కుబేరుడి కుమారులకు శాపవిమోచనం ఎలా కలిగిందో తెలుసా...
కుబేరుడి కుమారులకు శాపవిమోచనం ఎలా కలిగిందో తెలుసా...
ఒకసారి యశోదాదేవి చల్ల చిలికి వెన్న చేస్తోంది. బాలకృష్ణుడు వచ్చి వెన్నకుండ దగ్గర నిలబడి పాలుకావాలని అడిగాడు. యశోద చేతిలో వున్న పని ఆపి బిడ్డని ఒడిలోకి తీసుకుని పాలు ఇచ్చింది. నల్లనయ్య పాలు తాగుతూ ముసిముసినవ్వులు నవ్వుతున్నాడు. యశోద పరవశించిపోయింది. పాలు తాగాక కృష్ణయ్య అమ్మ ఒడిలో పడుకుని హాయిగా ఆడుకుంటున్నాడు. తల్లికీ బిడ్డకూ కాలమే తెలియడం లేదు. ఇంతలో.. పొయ్యిమీద పాలు పొంగి పొయ్యిలో పడి వాసన వచ్చాయి. కంగారుగా బిడ్డను కిందకు దించి వంటింట్లోకి పరుగెత్తింది యశోద. కృష్ణయ్య ఉక్రోషంతో పెద్దగా ఏడ్చాడు కానీ యశోద వినిపించుకోలేదు.
కృష్ణయ్యకు కోపం వచ్చి పక్కనేవున్న కవ్వంతో చల్లకుండను పగలకొట్టి చేతినిండా వెన్న తీసుకుని బొక్కాడు. ఇంకాస్త తీసుకుని వీధిలోకి పరుగెత్తాడు. పొయ్యిమీద పాలు కిందకు దింపి యశోద వచ్చింది. కృష్ణయ్య అక్కడ లేదు. పగిలిపోయిన కడవ ముక్కలు, ఇల్లంతా ప్రవహిస్తున్న చల్ల కాలవలు కనిపించాయి.
'కృష్ణయ్యా' అని పెద్దగా పిలిచి నల్లనయ్య పాదముద్రల వెంటే వెళ్ళింది. పక్క ఇంటివరకూ ఆ పాదముద్రలు కనిపించాయి. లోపలికి వెళ్ళింది. ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కృష్ణయ్య మాత్రం అక్కడ ఒక రోటిమీద ఎక్కి నుంచుని ఉట్టిమీద వెన్న కుండకు చిల్లుపొడిచి వెన్న తీసుకు తింటున్నాడు. తను తింటూ మధ్య మధ్య పక్కనున్న ఒక కోతిపిల్లకు కూడా వెన్న తినిపిస్తున్నాడు. యశోద అదంతా విచిత్రంగా చూసింది. తరువాత బెత్తం తీసుకొని కొడుకుని కొట్టబోయింది. కృష్ణయ్య చిక్కకుండా పారిపోయాడు.
యశోదకు కోపం ఎక్కువైంది. "వస్తావా రావా" అని పెద్దగా అరిచింది. కళ్ళనిండా భయాన్ని ప్రదర్శిస్తూ కన్నయ్య పరుగెత్తాడు. యశోద కూడా పరుగెత్తింది. పనివాళ్ళు, పాలేళ్ళు, గోపికలు చోద్యం చూస్తున్నారు. కృష్ణయ్య ఏడుస్తూ పరుగు తీస్తున్నాడు. యశోద పరుగెత్తలేక రొప్పుతోంది. చివరికి కృష్ణయ్యే దొరికిపోయాడు. తల్లి కోపంతో వూగిపోతోంది. బిడ్డ బిక్కమొహంతో నిలబడ్డాడు. ఒకటి అంటించింది. బావురుమని మొహమంతా కాటుక చేసుకున్నాడు. కొడుకు కన్నీళ్ళు చూసి యశోద కూడా ఏడ్చేసింది.
