Read more!

తల్లిని చంపిన పరశురాముడు (Parashurama, who killed his mother)

 

తల్లిని చంపిన పరశురాముడు

(Parashurama, who killed his mother)

 

ప్రపంచంలో తల్లిని మించిన వారు ఉండరు. దైవం తర్వాత మరో దైవం అంటే అది ఖచ్చితంగా కన్నతల్లే.. ఇంకా చెప్పాలంటే, దైవం కంటే ఎక్కువ. జన్మనివ్వడంతో ఆమె బాధ్యత పూర్తవదు. ఎన్నెన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేస్తుంది. అందుకే ఏమిచ్చినా తల్లి రుణం తీర్చుకోలేం అంటారు. అలాంటిది, పరశురాముడు కన్నతల్లిని గొడ్డలితో అడ్డంగా నరికేశాడు.

పరశురాముడికి మానవత్వం లేదా? కసాయివాడా? తల్లిని ఎందుకు చంపాడు? దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

జమదగ్ని గొప్ప తపస్వి. ఆ మహర్షి సతీమణి రేణుకాదేవి. ఓరోజు జమదగ్ని, పూజ చేసుకునేందుకు, భార్యను వెళ్ళి గంగాజలం తీసుకురమ్మన్నాడు. ఎంతమాత్రం ఆలస్యం చేయవద్దని, పూజకు సమయం మించిపోకుండా, గంగాజలాన్ని త్వరగా తెమ్మని చెప్పాడు.

రేణుకాదేవి, భర్త చెప్పినట్లు, నీళ్ళు తెచ్చేందుకు, గంగానదికి వెళ్ళింది. గంగమ్మకు నమస్కరించి, కళ్ళు తెరిచేసరికి గంధర్వులు కనిపించారు. రేణుక ఆశ్చర్యానికి అంతు లేదు. చిత్రరథుడనే గంధర్వుడు అప్సరసలతో కలిసి జలక్రీడలు ఆడుతున్నాడు. అలాంటి ఆనందకర దృశ్యాన్ని ఎన్నడూ చూడని రేణుక పరవశంగా చూసింది.

కొద్దిసేపు అలా గంధర్వులను చూసిన రేణుక, భర్త కోపావేశాలు గుర్తొచ్చి ఉలిక్కిపడి, తాను తెచ్చిన పాత్రను గంగలో ముంచి ఉదకాన్ని తీసుకుంది. భయంతో గుండె కొట్టుకుంటూ ఉండగా, వేగంగా ఆశ్రమం చేరింది. ఒనుకుతున్న చేతులతో గంగాజలాన్ని భర్త ఎదుట ఉన్న పూజా సామగ్రి దగ్గర ఉంచింది.

జమదగ్ని దివ్యదృష్టితో చూడనే చూశాడు. భార్య ఆలస్యంగా రావడానికి కారణం తెలీగానే ఆగ్రహంతో దహించుకుపోయాడు. ఆవేశంతో రగిలిపోతూ "పరశురామా! ఈ చంచల మనస్కురాలిని ఒక్క వేటున నరికేయి" అని ఆజ్ఞాపించాడు.

పరశురాముడు మరొకర్ని, ఇంకొకర్ని అయితే అలాగే నరికేసేవాడు. కానీ, ఆమె స్వయంగా తల్లి కావడంతో ఆ పని చేయలేకపోయాడు. తండ్రి మాతా విన్నట్లు ఊరుకున్నాడు.

కానీ, జమదగ్ని కోపం తగ్గలేదు. "పరశురామా, చెప్తోంది నీకే.. వెంటనే పరశువు (గొడ్డలి) తీసుకో... మీ అమ్మని, సోదరుల్నీ కూడా నరుకు.. ఇది నా ఆజ్ఞ" అన్నాడు.

పరశురాముడికి తండ్రి తపశ్శక్తి తెలుసు కనుక ఇక లేచాడు. ఇక ఆలోచించకుండా కన్నతల్లిని, సోదరులని తన పరశువుతో నరికేశాడు.

జమదగ్ని సంతోషానికి అవధుల్లేవు. కొడుకు తన ఆజ్ఞను శిరసావహించాడు. తల్లి అని కూడా చూడకుండా తాను చెప్పినట్లు చేశాడు. అందుకే, "పరశురామా, నా మాట మన్నించినందుకు సంతోషం.. ఏదైనా వరం కోరుకో" అన్నాడు.

పరశురాముడు సందేహించకుండా, "నాన్నా, దయచేసి అమ్మని, సోదరులని మళ్ళీ బతికించు.. అంతకంటే ఇంకేం అక్కర్లేదు" అన్నాడు.

జమదగ్ని కోపగించుకోలేదు. "తథాస్తు" అన్నాడు. పరశురాముని తల్లి రేణుకాదేవి, సోదరులు పునర్జీవితులయ్యారు. అయినా పరశురామునికి సంతోషం కలగలేదు. దుఃఖంతో రగిలిపోయాడు.

ఒక స్త్రీని, అందునా కన్నతల్లిని చంపిన తనకు పుట్టగతులు ఉండవనుకున్నాడు. ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి అన్నీ వదిలేసి, సర్వసంగపరిత్యాగిలా కొండల్లోకి వెళ్ళి ఘోర తపస్సు చేశాడు.

చాలాకాలం తర్వాత వేయి చేతులున్న కార్తవీర్యార్జునుడు జమదగ్ని హోమధేనువును తీసికెళ్ళిపోయాడు.దాంతో జమదగ్ని కార్తవీర్యార్జునుని వధించాడు. దాంతో కార్తవీర్యార్జునుడి కుమారులు వచ్చి జమదగ్నిని హతమార్చారు. ఇది తెలిసిన పరశురాముడు, తన తండ్రిని చంపినా కార్తవీర్యార్జునుని కొడుకుల్ని చంపాడు.