దివ్యగాథల తల్లి దుర్గాదేవి
దివ్యగాథల తల్లి దుర్గాదేవి
నిత్యపూజలలో అమ్మలగన్న అమ్మకు ప్రత్యేక పూజలు అందిస్తూనే ఉన్నా దసరా దినాల్లో ఆ తల్లికి పూజలు చేసి కరుణాకటాక్షాలు పొందేందుకు భక్తులు సిద్ధంగా ఉంటారు. 'అమ్మ' బహురూపధారిణి మాత్రమే కాదు. బహునామధేయిని కూడా.
కంచి కామాక్షీ, కాశీ విశాలాక్షీ, బెజవాడ కనకదుర్గ, మధుర మీనాక్షి, శ్రీశైల భ్రమరాంబిక, సంతోషిమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మూకాంబిక, ఈశ్వరి, వాగేశ్వరి, చండీ, చాముండి, వైదేహి, వైష్ణవి, రాజరాజేశ్వరి, లలిత, పార్వతి, బాలాత్రిపుర సుందరి, కామేశ్వరి, వారాహీ....ఏ పేరుతో పిలిచినా, ఏ రూపుతో కొలిచినా దీవెనలందించే అమ్మ.
దుర్గా అనే రెండక్షరాలకు అర్థం చెడును అంతం చేసేది అని అర్థం. మహావిఘ్నాలు, శోకం, దుఃఖం, భవబంధాలు, కర్మం, నరకం, భయం, అతిరోగం, యమదండం అనే చెడును అంతం చేసే దేవత. శ్రీమన్నారాయణుడికే శక్తి కాబట్టి 'నారాయణి' అన్న పేరు పొందింది. సర్వసిద్ధులు ప్రసాదిస్తుంది కనుక 'ఈశాని' అయింది.
మాయచేత విశ్వాన్ని మోహింపజేస్తుంది కాబట్టి విష్ణుమాత, శివునికి కళ్యాణాన్ని ప్రసాదించేది కావడం వల్ల శివాని, నిత్యపతివ్రాత కనుక సతీ, భగవంతుడిని తన శక్తి చేత ప్రజ్వరిల్లింపజేస్తుంది కాబట్టి భగవతి, ప్రకృతి ప్రధానాంశం కాబట్టి సత్యా, సర్వప్రాణులమోక్షం కలిగించేది కాబట్టి శర్వాణీ, సంపదలు, వివాహాన్ని ఇస్తుంది కాబట్టి సర్వమంగళ, జగన్మాత వందితురాలు కనుక అంబికా, వైష్ణవి, నిశ్చలంగా నిర్మలంగా పచ్చని రంగుతో భాసిస్తుంది కాబట్టి గౌరి అయింది.
ఖ్యాతి కలిగినది కాబట్టి పార్వతి, సర్వకాలంలో విస్తృతమై ఉంటుంది కనుక సనాతని, నిత్యుడైన ఈశ్వరునితో లయం అవుతుంది కనుక షోడశ (16 ) నామాలతో దుర్గా అమ్మవారు పూజించబడుతుంది.