గురువారం ఇలా చేస్తే గురుదోషం నివారణ అవుతుంది..!
గురువారం ఇలా చేస్తే గురుదోషం నివారణ అవుతుంది..!
ప్రతి ఒక్కరి జీవితంలో గ్రహ దోషాలు ఉంటాయి. ఈ దోషాల కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి దోషాలలో గురుదోషం ఒకటి. గురుదోషం ఉన్నవారి జీవితంలో విద్యలో ఆటంకాలు, ధనం విషయంలో ఇబ్బందులు, సంతానంలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయి. అవగాహనా లోపం, విషయాలను అర్థం చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాల సమస్యలు కూడా వస్తాయి. బృహస్పతిని గురువు అని అంటారు. ఆయన దేవతలకు గురువు. గురుదోషం ఉన్నప్పుడు బృహస్పతిని ఆరాధిస్తే మంచిది. అయితే పరమేశ్వరుడి గురువు రూపాన్ని దక్షిణామూర్తి అని అంటారు. అట్లాగే దత్తాత్రేయుడు, రాఘవేంద్రస్వామి.. ఇట్లా చాలామంది గురువులు సనాతన ధర్మంలో ఉన్నారు. వీరందరూ అజ్ఞానాన్ని తొలగించేవారు. వీరిని ఆరాధిస్తే గురుదోషానికి నివారణ ఉంటుంది. గురుబలం పెరుగుతుంది. అయితే గురువారం రోజు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి.
దక్షిణామూర్తి విశిష్టత..
దక్షిణామూర్తి అంటే శివుడు గురువు రూపంలో ఉండటం. ఆయన దక్షిణ దిక్కున కూర్చుని తన శిష్యులకు మౌనంగానే తత్త్వజ్ఞానాన్ని భోధించాడని పురాణాలు చెబుతున్నాయి. దక్షిణామూర్తిని జ్ఞానమూర్తి, విద్యాదాత, శాస్త్రబోధకుడు, గురువులకు గురువుగా భావిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం జాతకంలో గురుదోషం ఉంటే దక్షిణామూర్తి ఆరాధన చాలామంది ఫలితాన్ని ఇస్తుంది.
గురువారం దక్షిణామూర్తి ఆరాధన విధానం..
గురువారం రోజు దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల గురుదోషన్ని తొలగించుకోవచ్చు. ఈ రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి.
దక్షిణదిక్కున చూస్తూ కూర్చున్న దక్షిణామూర్తి విగ్రహం లేదా చిత్రంను ప్రతిష్ఠించి పూజ చేయాలి.
పసుపు కుంకుమ, పువ్వులు, అక్షతలు, చందనం అగరువత్తులు, ధూపం, దీపం.. ఇట్లా షోడషోపచార పూజ నిర్వహించాలి.
దక్షిణామూర్తికి నైవేద్యంగా శనగపప్పు – బెల్లం నైవేద్యం సమర్పించాలి. దేవగురువు అయిన బృహస్పతి ఈ నైవేద్యానికి సంతోషిస్తారు.
దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి లేదా దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం శ్రేష్ఠం. ముఖ్యంగా జగద్గురువు ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే చాలా మంచిది.
అట్లాగే గురువారం రోజు పూజ సమయంలో దక్షిణామూర్తి మంత్రాన్ని జపం చేయడం వల్ల కూడా చాలామంచి ఫలితం ఉంటుంది. ప్రతి గురువారం ఇలా చేస్తుంటే.. గురుబలం పెరిగి గురుదోషం నివారణ అవుతుంది.
*రూపశ్రీ.