స్నానం చేయబోతున్నారా!!
స్నానం చేయబోతున్నారా!!
హడావుడిగా బాత్‌రూమ్‌లోకి వెళ్లడం, అలా నాలుగు మగ్గులు ఒంటి మీద నీళ్లు చల్లుకుని స్నానం అయ్యిందనిపించుకుని పనులకు బయలుదేరడం ఇలా చాలామంది చేస్తుంటారు. మరికొంత మంది అసలు మొత్తం శరీరం తడవకుండానే స్నానం అయిపోయిందనిపిస్తుంటారు. ఇది ఏ మాత్రం సరైనది కాదు.స్నానం ఆచరించుటకు తగు విధి వుంది. అలాగే స్నానాలు పలురకాలు. అవేంటో తెలుసుకుందాం.
స్నానాలన్నింటిలో సముద్ర స్నానం శ్రేష్టమైంది. ఎందుకంటే ఆ నీటిలో ఉప్పు ఉంటుంది కావున. ఉప్పు వలన శరీరంలోని మలినాలు నశిస్తాయి.
సముద్ర స్నానం తర్వాత ఉత్తమమైంది నదీ స్నానం. ఉదయాన్నే నదీ స్నానం చేయటం వలన చర్మరోగాలు దరిచేరవు. నదులు కొండలూ, కోనలు, చెట్లూ అడవుల గుండా ప్రవహించడం వలన వాటిలో ఎన్నోఔషధ విలువలు చేరుతాయి. అందకే నదీ స్నానం ఆరోగ్యదాయకం అని చెప్తారు.
పుష్కర స్నానం గురించి దాని మహిమ గురించి వింటూ వుంటాము. పుష్కర సమయంలో స్నానం చేయడం వలన స్త్రీ, పురుషుల చేత పుట్టినప్పటి నుంచీ చేయబడిన పాపం తొలిగిపోతుంది అని నమ్మిక. ఆ సమయంలో మనమే కాదు, ముక్కోటి దేవతలు నదిలో స్నానం ఆచరించి తరిస్తారని భక్తుల విశ్వాసం.
ఇక ఇంట్లో చేసే స్నానం తరువాతది. ఎక్కువ వేడిగానీ, బాగా చల్లగా ఉన్న నీటితో గానీ స్నానం చేయకూడదు. గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం వలన శరీరానికి హాయి చేకూరుతుంది. రోగులు, చిన్నపిల్లలు దీనికి మినహాయింపు.
స్నానం చేయటం అనేది ఒక విధి మాత్రమే అనుకుని ముగించుట కన్నా అది ఒక భోగంలా సంతృప్తిగా అనుభవించుట నేర్చుకోవాలి.అందుకే ఆనాడు స్నానఘట్టాలు, స్నాన గదులకు మన వారు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి వుంటారు.