడు." అన్నాడు.

అంతవరకు నిబ్బరంగా ఉన్న దేవకి  "ముని శ్రేష్ఠా! మీరు సర్వసమర్థులు. శ్రీ సచ్చిదానందులు. సాక్షాత్తు ఆ నారాయణ స్వరూపం. మా అదృష్టంకొద్ది ఇక్కడకు వచ్చారు. మాకు మీ అపూర్వ దర్శనం, అద్భుతమైన ఆశీస్సులు లభించాయి. అవే వేనవేలు, మాకు తారక తరుణోపాయాలు" అని ఆనందంతో చెప్పింది. 

"అమ్మా! భర్తను అనుసరించి చరించే స్త్రీ చాలా అదృష్టవంతురాలు. తాత్కాలికంగా బాధలు ఎదురైనా ఆమె దేవతా సమానురాలు. సర్వదేవతలు వారికి, ఆ దంపతులకు ఇష్టసిద్ధి కల్గిస్తారన్నారు. దాని ఫలం వెంటనే లభించకపోయినా, ముందు ముందు దాని గొప్పతనం, అనుసరించే వారి కీర్తి ప్రతిష్ఠలు లోకానికి తెలుస్తాయి" అన్నాడు వ్యాసుడు.

" మీ మాటలు నిజంగా మాకు ఓదార్పు. ఎంత ఓర్పు నిష్ఠలతో వున్నా సోదరుడు కంసుని ప్రవర్తన మమ్మల్ని భయపెడుతుంది. అతడు నా సంతానం మొత్తాన్ని సంహరిస్తాడు. కన్నా బిడ్డల్ని చూసుకునే భాగ్యం, మాతృమూర్తిననే భావం నశించిపోతుంది." అని ఆశ్రు నయనాలతో, తన ఆవేదనను వెళ్ళబోసుకుంది. మహర్షి ఆమెను ఓదార్చాడు. వారి వూరటతో ఆమె కాస్త కోలుకుంది.

వ్యాసుడు దేవకితో "పిల్లా! భయం విడిచిపెట్టు. కాలజ్ఞానం గురించి ఆలోచించకు. అదంతా నిజమే" అన్నాడు..

ఆ వెంటనే వసుదేవుడు "ఇవి వదంతులా ? గాలి కబుర్లా ? లేక పీడకలా ? అన్న ఆలోచనలు అనవసరం. దేవఋషి నారదుడు అందర్ని కలవడు. అవసరాన్ని బట్టి, లోకక్షేమాన్ననుసరించి, విశ్వకల్యాణ కర్తయై, తాను తన కార్యాల్ని చక్కబెడతాడు. ఇది సత్యం అందరూ ఆయనను కలహభోజనుడంటారు కానీ అది తప్పు. కారణంలేని కార్యముండదు. కార్యంలేని కలహముండదు." అన్నాడు.

"వసుదేవా, నువ్వు చెప్పిందంతా నిజమే. ఇది నాకు ఆనందదాయకం గూడా! పాపభారం పెరిగిపోతుంది. ధర్మరక్షకుని అవతారం ఆవశ్యకం. ఆ అవతరణమెంతో దూరంలో లేదు" అని దేవకీ వసుదేవులకు ధైర్యం చెప్పాడు వ్యాసుడు.

                              ◆నిశ్శబ్ద.