Read more!

సకల దైత్య సంహారిణి శ్రీదుర్గ

 

 

బాష్కల, దుర్ముఖుల మరణవార్త విన్న మహిషాసురుడు ముందు ఆశ్చర్యపోయాడు.. తర్వాత కాస్త భయపడ్డాడు. అయినా బయటపడకుండా తనవారి వంక చూసి ‘ ఒక ఆడది, అబల, ఏకాకిగా మహావీరులైన మన బాష్కల,దుర్ముఖులను సంహరించిందంటే నమ్మలేకపోతున్నాను. అలాని వాస్తవాన్ని విస్మరించలేను. ఇందుకు ప్రతీకారంగా నేడే నేను యుద్ధరంగానికి వెళ్ళి, ఆ దుర్మార్గురాలిని సంహరించి వస్తాను’ అని అన్నాడు. అప్పుడు చిక్షురుడు లేచి ‘మన్నించండి మహాప్రభూ..,త్రిలోకైకవీరుడైన మహిషాసురుడు ఒక ఆడుదాన్ని చంపాడన్న అపఖ్యాతి మీకెందుకు.., ఇంతమంది మహావీరులున్నాం, మేమంతా ససైన్యంగా వెళ్ళి ఆ యుద్ధోన్మత్తను మట్టుబెట్టి వస్తాం, మీరు నిశ్చింతగా ఉండండి’ అని పలికాడు. మహిషాసురుడు సమ్మతించాడు. చిక్షురుడు అసిలోమ, తామ్ర, బిడాలాది మహావీరులను వెంటబెట్టుకుని, ససైన్యంగా యుద్ధరంగానికి వచ్చి., జగజ్జనని ముందు నిలబడ్డాడు. వెంటనే యుద్ధం ప్రారంభించకుండా.. మంచి మాటలతో ఆమె మనస్సు మార్చాలని ప్రయత్నించాడు. వాడి ఒక్కొక్క మాట మహాదేవిలో కోపాన్ని రగిల్చాయేగానీ., మహిషునిపై మరులను కలిగిచలేక పోయాయి. ఆమె రక్తలోచనియై., శంఖం పూరించి, ధనుష్టంకారం చేసింది. ఆ శబ్దానికి రాక్షససేనావాహిని గుండెలు పగిలి, భయంతో ప్రాణాలు అరచేతబెట్టుకుని, నలుదిక్కులకు పరుగులు తీసారు.

పారిపోతున్న తన సైన్యాన్ని చూసి, చిక్షురుడు మండిపడి ‘పిరికిపందల్లారా, పారిపోతారేమిటి, ఆగండి, మీరేమీ యుద్ధం చేయనక్కరలేదు, నా ధనుర్విద్యా పాండిత్యాన్ని పరికించండి. ఈ యుద్ధరంగం సాక్షిగా నేడే ఈ మదోన్మత్తను మృత్యుదేవతకు నివేదనగా సమర్పిస్తాను, నన్ను నమ్మండి’ అని పలుకడంతో రాక్షససైనికులు ధైర్యంగా యుద్ధరంగంలో నిలిచారు.   అప్పుడు చిక్షురుడు జగజ్జనని వైపు తిరిగి ‘ సుందరీ., చివరిసారిగా హెచ్చరిస్తున్నాను.  యుద్ధంవల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఖడ్గప్రహారాలు, గదాఘాతాలూ, శర,శస్త్రక్షతాలూ తప్ప మరే ఆనందమూ లేదు. కనుక నా మాటవిని త్రిలోకైకవీరుడైన మహిషాసురుని చేపట్టు. చంద్రకాంతశిలాభవనాలలో, సుగంథ సంభరిత కుసుమోద్యాన వనాలలో విహరిస్తూ.. పరిమళ తైలాభ్యంగస్నానాలను అనుభవిస్తూ., షడ్రసోపేతమైన భోజనాలను ఆస్వాదిస్తూ., హంసతూలికాతల్పాలపై మదనకదనకుతూహల రాగాలు ఆలాపిస్తూ., మా మహిషునితో నిర్విరామ కామోపభోగాలు అనుభవించక., యుద్దరంగంలో మరణాన్ని కోరుకుంటావేమిటి?  అని లాలనగా పలికాడు. చిక్షురుని ప్రసంగం జగజ్జనని కోపానికి ఆజ్యం పోసినట్టయింది. ఆమె భీకరంగా హుంకరించి ‘ఆపరా వాచాలా.., మీ మహిషుడి రక్తంతో ఈ నేలను చదునుచేసి, శాంతిబీజాలు నాటి, కీర్తికేతనాన్ని ప్రతిష్ఠించి విజయంతో వెనుదిరిగి వెడతాను’ అని పలికి ధనుస్సుకు శరాన్ని సంధించింది. అది చూసి చిక్షురుడు జగదంబపై శరవర్షాన్ని కురిపించాడు. జగన్మాత ఆ బాణాలను ఖండించి, పన్నగాల్లాంటి బాణాలు ప్రయోగించింది. అయినా వాడు చలించక ఎదురునిలిచాడు. అదిచూసి మహాదేవి ఉగ్రరూపం ధరించి తన గదతో వాడి రథాన్ని పడగొట్టి, మరో ఘాతంతో వాడి శిరస్సుపైన బలంగా మోదింది. ఆ దెబ్బకు చిక్షురుడు మూర్ఛబోయాడు. 

