Read more!

How to avoid Re-birth

 

పునర్జన్మ వద్దనుకుంటే ఏం చేయాలి?

How to avoid Re-birth

 

''కన్ను తెరిస్తే జననం

కన్ను మూస్తే మరణం''

అన్నాడో కవి. కానీ అంత తేలిగ్గా తీసుకోగలమా? కొత్త ప్రాణి భూమ్మీదికొస్తే సంతోషం. ఉన్న ప్రాణి భూమిలో కలిసిపోతే విషాదం.

చావుపుట్టుకలు చాలా సహజమే. కానీ, అవి మహా ఉద్వేగభరితమైనవి. ఆలోచింపచేస్తాయి. పసికందుల్ని చూస్తే తెగ ఆశ్చర్యమేస్తుంది. మన రక్తమాంసాలు పంచుకుని పుట్టారు.. సరే.. ఇంతకీ అసలు వీళ్ళెవరు? ఎక్కణ్ణించి వచ్చారు? ఇంత మేధస్సు, ఇన్ని ఆలోచనలు వీళ్ళ మెదడులోకి ఎలా వస్తున్నాయి? ఏ పూర్వ వాసనలతో వీళ్ళిలా ప్రవర్తిస్తున్నారు లాంటి సందేహాలు తొలుస్తుంటాయి.

ప్రపంచవ్యాప్తంగా రోజూ లక్షలమంది చనిపోతారు, అంతకంటే ఎక్కువమంది పుడతారు. అందరి గురించీ మనకు పట్టదు కానీ, దగ్గరివాళ్ళు, ఆత్మీయులు చనిపోయినప్పుడు మాత్రం మనసు మెలిపెట్టినట్లవుతుంది. లక్ష సందేహాలు దాడి చేస్తాయి. చనిపోయిన వాళ్ళు ఏమౌతారు? మళ్ళీ పుడతారా? పుడితే మనుషి జన్మే ఎత్తుతారా? అదే కుటుంబంలో పుడతారా? అసలు ఈ దేశంలోనే పుడతారా లేక ఇతర దేశాల్లోనా? కుక్క, నక్క, పిల్లి, పులి, పాము, మొసలి, పిచ్చుక, మేక - ఎక్కడ, ఏ రూపంలో పుడతారు? మనకే ఇన్ని సందేహాలు వస్తాయి. ఇక పిల్లలకైతే చెప్పనక్కర్లేదు అడిగిన ప్రశ్న అడక్కుండా వంద సందేహాలు అడుగుతారు.

మనం దుస్తులు మార్చుకున్నట్లుగా ఆత్మ ఒక శరీరం లోంచి మరో శరీరంలో ప్రవేశిస్తుందనేది భగవద్గీత సారాంశం. మరణంతో ఈ జన్మ పరిసమాప్తం అవదని, మళ్ళీమళ్ళీ జన్మలు ఎత్తుతుందని పెద్దలు ఉపదేశించారు.

మన పురాణాల్లో అనేక మహత్తర అంశాల్లాగే పునర్జన్మ గురించిన ఉదంతాలూ ఉన్నాయి. విష్ణుమూర్తి అవతారమే శ్రీరామచంద్రుడు. లక్ష్మీదేవి స్వరూపమే సీతమ్మవారు. ఎన్నో పురాణ పాత్రలు మళ్ళీ మళ్ళీ పుట్టినట్లు చెప్పే కధలు అనేకం ఉన్నాయి. అయితే వీటిని నమ్మలేమని, పుక్కిటి పురాణాలంటూ తీసిపడేసేవారూ ఉన్నారు. సాధారణంగా మనకు తెలీని అంశాలను నమ్మలేని మాట నిజమే కానీ ఒక్కోసారి అలాంటివి కూడా నమ్మాలి. ప్రతిదానికీ సాక్ష్యాలు, ఆధారాలు చూపడం కుదరదు. మన ఇతిహాసాలు, పురాణాల్లోని కొన్ని కథలు అతిశయోక్తుల్లా ఉండే మాట నిజం. కానీ టెస్ట్ ట్యూబ్ బేబీలు (Test Tube Babies), అద్దెకు అమ్మ కడుపులు (Surrogate Mothers) సర్వసాధారణం అయ్యాక మన మహర్షులు చెప్పిన పునర్జన్మకు సంబంధించిన అంశాలను మాత్రం కొట్టిపారేయగలమా? ప్రస్తుత Test Tube Babies మాదిరిగానే పునర్జన్మకు సంబంధించిన అంశాలను కూడా నిరూపించే టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందేమో ఎవరు చెప్పగలరు?!

గ్రహాల గమనానికి సంబంధించిన ఖగోళశాస్త్ర పరిజ్ఞానం, పుష్పక విమానం, దూరదర్సనం, క్లిష్టమైన శస్త్ర చికిత్సలు - లాంటివన్నీ ఆకృతి దాల్చనంతవరకూ వింతలూ, విడ్డూరాలే. ఈ అధునాతన కాలంలో అంతరిక్షంలోకి దూసుకెళ్తోన్న రాకెట్లను చూస్తున్నాం. క్షణాల్లో సముద్రాలు దాటుతున్నాం. శాటిలైట్ ఛానల్స్ చూస్తున్నాం. సర్జరీలు చేయించుకుంటున్నాం. ఇదంతా ఇప్పుడు సాధారణం. కానీ వేదాల కాలంలోనే గ్రహావలోకాన, విమానాలు, ఎక్స్ రేలూ గట్రా లేకుండా అన్నీ కనిపెట్టడం, అవసరమైతే శస్త్ర చికిత్స చేయడం ఇదంతా ఎంత గొప్ప సంగతి?! మన మహర్షుల విజ్ఞాన సంపదకు వెలకట్టగలమా? వాళ్ళ దార్శనికత సామాన్యమైందా?! ఇవన్నీ ఇప్పుడు కళ్ళ ఎదుట సాక్షాత్కరించాయి కనుక నమ్ముతున్నాం. పునర్జన్మ ఇంకా నిరూపితం కాలేదు కనుక మహర్షులు చెప్పేవి పుక్కిటి పూరాణాలని తీసిపారేస్తే అది ఆ మహనీయులని అవమానించడం కాదు, మన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నట్లవుతుంది.

