Read more!

మహిషాసుర సంహారం

 

మహిషాసుర సంహారం  



మహిష సంహారానికి మరణ ముహూర్తం దగ్గర పడిందని జగజ్జనని గ్రహించింది. అందుకే ఆ సమయం వచ్చేవరకూ అతని కబుర్లతో కాలక్షేపం చేసింది. అంతవరకూ మహిషుడు చెప్తున్న మందోదరి కథను వింటున్న మహాదేవి ఉన్నట్టుండి రక్తలోచనియై..‘ఆపరా.. మూర్ఖుడా..నీ కల్లబొల్లి కాకమ్మ కథలు. నీ జీవితానికి తుది ఘడియలు సమీపించాయి.
నాతో యుద్ధం చేసి వీరమరణాన్ని పొందుతావో., లేక పిరికిపందలా పారిపోతావో తొందరగా తేల్చు’ అని గర్జించింది. అప్పటికి మహిషునకు మహాదేవి స్థిరసంకల్పం బాగా అర్థం అయింది. ఈమెను మాటలతో గెలవలేము.,వీరత్త్వాన్ని ప్రదర్శించి వరించాలి అని తలచి..యుద్ధసన్నద్ధుడై ధనుష్టంకారం చేసి., జగజ్జననిపై శతాధిక సంఖ్యలో శరాలను కురిపించి వికటాట్టహాసం చేసాడు. మహాదేవి చిరుమందహాసం చేసి నిశిత శరప్రయోగంతో మహిషుని శరవర్షాన్ని చిందర వందర చేసింది. క్షణకాలంలో యుద్ధం తీవ్రరూపం దాల్చి.. సకల ప్రాణికోటిని భయ భ్రాంతులకు గురిచేసింది. దేవ దానవులు పరస్పర విజయకాంక్షతో యుద్ధం చేస్తున్నారు. భేరీ భాంకారలతో, గజ ఘీంకారాలతో, హయ హేషారావాలతో, రణరంగమంతా కోలాహలంగా మారింది.

అది చూసి దుర్థరుడనే రాక్షసవీరుడు రథంమీద మహావేగంగా మహాదేవి ముందుకు వస్తూ సహస్రాధిక సంఖ్యలో బాణాలు వదిలాడు. జగజ్జనని రక్తలోచనియై ఒకేఒక్క అర్థచంద్రాకార బాణంతో వాడి శిరస్సును ఖండించింది. వెంటనే త్రినేత్రుడు పెద్ద గదను గిరగిర తిప్పుతూ విజృంభించాడు. వాడు దివ్య శస్త్రాస్త్ర ప్రయోగ నిపుణుడు. వాడి ధనుర్విద్యా నైపుణ్యాన్ని చూసే ఉత్సాహం జగదంబకు లేదేమో..తన త్రిశూలంతో వాడి గుండెల్లో బలంగా పొడిచింది. మరుక్షణంలో వాడి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసాయి. అదిచూసి.. అంధకాసురుడనే దండనాయకుడు వీరంగమాడుతూ ముందుకు ఉరికి తన గదతో సింహం తలపై బలంగా కొట్టాడు. సింహం భీకరంగా గర్జించి, జూలు విదిల్చి, పంజా విసిరి, నోరుతెరిచి ఒక్క ముద్దగా వాణ్ణి తినేసి, బ్రేవ్ మని త్రేన్చింది.

తన కళ్ళముందే ముగ్గురు మహావీరులు అంబ ఆవేశానికి బలైపోవడంతో.. మహిషుడికి మతి చలించింది. పిచ్చికోపంతో శరవర్షం కురిపించాడు. జగజ్జనని ఆ బాణాలను మార్గమధ్యంలోనే ఖండించి, ఒక గదను వాడిపైకి విసిరింది. ఆ గదాఘాతానికి మహిషుడు క్షణకాలం మూర్ఛబోయి, అంతలోనే తేరుకుని తన గదతో సింహం తలపై కొట్టాడు. సింహం తన పంజా విసిరి, మహిషుడి శరీరాన్ని రక్తసిక్తం చేసింది.

వెంటనే మహిషుడు సింహరూపం ధరించి మహాదేవి సింహం మీదకు ఉరికాడు. జగదంబ తన శర పరంపరతో సింహరూపుడైన మహిషుని చీకాకు పరచింది.

