Hanuman Can Only Save

 

వీరహనుమాన్ మాత్రమే రక్షించగలడు

 

Hanuman Can Only Save

 

 జటాయువు సోదరుడైన సంపాతి రాజుద్వారా లక్ష్మనాదులకు సీతమ్మ జాడ తెలిసింది. రావణాసురుడు, సీతమ్మను లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు సంపాతి. సీతమ్మవారి జాడ అయితే తెలిసింది కానీ, అక్కడికి ఎలా వెళ్ళాలి.. నూరు యోజనాల విస్తారమున్న సముద్రాన్ని ఎలా దాటాలి.. అన్న ప్రశ్న తలెత్తింది. చివరికి జాంబవంతుడు ''హనుమంతుడే ఈ పనికి తగినవాడనీ, కానీ హనుమంతునికి తన శక్తి ఏమిటో తనకు తెలీదు కనుక అలా మౌనంగా ఉండిపోయాడు'' - అని ' చెప్పాడు. చివరగా ఈ ఆపదనుండి అందరినీ కాపాడగలిగేది హనుమంతుడే, అంత శక్తిసామర్ధ్యాలు రామభక్తుడు వీరహనుమాన్ కు మాత్రమే ఉన్నాయి'' అని - చెప్పాడు.

ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు ఎంతో పొంగిపోయాడు. ''తాను ఈ సాహసం చేయడానికి సిద్ధమని, వెంటనే సీతమ్మజాడను కనిపెట్టి వస్తానని'' మాట ఇచ్చాడు. వంద ఆమడల సాగరాన్ని అవలీలగా దాటేస్తాననీ, సీతమ్మను చూసి వస్తానని చెప్పాడు. సందేహిస్తున్న, భయపడుతున్న వారందరికీ ధైర్యం చెప్పి మహేంద్రగిరి పైకెక్కాడు.

ఈవిధంగా హనుమంతుని కార్య దీక్ష, సాఫల్యతలు సుందరకాండలో పొందుపరచబడినాయి. సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ చాలామంది విశ్వసిస్తారు. అది కేవలం నమ్మకం కాదని, అక్షరసత్యమని అనేకమంది అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. కనుకనే సుందరకాండలోని అనేక శ్లోకాలను ప్రార్థనా శ్లోకాలుగా చేసుకున్నారు.

హనుమంతుడు సముద్రం దాటి లంకను చేరేందుకు సన్నద్ధుడై, దేవతలకు మొక్కి, మహేంద్రగిరిపై నుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాత పరీక్షను దాటి, సింహిక అనే రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలోనికి దూసుకు వెళ్ళాడు.

చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదకసాగాడు. ఆంజనేయుడు తలచుకుంటే పర్వత సమానుడిలా విశ్వరూపాన్నీ ప్రదర్శించగలడు, అవసరమైతే అతి సూక్ష్మ రూపంలోనూ ఇమడగలడు. లంకలో అందరి కంటా పడకుండా ఉండేందుకు హనుమంతుడు చిన్న శరీరము ధరించి, రావణాసురుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్ని చోట్లా వెదికాడు. నిద్ర పోతున్న స్త్రీలలో మండోదరిని చూసి సీతమ్మతల్లి అని భ్రమించాడు. అంతలోనే అది పొరపాటు అని తెలుసుకొని తిరిగి అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమి చేయాలో తోచలేదు. సీతమ్మ జాడ తెలుసుకోకుండా నిరాశతో వెనుకకు వెళ్ళి అందరినీ నిరాశపరచడానికి హనుమంతునికి మనసొప్పలేదు.

రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్యచంద్రులకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనంలో సీతను వెదకడానికి బయలుదేరాడు.

చివరికి అశోక వృక్షము కింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలె భీతయై కృశించిన సీతమ్మవారిని చూశాడు హనుమంతుడు. ఈసారి చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆమె సీతమ్మవారేనని నిర్థారించుకున్నాడు. అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదిరించి, తనకు వశము కావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక మొత్తం భస్మం అయిపోవడం తథ్యమని సీత రావణాసురునికి గట్టిగా చెప్పింది. ఒక నెల మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకున్నది.

వారిలో సహృదయమైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఎనుగునెక్కి వచ్చి రామ లక్ష్మణులు సీతను తీసుకుని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

ఇంక ఆలస్యము చేయకూడదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

 

హనుమంతుడు భక్తిలో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు. శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు - అంటూ రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడింపు పొందింది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణిని ఆనవాలుగా ఇచ్చింది. నెల రోజుల్లో గనుక రాముడు తనను రక్షించి తీసికెళ్ళకుంటే తాను బ్రతకనని చెప్పింది.

 

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో సంభాషించానీ, లంకను పరీశించాలనీ నిశ్చయించుకుని. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డు వచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతమార్చి, కాలునిలా మకరతోరణాన్ని అధిష్టించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్లాడు.

సీతమ్మను అప్పజెప్పి, రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరిపై వ్రాలాడు.

 

"చూచితిని సీతను'' అంటూ మొదలుపెట్టి, జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా కలిసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్న చోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశాన్ని వివరంగా చెప్పి ఇక చేయవలసినది ఏమిటో ఆలోచించు ప్రభూ'' - అన్నాడు.

 

hanuman in lanka, trijata swapnam, seetamma in lanka, hanuman saw sita in lanka, veerahanuman and his power, rama bantu hanuman, Hanuman does't know his power