Read more!

జగజ్జననితో మహిషాసురుని ప్రత్యక్ష యుద్ధం

 

జగజ్జననితో మహిషాసురుని ప్రత్యక్ష యుద్ధం     

 



అసిలోమ, బిడాల, తామ్ర, దుర్ముఖుల మరణం మహిషాసురుని మనస్సును బాగా కృంగదీసింది. మహూర్తకాలం సేపు మామూలు మనిషి కాలేకపోయాడు. కొంతసేపటికి తేరుకున్న మహిషుడు క్రోధోద్రిక్తుడై సూతుని పిలిచి రధం సిద్ధం చెయ్యమన్నాడు. పతాక ధ్వజాలంకృతమూ, వివిధాయుధ పరిపూర్ణమూ అయిన దివ్యరధానికి వెయ్యి గాడిదలు పూన్చి మహిషుని ముందు నిలబెట్టాడు సూతుడు. రధం ఎక్కబోతూ ఒకసారి తన రూపం వంక చూసుకున్నాడు. నల్లనిశరీరం, పెద్దకొమ్ములు, గేదెముఖంతో ఉన్న తన ముఖం తనకే అసహ్యమనిపించింది. ‘ఛీ.., ఈ రూపంతో వెడితే ఆ సుందరి వలచి వరించదు సరికదా.. అసహ్యించుకుంటుంది. స్త్రీలను ముందుగా ఆకర్షించేది రూపం. కనుక అందమైన రూపంతో ఆమె ముందు నిలబడతాను’ అని అనుకుని అపర మన్మథావతారంగా రూపం మార్చుకుని రధం ఎక్కాడు. రథం కదిలింది. మొత్తం రాక్షస సైన్యం ఆ రధం వెంట నడిచింది.

మానవరూపంలో వస్తున్న దానవనాథుని అల్లంత దూరంనుంచే చూసి., వచ్చేవాడు మహిషుడే అని గుర్తించింది మహాదేవి. వెంటనే దిక్కులదిరేలా శంఖనాదం చేసింది. ఆ శబ్దానికి రాక్షససైన్యం తల్లడిల్లిందిగానీ..మహిషుడు మాత్రం బెదరలేదు. నిదానంగా రథాన్ని నడుపుకుంటూ జగజ్జనని ముందుకు వచ్చి ఆగి., మహాదేవిని ఆపాదమస్తకం
పరికించాడు. జగజ్జనని సౌందర్యం మహిషునిలో యుద్ధతీవ్రతకు బదులు మోహతీవ్రతను పెంచింది. వచ్చిన సంగతి మరచి ఆమెతో సంభాషణకు దిగాడు. ‘ఓ లలనామణీ.. నీ సౌందర్యం గురించి మావాళ్ళు చెప్పినప్పుడే నేను మోహసాగరంలో పడిపోయాను.ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఊహకు అందని నీ సౌందర్యం గురించి ఎంత వర్ణించి చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నీకో ప్రకృతి సత్యం చెప్పాలనిపిస్తోంది. ప్రకృతిసుఖం అనేది.. స్త్రీ, పురుషుల కలయికలోనే ఉంది. ఒంటరిగా ఉంటే ఎవరికీ ఏ సుఖమూ లేదు. ఇది నేను అనుభవంతో చెబుతున్న మాట.నీకా అనుభవం లేదు కనుక సుఖాలు అనుభవించాల్సిన ఈ వయసును, సొగసును, అందాల సోయగాలను ఆహవరంగానికి అంకితం చేస్తానంటున్నావు. ఇంతకన్న వెర్రి ఇంకేమయినా ఉందా? నా మాట విని నీ చేతులలోని ఆయుధాలన్నీ క్రింద పారేసి.., చిరునవ్వుతో నా చేయి పట్టుకో. త్రిమూర్తులకు కూడా అందని త్రిలోకసుఖాలు అనుభవిస్తూ త్రిభువనాలనూ పాలించు’ అన్నాడు.