మహిషుడు సింహరూపం వదిలి..గజరూపం ధరించి, రణరంగమంతా తిరుగుతూ చిందులు తొక్కాడు. తన తొండంతో ఓ పర్వతాన్ని పెకలించి అమ్మవారిపైకి విసిరాడు కానీ.. అమ్మ శక్తిముందు వాడి ప్రయత్నం విఫలమయింది. వెంటనే జగజ్జనని వాహనమైన సింహం ఆ ఏనుగు తలపైకి ఉరికి తన పంజాతో చీల్చివేస్తూంటే.. మహిషుడు భరించలేక, గజరూపాన్ని వదలి శరభరూపం ధరించాడు.

ఎనిమిది కాళ్ళతో మహాపర్వతంలా శరభరూపంలో వస్తున్న మహిషుని చూసి.. చరాచర జగత్తు నివ్వెరబోయింది. మహిషుడు మహాదేవి చేతికి అందేంత దగ్గరగా వచ్చాడు. అంబ ఓ నిశిత ఖడ్గంతో వాడి తలపై బలంగా మోదింది. మహిషుడు చెక్కుచెదరలేదు. వెంటనే చండికాదేవి ఎనిమిది అర్థచంద్రాకార బాణాలతో ఆ శరభం ఎనిమిది కాళ్ళను ఖండించడంతో ఆ శరభం చతికిలబడింది. మహాదేవి తన వివిధాయుధాలతో మహిషుని
శరీరాన్ని రక్తపు ముద్దగా చేసింది.

వెంటనే మహిషుడు శరభరూపం వదిలి తన నిజరూపమైన మహిషాసురునిగా మారి..
తన ముక్కుపుటాలనుంచి సుడిగాలులుఓసీ బుసలుకొడుతూండగా ‘ఓసీ రణచండీ.. పదునెనిమిది చేతులలో వివిధాయుధాలు ఉన్నాయనే అహంకారంతో నాతో యుద్ధానికి దిగి తప్పుచేసావు. ముందు నిన్ను చంపి ఆ తర్వాత దేవతలందరినీ చంపుతాను’ అని పలుకుతోంటే., జగజ్జనని నవ్వి ‘మహిషా.. నువ్వు నిజంగా మూర్ఖుడవే. ఇన్ని రూపాలు ధరించి పోరాడావు. అయినా నన్ను గెలవలేక పోయావు. పైగా నన్ను చంపుతానని డాంబికాలు పలుకుతున్నావు. చేతనైతే చంపు’ అని హేళనగా పలికింది. మహిషుడు రోషం తెచ్చుకుని తన కొమ్ములతో జగదంబను పొడిచి చంపబోయాడు. కానీ జగదంబ వాడికి ఆ అవకాశం ఇవ్వక., వాడి కొమ్ములు విరిగేలా తన శూలంతో మహిషుని తల మీద బలంగా పొడిచింది. మహిషుడు బాధగా మూలిగి, ప్రాణభయంతో పరుగు తీసాడు. జగదంబ తన శూలంతో వాడిని తరుముతూ వెంబడించింది. మహిషుడు తన మాయాజాలంతో రకరకాల రూపాలు ధరిస్తూ.. జగదంబ త్రిశూలానికి అందకుండా పారిపోతూంటే., విసుగు చెందిన మహాదేవి ఒక్కసారిగా సింహం మీదనుంచి గాలిలోకి ఎగిరి మహిషుని గుండెలమీద బలంగా తన్నింది. ఆ దెబ్బకు మహిషుడు వెల్లకిలా పడి, తన కాళ్ళతో మహాదేవిని తన్ని విజయగర్వంతో వికటాట్టహాసం చేసాడు. జగజ్జనని వాడి పాలిటి మృత్యుదేవతయై., తన చక్రాయుధాన్ని ప్రయోగించింది. నూరు అంచులుగల ఆ చక్రం ప్రచండవేగంతో తిరుగుతూ వచ్చి మహిషుడి శిరస్సు ఖండించింది. మహాపర్వతంలాంటి మహిషుడి దేహం బొంగరంలా గిరగిరా తిరుగుతూ నేలకు ఒరిగింది.
మహిషుడు మరణించాడు. హతశేషులైన రాక్షసులు ప్రాణభయంతో నలుదిక్కులకూ పారిపోతూంటే  అమ్మవారి సింహవాహనం వారిముందు ప్రత్యక్షమై అందరినీ తినేసి తన ఆకలి తీర్చుకుంది.

దేవతలు జయజయధ్వానాలు చేసారు. అప్సరసలు ఆడి., పాడారు. సర్వప్రాణికోటి ఆ మహిషాసురమర్దినిని భక్తిగా కీర్తించారు.

        

     ‘జయజయహే మహిషాసురమర్దిని - రమ్యకపర్దిని శైలసుతే’  

                                                  

- యం.వి.యస్.సుబ్రహ్మణ్యం