లంకలో హనుమంతుని చూసిన లంకిణి (Hanuman and Lankini in Lanka)
లంకలో హనుమంతుని చూసిన లంకిణి
(Hanuman and Lankini in Lanka)
సీతను అన్వేషించడానికి హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. ఆ సమయంలో వాతావరణం ఎంతో అనుకూలంగా ఉంది. ప్రకృతి శోభాయమానంగా ఉంది. రమణీయమైన ఉద్యానవనంలో పచ్చటి చెట్లు, రంగురంగుల సుగంధ పుష్పములు, పక్షుల కిలకిలారావములు, తుమ్మెదల ఝుంకారములు మొదలగు వాటితో నచ్చటి ప్రకృతి అంతా మనోహరంగా, చైతన్యవంతంగా, ఉత్సాహం, ఉత్తేజం కలిగించేలా ఉంది. కానీ, హనుమంతుడికి మాత్రం ఆ సౌందర్య దృష్టి లేకపోయింది. ఆయా పరిస్థితులు, మనస్తత్వాలను బట్టి చూసే దృష్టి ఉంటుంది. హనుమంతుడు కాలక్షేపం కోసమో, మనోల్లాసం కోసమో లంకకు వెళ్ళలేదు. సీతను అన్వేషించడం మాత్రమే అతని ఉద్దేశం. సీత కనిపించేవరకూ అతనికి మనశ్శాంతి లేదు. సీతమ్మ జాడ తెలిసిన తర్వాత, ఆమెను శ్రీరామచంద్రునికి అప్పగించడమే అతని బాధ్యత. అదంతా నెరవేరేవరకూ హనుమంతునికి మనసు స్థిరంగా ఉండదు. అందుకే హనుమంతుడు అస్థిరంగా, అస్థిమితంగా ఉన్న్డాడు.
హనుమంతుడు ఒక్కసారిగా ఎగిరి, గంతువేసి ఒక పర్వత శిఖరాన్నిఎక్కి కూర్చున్నాడు. ఆ కొండ అంచుభాగం హనుమంతునికి బాగా అనిపించింది. “ఇదెంతో అనుకూలంగా ఉంది. దీన్ని శిబిరముగా ఏర్పరచుకోడానికి యోగ్యముగా నున్నది. మధురజలము లున్నవి. ఇంకా విశేషం ఏమిటంటే, ఇక్కడ కూర్చుని చూస్తుంటే లంక అంతా చక్కగా కనిపిస్తోంది” అనుకున్నాడు. అలా అనిపించగానే, ఇక పని ముగిసేవరకూ అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. ఇంకా “దుర్గమమైన లంక విషయములు తెలుసుకుని, నేను అనుసరించవలసిన ప్రత్యేక విధానాన్ని వివరంగా అవగాహన చేసుకోవాలి. ఇది సీతాన్వేషనమునందు అత్యంత ఆవశ్యకమైన సంగతి” అని కూడా అనుకున్నాడు. తర్వాత హనుమంతుడు అక్కడే ఉండి, లంక యందలి అనేక విషయాలను అర్థం చేసుకున్నాడు.
హనుమంతుని చూసిన లంకిణి
హనుమంతుడు తన శరీరాన్ని భారీగా పెంచాడు. అలా పెద్ద కాయంతోనే లంకలో తిరిగి, అక్కడి విశేషాలను, ప్రత్యేక సంగతులను తెలుసుకోవడం, నేకాగ్రతతో పరిశీలించడం అసంభవం కనుక, అణిమాసిద్ధిని ప్రయోగించెనా? అనునట్లు సూక్ష్మరూపాన్ని ధరించి, లంకానగర ప్రముఖద్వారము చేరాడు.
లంకానగర దేవి లంకిణి సంధ్యా సమయములో రహస్యముగా ప్రవేశిస్తున్న ఆంజనేయుని చూసింది. ఆమెకు సందేహము కలిగినది. ఆమె హనుమంతుని సమీపించి, గద్దించి – “నీవు దొంగతనము చేయడానికి వచ్చావా?” అని అడిగింది.
ఆ ప్రశ్నకు హనుమంతునికి కోపం కట్టలు తెంచుకుంది. క్రోధావేశంతో పిడికిలి బిగించి ఆమెని బలంగా కొట్టాడు. ఆమె రక్తము కక్కుకుని నేలమీదపడిపోయింది. అంతలోనే తేరుకుని, మరల స్థిమితపడింది. “వెళ్ళు.. వెంటనే వెళ్ళిపో... నేను నిన్ను గుర్తించాను. వానర ఆఘాతముతో నీకు తుది దశ కలిగే వేళ రావణునికి అంతం సమీపిస్తుందని, ఆ సంగతి గ్రహించమని" బ్రహ్మదేవుడు నాకు గతంలో చెప్పాడు” అంది లంకిణి.