మరణించిన వారి కోసం అతిగా ఏడవకూడదు.. ఎందుకో తెలుసా!

 

మరణించిన వారి కోసం అతిగా ఏడవకూడదు.. ఎందుకో తెలుసా!


పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. మనమే కాదు.. మన చుట్టూ ఉన్నవారు కూడా ఏదో ఒక రోజు మరణిస్తారని తెలుసు. అయినా సరే.. ఒక మనిషి మరణించాడు అంటే భరించలేం.  మనిషి మరణించిన వెంటనే ఏడవడం ఒకటైతే.. మనిషి అంత్యక్రియలు ముగిసాక.. కుటుంబంలో ఎవరో ఒకరు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇలా ఏడవకూడదని చెబుతున్నారు కొందరు.  అసలు మరణించిన వారి కోసం అతిగా ఏడిస్తే ఏం జరుగుతుంది? ఎందుకు ఏడవకూడదు? తెలుసుకుంటే..

ఒక మనిషి మరణించాక ఆ మనిషిని తలచుకుంటూ ఆ మనిషికి ఎంతో ఇష్టమైనవారు,  ఆ మనిషిని ఎంతో ప్రేమించేవారు కేవలం అంత్య క్రియల వరకు మాత్రమే కాకుండా ఆ తరువాత కూడా చాలా కాలం పాటు ఏడుస్తూనే ఉంటారు.  కొందరు తమకు ఎంతో ఇష్టమైన వారి మరణాన్ని అస్సలు జీర్ణించుకోలేరు. కానీ ఇలా పదే పదే చనిపోయిన మనిషిని గుర్తుచేసుకుని ఏడ్చేటప్పుడు ఆ కన్నీళ్లే మరణించిన ఆత్మకు ఆహారంగా మారతాయని,  దీని ఫలితంగా ఆ ఆత్మ అక్కడి నుండి ముందుకు సాగదని గరుడ పురాణంలో ఉందని చెబుతున్నారు.

ఆత్మకు ఇష్టం లేకపోయినా ఆ కన్నీళ్ళను ఆహారంగా తీసుకోవాల్సి వస్తుందని, ఆత్మకు ఇది పెద్ద శిక్ష లాంటిదని చెబుతున్నారు. దీని కారణంగా మరణించిన వారి కోసం కార్చే కన్నీరు,  పడే దుఃఖం ఆ ఆత్మను ముందుకు సాగనివ్వకుండా అక్కడే  కష్టపెడుతూ ఉంటుందట.

మరణించిన తర్వాత ప్రతి ఆత్మ పితృలోకాల వైపు ప్రయాణం చేయాలి.  కానీ మరణించిన వారికోసం కార్చే కన్నీరు ఆత్మను పితృలోకాలకు వెళ్లకుండా కట్టిపడేసినట్టు అవుతుందని చెబుతున్నారు.


ఆత్మ శాంతి కోసం పిండప్రదానాలు చేయడం,  అన్నదానం చేయడం వంటివి చేయడం వల్ల ఆత్మను కష్టపెట్టకుండా పితృలోకాలకు వెళ్లడానికి సహాయపడినట్టు అవుతుందట.  అందుకే ఎంత ఇష్టమైన వారైనా సరే.. మరణించినప్పుడు వారి మీద ప్రేమతో అతిగా కన్నీరు పెడుతూ, బాధపడుతూ ఉంటే.. అది మరణించిన వ్యక్తి ఆత్మకు చాలా కష్టాన్ని తెచ్చిపెడుతుంది.  అందుకే.. మరణించిన వారికోసం బాధపడకుండా మరణం తర్వాత వారి ఆత్మ శాంతంగా ఉండాలని కోరుకోవాలని చెబుతారు.

                            *రూపశ్రీ.