హనుమలీలలు – ఋషుల శాపము
హనుమంతుడు బాల్యావస్థలో చాలా అల్లర్లు చేయుచుండేవాడు.అసేలే వానరుడు, అందులో బాలుడు, అదియును గాక దేవతలవలన పొందిన వరబలము తోడైవున్నది. ఇవన్నియు అటులుంచగా రుద్రా౦శతో ఆవిర్భవించాడు. అయన ఋషుల అసనములను తీసుకొనిపోయి చెట్ల కొమ్మలకు వ్రేలాడదీసేడివాడు. వారి కమండలోదకములను పారబోసేడివాడు.వారి అంగవస్త్రములను చింపి పారవైచెడివాడు. అప్పుడప్పుడు ముద్దుగా వారి తోడలయ౦దు కూర్చొని హఠాత్తుగా వారి గెడ్డములనూ, మీసములనూ పీకి పారిపోవుచుండేడివాడు. బలాత్కారముగా అతనినెవరు ఆపలేరు కదా! అతడు పెద్దవాడగుచుండెను. విద్యాభ్యాసవయసు వచ్చినది. కానీ అతని బుద్ధి చాపల్యముతో మాత్రము మార్పురాలేదు.అంజనా కేసరులు విచారములో మునిగిపోయిన్నారు. వారు తమకు తోచిన అనేక రీతుల ప్రయత్నించిరి. కానీ హనుమంతుడు దారిలోనికి రాలేదు. అప్పుడువారు మహర్షుల నాశ్రయించి- “మహానుభావులారా! మీరు దయజూపవలెను . లేనిచో మా కుమారుడు బాగుపడదు “ అనిరి. అంత మహర్షులు దివ్యదృష్టి యోచించి- “ఇతనికి తన బలంపై మహాగర్వమున్నది. స్వశక్తిని మరిచిననే కానీ ఇతడు దారిలోకి రాజాలడు “అని నిశ్చయించుకుని, అవకాశమును పురస్కరించుకుని హనుమంతుని శపించుచూ-“నీవు నీ స్వబలమును మరచిపోవుగాక, ఎవరైనను ఎప్పుడు నీ బలపౌరుషములను గురించి నీ స్మరణకు తెచ్చేదరో, అప్పుడు నీవు బలమును స్మరించుకుని స్వశక్తిని సద్వినియోగము చేసికోనేదవుగాక!” అనుటతో, హనుమంతుడు తన బలమును తాను మరచిపోయేను. విద్యాభ్యాసవయస్సు రాగానే కేసరి తన కుమారునకు ఉచిత సంస్కారము చేయించి వేదాధ్యయనార్ధము సూర్యభగవానుని వద్దకు పంపెను. హనుమంతుడక్కడకుపోయి. వేదవేదాంగములను అధ్యయనము చేసెను. అతడు వేరే అధ్యయనము చేయవలెనా? సాక్షాత్తు శివుడేకదా! అయిననూ సాంప్రదాయ పరంపరను రక్షించుటకే అయనట్లధ్యయనము చేసి, మతపితురుల వద్దకు మరలివచ్చేను. సూర్యుని కరుణ వలన తమ కుమారుడు సర్వవిద్యాపారంగతుడగుట చూచి ఆ తల్లితండ్రులు అమితానంద మందిరి.