అభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణములు చేయాల్సిన విధానాలు, నియమములు ?

 

అభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణములు చేయాల్సిన విధానాలు,

 

నియమములు ?

 

 

భూత, ప్రేత, పిశాచ తదితర బాధలు తొలగడానికి, రోగాలు, ఎలాంటి కష్టాలైనా తొలగి పోవడానికి, అభీష్ట సిద్దికి శ్రీ ఆంజనేయ ప్రదక్షిణాలు శుభప్రదం. అనేకమంది ఆ ప్రదక్షిణములవలన కృతకృత్యులవుతున్నారు. ప్రదక్షిణాలకి నియమములు ముఖ్యం. దేవాలయంలోకాని, హనుమంతుని యంత్రాన్ని చేయించుకొని దాని చుట్టూ ఇంటిదగ్గరైనా ప్రదక్షిణాలు చేయవచ్చు. గణనమునకై పసుపుకొమ్ములే వాడుట శ్రేయము. మిరియములు ఉగ్రవిషయములు కాబట్టి పసుపుకొమ్ములే వాడటం మంచిది. పుష్పాలు, వక్కలు లెక్కకు తీసికొనవచ్చును.
పఠించవలసిన శ్లోకాలు :
శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్
ఆంజనేయం మహావీరం – బ్రహ్మవిష్ణు శివాత్మకం
తరుణార్క ప్రభం శాంతం – రామదూతం నమా మ్యహమ్ ||
మర్కటేశ మహోత్సాహ – సర్వశోక వినాశన
శత్రూ న్సంహర మాం రక్ష – శ్రియం దాపయే మే ప్రభో ||

అని పఠించుచూ ప్రదక్షిణములు చేయాలి.

 

 


భక్తి శ్రధ్ధలతో చేతులు జోడించుకొని గణనమున ఉపకరించే పుష్పాదికమును చేతియం దుంచుకొని వినమ్రులై పరుగులిడక ప్రదక్షిణములు చేయాలి. మధ్యలో ఎవరితోనూ మాటాడకూడదు. స్నానం చేసి శిచిగా చేయాలి. నూట ఎనిమిది కాని, శక్తి లేని వారు సగము కాని, ఇంకా శక్తిహీనులు అందులో సగమైన చేయవచ్చును. అలా శక్తిననుసరించి నలభైఐదు రోజులుగాని, ఇరవై ఒక్క రోజులుకాని, అభీష్టము అయినతే చాలారోజులు, చాలా నియమములు తప్పక పాటించాలి. అభీష్టము ఉన్నవారు స్వయమగా ప్రదక్షిణములు చేయాలి. వారు ఆశక్తులైతే తమకోసం వేరెవరిచేతనయినా చేయించవచ్చు. ప్రదక్షిణములు చేయుటం ఇంటిలోపలే అయితే దీపారాధన చేసికొని చేయాలి. దేవాలయంలో అయితే దీపారాధన చేసికొని లేదా దేవుని దగ్గర వున్న దీపారాధనలో తైలము వేసి నమస్కరించుకొని ఆరంభించాలి. ఎప్పుడూ తలస్నానము చేయాలి.

 

 

ప్రదక్షిణములు పూర్తియైన తరువాత “మయాకృతై రేభిః ప్రదక్షిణైః శ్రీసువర్చలాసమేత హనుమాన్ సుప్రీత స్సుప్రసన్నో వరదో భూత్వా మమాభీష్టసిద్దిం దదాతు” అని నీళ్ళను వదలాలి. దేవాలయములో చేయనివారు స్వామి యంత్రాన్ని అశ్వత్థమూలనకాని, కదళీమూలనకాని, ఉసిరి లేదా తులసి చెట్టు మొదటనయినాకాని, లేక ఇంట పరిశుధ్ద ప్రదేశమునకాని యంత్రము వుంచి ప్రదక్షిణము చేయాలి.

 

 

ప్రదక్షిణములు చేసే కాలంలో బ్రహ్మచర్యము, నేలపడక, నిత్యము దేవపూజ, మౌనవ్రతం, ఒంటిపూట భోజనము, కోపము వీడుట, దైవము పట్ల అచంచల భక్తి మొదలైనవి ముఖ్య నియమములు. ఇంద్రియ వికారముల అవకాశమీయక మృదువైనవి, కొద్దిమాత్రము వేడికలవి, బాగా వండినవైన సాత్విక పథార్థాలాను లఘువుగా భుజింపవచ్చు. భక్తిలోపము తగదు. శక్తివంచన కూడదు. అశక్తులు యధాశక్తి నియమములు పాటించి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. దక్షిణాభిముఖుడైన హనుంతుడు శక్తిమంతుడుగా పెద్దలు చెప్తారు. అలాంటి స్వామిని ఆరాధించి నిర్వహించుటం సద్యఃఫల మీయవచ్చు.