బెత్తం కిందపడేసి చేతులు చాచింది. కృష్ణయ్య పరుగు పరుగున వచ్చి తల్లి గుండెలమీద వాలిపోయాడు. కోపం తగ్గాక "నీ అల్లరి మితిమీరిపోతోంది. కన్నా! నిన్ను ఊరికే వదలిపెట్టను, రా!" అంటూ లాక్కుని వెళ్ళి అక్కడే వున్న రోటికి బిడ్డను కట్టడానికి ప్రయత్నించింది. కాని, ఆమె తెచ్చిన తాడు ఆ చిన్నారి నడుముకు సరిపోలేదు. మరొక తాడు తెచ్చి మొదటి తాడుకు ముడేసి పిల్లవాణ్ణి కట్టబోయింది యశోద. ఆ తాడు కూడా నల్లనయ్య నడుముకు సరిపోలేదు. ఎన్ని తాళ్ళో.... ఇంట్లో వున్న తాళ్ళన్నీ తెచ్చినా కృష్ణయ్యని బంధించేందుకు సరిపోలేదు. యశోదకు ఆశ్చర్యమేసింది. అలసట కలిగి ఉస్సురంది. అయినా, తన ప్రయత్నం విరమించలేదు. తనను రోటికి కట్టేసేందుకు తల్లి పడుతున్న పాట్లన్నీ చూసి చిన్నికృష్ణుడు నవ్వుకున్నాడు. చివరికి తనే ఆ తాళ్లకు బందీ అయిపోయాడు. 'ఇక్కడే వుండు. కదిలితే వూరుకోను" అని కృష్ణయ్యను గదిమి యశోద లోపలికి వెళ్ళింది. మరుక్షణం పాకుతూ కృష్ణయ్య బయలుదేరాడు.
రోటిని ఈడ్చుకుంటూ బయటకు వెళ్ళాడు. దూరంగా రెండు మద్దిచెట్లున్నాయి. రెండూ పక్కపక్కగా ఉన్నాయి. కృష్ణయ్య వాటి మధ్య నుంచి పాకుతూ వెళ్ళాడు. తానైతే బయటికి వచ్చాడు. కానీ, వెనకే వస్తున్న రోలు మాత్రం రెండు చెట్ల మధ్య ఇరుక్కుపోయింది. నల్లనయ్య వెనక్కి తిరిగి ఒకసారి చూసి తన బలమంతా ఉపయోగించి గట్టిగా రోటిని లాగాడు. దానితో ఆ మద్దిచెట్లు కూకటివేళ్ళతో సహా వెలికివచ్చి కూలిపోయాయి. మరుక్షణం ఆ చెట్ల నుంచి కుబేర పుత్రులు నలకూబరు మణిగ్రీవులు బయటకు వచ్చి కృష్ణయ్యకు నమస్కరించారు.
ఒకప్పుడు కుబేర కుమారులున్న ప్రదేశానికి నారదమహర్షి వెళ్ళాడు. వారు ఆ మహర్షిని చూడటమైతే చూశారు కాని మద్యం సేవించి వుండడంవల్ల ఆయనను లక్ష్యపెట్టలేదు. నారదముని వాళ్ళకు తగిన శిక్ష విధించాలనుకుని మద్దిచెట్లయి పడి వుండమని శపించాడు. శ్రీకృష్ణపరమాత్మ దయవలన శాప విముక్తి లభిస్తుందని కూడా చెప్పాడు.
లీలామానుష స్వరూపుడైన నల్లనయ్యను దర్శించే భాగ్యం ఆ విధంగా వాళ్ళకు కలిగింది. శాపవిముక్తి పొంది నల్లనయ్య దీవెనలు అందుకుని నలకూబర మణిగ్రీవులు మాయమైపోయారు. చెట్లు కూలిన భీకర శబ్దానికి యశోద ఒక్క పరుగున వచ్చింది. కూలిన పెనువృక్షాల మధ్య ఏమీ ఎరగనట్టు ఆడుకుంటున్న కృష్ణుడ్ని చూసి ఆశ్చర్య పోయింది. మనసులోనే వేనవేల దేవుళ్ళకి మొక్కి, నల్లనయ్యను దగ్గరకు తీసుకుని ఒళ్ళంతా నిమిరింది. అల్లరి కన్నయ్య కిలకిలా నవ్వాడు. ఇలా ఉంది చిన్ని కృష్ణుడి లీల..
◆నిశ్శబ్ద.