చెట్లను ఎందుకు పూజించాలి
చెట్లను ఎందుకు పూజించాలి
అనాదిగా మొక్కలను, వృక్షాలను పవిత్రంగా పూజించటం భారతీయ సంస్కృతిలో భాగంగా వస్తోంది. ఇప్పటికీ వృక్షాలను, జంతు స్థావరాలను పవిత్ర భావంతో చూడటం మనం గమనించవచ్చు. ఇది కేవలం మూఢాచారమో లేక అనాగరికతో అనే భావన కూడా లేకపోలేదు. ఇది జ్ఞానం, దూరదృష్టి, సంస్కారంతో కూడిన చర్వ అని తెలుసుకోవాలంటే చదవండి..
ఆది నుంచి ప్రకృతిని పూజించిన మానవుడు ఇప్పుడు ప్రకృతిని వశం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. భారతీయులు అనాది నుంచి ప్రకృతిని తల్లిగా భావించి పూజిస్తు వస్తున్నారు.
మనలో జీవశక్తిగా ఉన్న భగవంతుడే, మొక్కలూ, జంతువులు మొదలైన అన్ని ప్రాణుల్లోనూ వ్యాపించి ఉన్నాడు. అందుకే మొక్కలనైనా, జంతువులనైనా పవిత్రంగా పరిగణిస్తారు. మనిషి దైనందిన జీవితం మొక్కలూ, వృక్షాలపై ఆధారపడి వుంది. మనుగడకు అవసరమైన ఆహారం, ప్రాణవాయువు, వస్త్రాలు, వసతి, ఔషదాలు లాంటి ఎన్నో ప్రాణాధార వనరులు మనకు అవి అందిస్తున్నాయి.
పరిసరాలకు అందాన్ని, మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. నిస్వార్థంగా అవి జీవకోటికి ఎంతో సేవ చేస్తున్నాయి. నిర్జీవమైన తర్వాత కూడా అవి మనకు ఉపయోగపడతాయి.
భూమి మీద మనకన్నా ముందే వృక్ష, జంతు సమూహాలు ఏర్పడ్డాయి. కానీ మానవ వైఖరి వల్ల ఆ సమూహాలకు ఎంతో నష్టం కలుగుతోంది. దీనికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ, మానవ సహజతీరును బట్టి చూస్తే అతను దేనికి అయితే విలువ ఇస్తాడో, వాటినే రక్షించేందుకు ప్రయత్నిస్తాడు.మన పూర్వీకులు ఈ నైజం ఎరిగి ఉండటం వలననేమో చెట్లను పవిత్రంగా చూసుకోవాలని ఆ కాలం నుంచే బోధిస్తు వచ్చారు. ఒక వేళ ఏదైనా కారణం వలన చెట్టుని కొట్టేయవలసి వస్తే తిరిగి పది చెట్లు నాటాలని భారతీయ పవిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. అనవసరంగా వృక్షాలను నరకకూడదు.
మొక్కను లేదా చెట్టును కొట్టేయడం వల్ల శూనా అనే పాపం వస్తుందని, అది తగలకుండా ఉంటాలంటే ముందు క్షమాపణ అడగాలని కూడా గ్రంథాలలో కలదు. ఎన్నో ప్రయోజనాలు గల వేప, రావి, తులసి వంటి చెట్లు నేటికి ఈ నేలపై పూజింపబడుతున్నాయి. కదలలేని, మాటాడలేని చెట్టు మనకు మౌనంగానే ఎంతో జ్ఞానాన్ని, పాఠాలని బోధిస్తున్నాయి. ఇప్పటికైనా వాటి గొప్పతనాన్ని గుర్తించి, వాటిని పవిత్రంగా చూసుకొవటం, పూజించటంలో ఏ అనాగరికత లేదని, అసలైన నాగరికత ప్రకృతిని కాపాడుకోవటమే అని తెలుసుకోవటం మంచిది.