ఇంతకీ పునర్జన్మ ఉందా లేదా?

పునర్జన్మ ఉందనే చెప్తున్నాయి మన ధర్మ శాస్త్రాలు. మనదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మళ్ళీ జన్మ ఉందని నమ్ముతున్నారు. అన్ని కాలాల్లో, అన్ని దేశాల్లో శరీరానికి మాత్రమే చావు ఉందని, ఆత్మ నశించదని, స్నానం చేసి దుస్తులు మార్చుకున్నట్లుగా ఆత్మ ఇంకో శరీరంలోకి బదిలీ అవుతుందని, ఈ జన్మ వాసనలు మరుజన్మలో ఉంటాయని భగవత్గీతతో సహా ఎన్నో ఉద్గ్రంధాలు ప్రబోధించాయి.

ఈ జన్మలో చేసే పాపపుణ్యాల ఫలితాలను అనుభవించడానికి తప్పకుండా మరో జన్మ ఉంటుందని బౌద్ధం వివరిస్తుంది. మనం చేసే కర్మలు ముద్రలు పడతాయని, వాటి ఫలితంగా పునర్జన్మ ప్రాప్తిస్తుందని బౌద్ధులు నమ్ముతారు.

దాదాపుగా ఎవరికీ గతజన్మలు గుర్తుండవని, లక్షమందిలో ఒకరికి మాత్రమే పూర్వజన్మ విషయాలు జ్ఞాపకం ఉండే అవకాశం ఉందని సర్వేలు తెల్పుతున్నాయి. ఆ జ్ఞాపకాలు కూడా పూర్తిగా కాకుండా ఏదో లీలామాత్రంగా, కలలో మాదిరిగా గుర్తు ఉంటాయని తెలుస్తోంది.

సృష్టిలో లక్షలాది జీవరాశులు ఉండగా, ఎంతో పుణ్యం చేస్తేనే మానవజన్మ లభిస్తుంది. మరి ఇంత ఉత్కృష్టమైన మానవ జీవితంలో కష్టనష్టాలు ఎందుకు వస్తాయి అంటే అదంతా గత జన్మ పాపపుణ్యాలను అనుసరించే ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇతర ఈతి బాధల సంగతి అలా ఉంచి అంధులుగా, బధిరులుగా, మరేవో దుర్భర లోపాలతో ఎందుకు పుడతారు, జీవితంలో పూడ్చలేని వెలితి ఎందుకు చోటుచేసుకుంటుంది లాంటి సందేహాలకు అంతకుముందు జన్మలో చేసిన ఘోర పాపాలు, క్షమించరాని నేరాలే కారణం అని చెప్తున్నాయి ధర్మ శాస్త్రాలు.

తీవ్ర సంక్లిష్టంలో పడి విసిగిపోయినప్పుడల్లా "ఇదేం జన్మరా బాబూ.. వేయి జన్మలెత్తినా ఇలాంటి జీవితం వద్దు..." అని ఎందరో, ఎన్నోసార్లు గొణుక్కోడాలు మనకు తెలిసిందే. మొత్తానికి జన్మ పరంపర అనేది ఖచ్చితంగా ఉంది. తప్పులు చేస్తున్నంతవరకూ, పాప చింతనలో గడుపుతున్నంతవరకూ, భ్రమల్లో బ్రతుకుతున్నంతవరకూ మళ్ళీ మళ్ళీ జన్మించాల్సిందే. మనకు దేనిమీదైనా ఆశ, కోరిక, వ్యామోహం ఉన్నంతవరకు జన్మ ఎత్తుతూ ఉంటామని మహర్షులు సెలవిచ్చారు. కోరిక లేని దశకు వెళ్ళి తామరాకుపై నీటిబొట్టులా ఉండగల్గితే అప్పుడు పునర్జన్మలు ఉండవట.

జన్మరాహిత్యం కావాలంటే ఇహలోక చింతలు వదిలేసి, ఆధ్యాత్మిక చింతనలో గడపాలి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, ప్రతిదీ తాత్కాలికం.. అలా వస్తుంది, ఇలా పోతుంది.. అని గుర్తించాలి. లోకంలో మార్పుకు లోనుకానిదంటూ లేదని తెలుసుకుని నడచుకోవాలి. సుఖం కలిగితే పొంగిపోవడం, కష్టం వస్తే కుంగిపోవడం కూడదని చెప్తారు ధర్మసూక్ష్మం తెలిసిన పెద్దలు. అంటే ఏ అనుభవాలు ఎదురైనా వాటిని యథాతథంగా స్వీకరించాలే తప్ప అనుభూతి చెందకూడదు. అలాంటి నిర్వికార స్థితికి రాగలిగితే పునర్జన్మ ఉండదు. ముక్తి, మోక్షం తథ్యం.

 

hindu epics re-birth, buddhism re-birth, soul and body, birth cycle, punarjanma hinduism, punarjanma and moksham