తన సహసేనాని మూర్ఛబోవడం చూసి, తామ్రుడు క్రోధతామ్రాక్షుడై జగజ్జనని ముందుకు ఉరికి శరసహస్రాలను కురిపించాడు. కానీ ఏ ఒక్క బాణాన్ని తన దరి చేరనీయకుండా మార్గమధ్యంలోనే వాటిని తుత్తునియలు చేసింది జగదంబ. ఆమె రణకౌశలానికి ఆశ్చర్యపోమాడు తామ్రుడు. అప్పటికి మూర్ఛనుంచి తేరుకున్న చిక్షురుడు., తామ్రునితో కలిసి యుద్ధానికి దిగాడు. జగజ్జనని వారిద్దరితో యుద్దం చేస్తూనే రాక్షససైన్యాన్ని నామరూపాలు లేకుండా చేసింది. అంతటితో ఆగక తన శరపరంపరతో ఆ రాక్షసులిద్దరి శరీరాలను రక్తసిక్తం చేసింది. దానితో తామ్రుడు లేని ఓపిక తెచ్చుకుని తన గదతో మహాదేవి వాహనమైన సింహం తలపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు సింహం బాధగా మూలిగింది. వాడు విజయగర్వంతో వికటాట్టహాసం చేస్తూంటే జగజ్జనని సహించలేక,  నిశితఖడ్గంతో వాడి తల తెగనరికింది. ఆ తెగిన తల బొంగరంలా గిరగిర తిరుగుతూ  పెద్ద శబ్దం చేస్తూ నేలమీద పడింది. తన సహఅనుచరుడైన తామ్రుని తల తెగి పడడం చూడగానే దుర్ముఖుడు వీరావేశంతో కేకలువేస్తూ పెద్ద ఖడ్గం చేతపట్టుకుని  పరుగు పరుగున జగజ్జనని దగ్గరకు వస్తూంటే., మహాదేవి ఐదు నిశితశరాలు వదిలింది.

