Read more!

అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు (Pareekshittu, son of Abhimanyu)

 

అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు మహారాజు

(Pareekshittu, son of Abhimanyu)

 

మహాభారత యుద్ధ సమయంలో అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మ శిరోనామకాస్త్రం, అభిమన్యుడి అర్థాంగి, ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువును వధించబోగా, ఉత్తర శ్రీ కృష్ణుని ప్రార్థించింది. శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం అడ్డు వేసి, తల్లీకొడుకులను రక్షించాడు. దాంతో ఉత్తర గర్భంలోని శిశువు సురక్షితంగా ఎదిగి, ఉజ్వల తేజస్సుతో జన్మించాడు. దంపతులు ఆ బిడ్డకు "విష్ణురాతుడు" అని పేరు పెట్టుకున్నారు. గర్భంలో తనకు కనిపించిన దైవము ( శ్రీకృష్ణుడు) లోకమంతా ఉన్నాడా అని పరీక్షించినందువల్ల ఇతనికి పరీక్షిత్తు అని పేరు వచ్చింది.

విష్ణురాతుడు, తన అసలు పేరుతో కంటే, పరీక్షిత్తు పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. ఎంతో చురుకైన పరీక్షిత్తు క్షత్రియ విద్యలన్నీ నేర్చుకున్నాడు. యుక్త వయసులో ఉత్తరుని కుమార్తె ఐరావతిని వివాహమాడాడు.

ఒకసారి పరీక్షిత్తు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని వేటాడుతూ శమీక మహర్షి ఆశ్రమం చేరాడు. అక్కడ తపస్సమాధిలో ఉన్న మునిని చూసి, తనను తప్పించుకు వచ్చిన మృగమేదని అడిగాడు. తపస్సులో లీనమై ఉన్న శమీక ముని సమాధానం ఇవ్వకపోవడంతో కోపించిన పరీక్షిత్తు, చిరాగ్గా అక్కడ చచ్చి పడి ఉన్న పామును ముని మెడలో వేసి, తన దారిన వెళ్ళాడు. కొద్దిసేపటికి ముని కుమారుడు వచ్చి, తన తండ్రి మెడలో పాము కళేబరం ఉండటం చూసి, ''ఈ పని చేసిన వాడు ఏడు రోజులలో పామువల్ల మరణిస్తాడు''- అని శపించాడు.

చివరికి తపస్సులో ఉన్న ముని జరిగింది తెలుసుకుని, పరీక్షిత్తు వద్దకు వెళ్ళి, తన కుమారుడిచ్చిన శాపం గురించి చెప్పాడు. పరీక్షిత్తు మహారాజు పశ్చాత్తాపంతో బాధపడ్డాడు.

పరీక్షిత్తు, తన కొడుకు జనమేజయునికి రాజ్యభారాన్ని అప్పగించి ప్రాయోపవేశం చేసేందుకు నిశ్చయించుకున్నాడు. పరీక్షిత్తుకు ముంచుకొచ్చిన ఆపద గురించి తెలిసి మహర్షులందరు వచ్చారు.

పరీక్షిత్తు "మునీశ్వరులారా, నేను ఆవేశంలో పెద్ద తప్పే చేశాను. ఇక నేను క్షమకు నోచుకోనా? నాకు సద్గతులు ఉంటాయా? నాకు జ్ఞానబోధ చేయండి. ఒక వారంలో నేను పరమార్ధాన్ని పొందే మార్గాన్ని సూచించండి. నాకు మోక్షాన్ని ప్రసాదించండి" అని వేడుకున్నాడు.

మునులంతా పరీక్షిత్తు మహారాజు స్థితికి జాలిపడ్డారు. వ్యాసుడి పుత్రుడైన శుక మహర్షిని సమర్ధుడిగా తలచారు. శుక మహర్షి అరిషడ్వర్గాలను జయించే మార్గాన్ని, భక్తిని, ముక్తిని బోధించాడు. ఆ క్రమంలో పరీక్షిత్తు అడిగిన అనేక సందేహాలను తీర్చాడు.

పాము వల్ల తనకు మరణం సంభవిస్తుందనే భయంతో పరీక్షిత్తు, గంగానది తీరంలో, దుర్భేద్యమైన ఒంటి స్తంభం మేడ కట్టించుకుని, అందులో ఉండిపోయాడు. భాగవతం సప్తాహం రోజున పాములు మానవరూపం దాల్చి, పరీక్షిత్తుకు పండ్లు ఇచ్చాయి. వాటిలో, ఒక పండులో దాగివున తక్షకుడు అనే పాము బయటకు వచ్చి కాటు వేయడంతో పరీక్షిత్తు మరణించాడు. మహర్షులు బోధించిన జ్ఞానామృతంతో, భాగవత శ్రవణంతో పరీక్షిత్తు మహారాజుకు మోక్షం ప్రాప్తించింది.