‘దైత్యనాయకా, కామంతో కళ్ళు మూసుకుపోయి నీవిలా పలవరిస్తన్నావు.పరమాత్ముని
తప్ప నేనెవరినీ ప్రేమించను. ఆ మహాపురుషుని ఇచ్ఛకు ప్రతిరూపాన్ని నేను. ఆయన కోరిక మేరకు సృష్టికార్యాన్ని నిర్వహిన్తూంటాను. ఆ విశ్వాత్మకుడే నా సంరక్షకుడు. నిజానికి నేను జడాన్ని. నన్ను చైతన్యపరచేది ఆ పరమపురుషుని సాన్నిధ్యమే. ఈ సత్యం గుర్తించలేని మహామూర్ఖుడవు కనుకనే నన్నొక సాధారణ స్త్రీగా భావించి.. స్త్రీ సంగమాన్ని వాంఛిస్తున్నావు. నీ సంహారం కోసమే దేవతలందరూ ఏకమై నన్ను సృష్టించి పంపారు. కారణం ఏదైనా., నన్ను ప్రేమించిన వ్యక్తివి కనుక., చివరిసారిగా నీకొక అవకాశం ఇస్తున్నాను. నీకు జీవించాలనే ఆశ ఉంటే., దేవతలతో వైరాన్ని విడిచిపెట్టి, వారి దేవనగరాలు వారికి అప్పగించి పాతాళానికి వెళ్ళిపో. లేదా.. నీకు మరణం తప్పదు’ అని హెచ్చరించింది జగజ్జనని. అయినా కామాతురుడైన మహిషునిలో మార్పురాలేదు. మోహంతో కూడిన పరిహాసాన్ని తన పెదవులపై నర్తింపజేస్తూ ‘సుందరీ., నా శక్తి తెలియక ఇలా పలుకుతున్నావు. త్రిమూర్తులంతటివారే నా ముందు నిలువలేక తోకముడిచి పలాయనం చిత్తగించారు. మహిషాసురుడంతటి మహావీరుడు ఓ ఆడుదానిని సంహరించాడన్న అపకీర్తి నాకు ఇష్టంలేక ఆగానుకానీ.., లేకపోతే ఈ క్షణంలో నిన్ను నాతో తీసుకునిపోయేవాడిని. అలా ఎందుకు చేయలేదో తెలుసా? బలాత్కారంలో సుఖంలేదు. శృంగారమనేది ఏకపక్షంగా చేసే యుద్ధం కాదు.., రెండు మనసులు కలసిచేసే సంయోగ సంగ్రామం. నీవు సర్వావయవ సౌందర్యనిధివేగానీ అందుకు తగిన శృంగార చాతుర్యమే లేదు. అందుకే నావంటి మహావీరునితో ప్రణయాన్ని వ్యతిరేకిస్తున్నావు. వెనుకటికి మందోదరి అనే మదవతి నాలా ప్రేమించే పతిని విడనాడి., ఓ శుంఠను పెళ్లాడి, ఏ సుఖానికీ నోచుకోక, కామజ్వాలలకు తన ప్రాయాన్ని బలిచేసింది. చివరకు నీ బతుకు అలా అవుతుందేమోనని నాకు చాలా బాధగా ఉంది’ అన్నాడు. మహిషుడి మాటలు విన్న జగదంబ కుతూహలంతో ‘ ఆ మందోదరి కథ ఏమిటో చెప్పు’ అని అడిగింది.

ఆమాత్రం పలుకులకే మహిషుడు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బౌతూ ‘పూర్వం సింహళ ద్వీపాన్ని పాలించే చంద్రసేనుని కుమార్తె  ఈ మందోదరి. ఆమెకు యుక్తవయస్సు రాగానే సకలకళాప్రపూర్ణుడైన కంబుగ్రీవునికిచ్చి వివాహం జరిపించాలని తలచాడు చంద్రసేనుడు. పెళ్లి మాట వింటూనే కోపంతో కస్సుమని లేచింది మందోదరి. నేనెవరినీ పెళ్లాడను. జీవితాంతం కన్యగానే ఉంటాను. స్వతంత్రంగా బతుకుతాను. సంసారం ఓ శోకసాగరం. ఆ బతుకే ఓ భయంకర నరకం. నాకా బతుకు వద్దు. అని ఏవేవో కబుర్లుచెప్పి వివాహాన్ని వద్దంది. ఎవరూ ఆమె మనసుని మార్చలేకపోయారు. కొంతకాలం గడిచింది. మందోదరి చెల్లెలు యుక్తవయస్కురాలయింది. ఆమెకు స్వయంవరం ప్రకటించాడు చంద్రసేనుడు. ఆ స్వయంవరానికి మద్రదేశాధీశుడైన చారుధేష్ణుడు కూడా వచ్చాడు. వాడు స్త్రీలను వశ్యం చేసుకోవడం బాగా తెలుసు. మందోదరి వాడి మాయలో పడి అతన్ని పెళ్లి చేసుకుంది., వాడితో శృంగార జీవితాన్ని పంచుకుంది. చారుధేష్ణుడు స్త్రీలోలుడు, నీచుడు. ఒకరోజు రాత్రి తన భర్త వేశ్యాసంగమం చేస్తూండగా మందోదరి చూడడం జరిగింది. అంతే సంసారజీవితం మీద విరక్తి కలిగింది. భర్తను పరిత్యజించి శేషజీవితాన్ని తన ఏకాంత మందిరానికి అంకితం చేసింది. కనుక నీ బతుకు అలా అడవి గాచిన వెన్నెల కాకుండా., నన్ను చేబట్టి అంతులేని అమరసుఖాలు నీ సొంతం చేసుకో’ అని  అనునయంగా పలికాడు.

- మహిషుని మాటలకు మహాదేవి మోహసాగరంలో పడిందా.., లేక వాడిని    సంహరించిందా?

తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే, రేపు ఇదే‘వెబ్ సైట్’కి.. ‘లాగిన్’ అవ్వండి., చదివి ఆనందించండి.
                                                  

  - యం.వి.యస్.సుబ్రహ్మణ్యం