ఒక శరం వాడి చేతిలోని ఖడ్గాన్ని  ఖండించగా., మరొక శరం వాడి దక్షిణహస్తాన్ని నరికేసింది. మిగిలిన మూడుబాణాలూ  వాడి తలను తన్నుకుపోయాయి. తలలేని దుర్ముఖుని  శరీరం కొంత దూరం అస్తవ్యస్తంగా అడుగులు వేసి నేలకు ఒరిగిపోయింది. అదిచూసి, అసిలోముడు, బిడాలుడు, జగన్మాత ముందుకు ఉరికారు. జగదంబ వారిని చూసి ప్రళయభీకరంగా నవ్వింది. ఆ నవ్వుకు వారిరువురి రక్తం భయంతో గడ్డకట్టుకు పోయింది. అయినా అసిలోముడు ధైర్యం చిక్కబట్టుకుని., జగజ్జనని ముందుకు రెండు అడుగులు వేసి ‘ఇంత సుందర రూపంగల నీలో ఇంత కాఠన్యం ఉందని ఊహించలేదు. నీకు, మాకు మధ్య ఏ విధమైన పగ, ప్రతీకారము, శత్రుత్వము లేవు. ఇలా అకారణంగా మావారిని ఎందుకు చంపుతున్నావో అర్థం కావడంలేదు’ అని అన్నాడు. అసిలోముని తర్కానికి   జగదంబ ముచ్చటపడి, చిరునగవుతో ‘ఇంత యుద్ధం జరిగాక నీవు ఒక్కడివే ఈ ప్రశ్న వేసావు. సంతోషం. నేను సర్వకాలాల్లోనూ.,సర్వలోకాల్లోనూ సంచరిస్తూ, ప్రాణికోటి చేసే సమస్తకర్మలనూ పరిశీలిస్తూ., వాటికి అనుగుణంగా సుఖ, దుఃఖాలను కలుగజేస్తూంటాను. నేను కర్మసాక్షిని. ధర్మసంరక్షణ నా విధి. మీ మహిషుడు తన స్వార్థం కోసం దేవలోకాలు జయించి, దేవతలను నానా కష్టాలకూ గురి చేసాడు.

అందుకు ప్రతిఫలమే ఈ యుద్ధము. ఇప్పటికైనా మించిపోయినది ఏమీలేదు. మీ మహిషుడు దేవతలతో వైరాన్ని విడిచిబెట్టి, వారి దేవనగరాలు వారికిచ్చి, దేవతలతో సంథి చేసుకుని పాతాళానికి పోయి ప్రాణాలు కాపాడుకోమని చెప్పు. లేదా యుద్ధంలో మరణించక తప్పదని చెప్పు’ అని చెప్పింది. అప్పుడు బిడాలుడు విసుగుచెంది చిరాగ్గా ‘అసిలోమా.., ఈ మూర్ఖురాలితో వాదన అనవసరం. యుద్ధమే ఈ వాచాలికి సరైన సమాధానం’ అని పలుకుతూ ఏడు బాణాలు సంధించి వదిలాడు. జగదంబ ఆ బాణాలను మార్గమధ్యంలోనే ఖండించి, మరో మూడు బాణాలతో బిడాలుని తీవ్రంగా గాయపరచింది. అంతే., బిడాలుడు మూర్ఛ బోయాడు..., మరి లేవలేదు.  బిడాలుని మరణం అసిలోముని ఆగ్రహానికి గురిచేసింది. వాడు తన గదతో మహాదేవి వాహనమైన సింహం తలపై బలంగా కొట్టాడు.  ఆ దెబ్బకు సింహం బాధగా మూలిగి తన పంజా విసిరింది. దానితో వాడి వక్షం చీరుకుపోయింది.అసిలోముడు తూలి క్రంద పడినా.,  వేగంగా పైకిలేచి, మహాదేవి తలపై గదతో కొట్టబోయాడు. జగజ్జనని మెరుపు వేగంతో తన  నిశితఖడ్గంతో వాడి తల ఖండించింది.. ఆ తెగిన తల బొంగరంలా గిరగిర తిరుగుతూ  పెద్ద శబ్దం చేస్తూ నేలమీద పడింది. అంతే.,రాక్షసుల హాహాకారా లతో, దేవతల జయజయధ్వానాలతో ఆనాటి యుద్ధం ముగిసింది. ఆకాశం నుంచి పూలవాన కురిసింది. సకల ఋషులూ  మహాదేవిని ప్రస్తుతించారు.

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం