సమస్యలపై బ్రహ్మస్త్రం దుర్గాదేవి _ద్వాత్రింశన్నామావాళి!!

 

సమస్యలపై బ్రహ్మస్త్రం  దుర్గాదేవి _ద్వాత్రింశన్నామావాళి!!

శత్రువుల వలన పీడింపబడేవారు, భయాల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవారు ఇలా  ఎవరైనా సరే దుర్గాదేవి ద్వాత్రింశన్నామావళిని భక్తితో,  ఆ దుర్గామాత నన్ను కాపాడుతుంది అనే నమ్మకాన్ని మనసులో ఉంచుకుని  32 నామాలతో  స్తోత్రం చేయాలి. సమస్యల వల్ల పతన దశలో ఉన్నవారిని కూడా అమ్మవారు రక్షిస్తుంది. నీడలా వెన్నంటి ఉండి కాపాడుతుంది.  పడిపోతున్న వారికి చేయందించి పైకి లాగుతుంది, అంతటి శక్తికల 32 నామాలు 

దుర్గా
దుర్గార్తి శమణీ
దుర్గాపద్వినివారిణీ
దుర్గమచ్చేదినీ 
దుర్గసాధినీ 
దుర్గనాశినీ
దుర్గతోద్ధారిణీ
దుర్గనిహంత్రీ
దుర్గమాపహ
దుర్గమదేజ్ఞానదా 
దుర్గ దైత్యలోకదవానలా
దుర్గమ
దుర్గమాలోక
దుర్గమాత్మస్వరూపిణీ
దుర్గమార్గాప్రద
దుర్గమావిద్యా
దుర్గమాశ్రిత
దుర్గమజ్ఞానసంస్థాన 
దుర్గమధ్యానభాసిని
దుర్గమోహ 
దుర్గమగ 
దుర్గమర్థస్వరూపిణీ
దుర్గమాసుర సంహంత్రి
దుర్గమాయుధదారిణీ
దుర్గమాంగీ
దుర్గమత
దుర్గమ్య
దుర్గమేశ్వరీ 
దుర్గభీమా 
దుర్గభామా
దుర్లభా
దుర్గధారిణీ 

పైన చెప్పుకున్నవి దుర్గాదేవి ముప్పైరెండు నామాలు. ఈ ముప్పై రెండు నామాలకు ముందు "ఓం" ను చేర్చి చెప్పుకోవాలి. ఇలా 108 సార్లు ఈ 32 నామాలను చెప్పుకోవాలి. ముఖ్యంగా దుర్గాష్టమి రోజున ఇలా చేయడం వల్ల జీవిత సమస్యల విషయంలో ఎంతో ఉపశమనం చేకూరుతుంది. 

ఇక ఈ 32 నామాలలో ఇమిడి ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే:- 

1.దుర్గా: భక్తుల చుట్టూ ఒక కోటలా రక్షణగా ఉండి కాపాడే తల్లి నీకు వందనం.

2.దుర్గార్తిశమణీ: కష్టాలను శమింపచేసే (తొలగించే) తల్లి నీకు వందనం.

3.దుర్గాపద్వినివారిణీ: ఆపదలను నివారించే తల్లీ నీకు వందనం.

4.దుర్గమచ్ఛేదినీ: కష్టాలను ఛేదించే తల్లీ నీకు వందనం.

5. దుర్గసాధినీ: దుర్గమమైనది సాధించే తల్లీ నీకు వందనం.

6.దుర్గనాశినీ: కష్టాలను నాశనం చేసే తల్లీ నీకు వందనం.

7. దుర్గతోద్దారిణీ: దుర్గాలలో (కష్టాలలో) కూరుకుపోయిన వారిని రక్షించే తల్లీ నీకు వందనం.

8.దుర్గనిహంత్రీ: మనదగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లీ నీకు వందనం.

9.దుర్గమాపహ: కష్టాలను వినాశనం చేసే తల్లీ నీకు వందనం.

10.దుర్గమదేజ్ఞానదా: రహస్యమైన ఆత్మజ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లీ నీకు వందనం.

11.దుర్గదైత్యలోకదవానలా: కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లీ నీకు వందనం.

12.దుర్గమ: అమ్మను సాధించడానికి ఆశక్యమైన తల్లీ నీకు వందనం(తేలికగా దర్శనం ఇవ్వని తల్లి).

13.దుర్గమాలోక: చర్మచక్షువులు, పంచేంద్రియాలతో చూడలేని తల్లీ నీకు వందనం. (అంటే మనసుతో మాత్రమే చూడగలిగేది. అంతటి సూక్ష్మ పరిశీలన, నిశ్చలమైన మనసు మనిషికి అవసరమని అర్థం)

14.దుర్గమాత్మస్వరూపిణీ: మనలోనే ఉంటూ మనకు కనిపించకుండా ఉండే ఆత్మస్వరూపమైన తల్లీ నీకు వందనం.(ఇది ఉపనిషత్తుల వాక్కు)అంటే మనలోపల ఉన్నా సరే  మాటలలో వర్ణించలేని, కళ్ళతో చూడలేని, తెలుసుకోలేని తల్లి స్వరూపం.

15.దుర్గమార్గాప్రదా: రహస్య మార్గానికి దారి చూపేతల్లీ నీకు వందనం.

16.దుర్గమవిద్యా: రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లీ నీకు వందనం(శ్రీవిధ్యా స్వరూపం సరస్వతీ స్వరూపం)

17.దుర్గమాశ్రిత: దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లీ నీకు వందనం (శ్రీచక్రం అమ్మవారికి ప్రతిరూపం)

18.దుర్గమజ్ఞానసంస్థాన: అలవికాని జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యంకాని జ్ఞానస్వరూపిణి తల్లీ నీకు వందనం.

19.దుర్గమధ్యానభాసిని: ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో కొలువై ఉండే తల్లీ నీకు వందనం.

20.దుర్గమోహ: ఆపదలను లాగేసే తల్లీ నీకు వందనం.

21.దుర్గమగ: కష్టాలను పరిష్కరించే తల్లీ నీకు వందనం.

22.దుర్గమార్థస్వరూపిణీ: ఈ పదానికి రెండు అర్థాలున్నాయి..

(1)మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి

(2) దుర్గమమైన అర్ధాలుగల తల్లీ నీకు వందనం.

23.దుర్గమాసురసంహంత్రీ: దుర్గమాసురుడైన రాక్షసుడిని సంహరించిన తల్లీ నీకు వందనం.

24.దుర్గమాయుధదారిణీ: దుర్గమమైన ఆయుధాలను ధరించిన తల్లీ నీకు వందనం.

25.దుర్గమాంగీ: ఊహించలేని దివ్యమైన అంగాలు కల తల్లీ నీకు వందనం.

26.దుర్గమత: కల్మషాలను దూరం చేసే తల్లీ నీకు వందనం.

27.దుర్గమ్య: సాధించడానికి శక్యం కానీ తల్లీ నీకు వందనం.

28.దుర్గమేశ్వరి: విఘ్నాలకు అధినాయకురాలైన తల్లీ నీకు వందనం.

29.దుర్గభీమా: భీషణమైన పరాక్రమం కల తల్లీ నీకు వందనం.

30.దుర్గభామా: దుర్గ అనే స్త్రీ రూపం లోని తల్లీ నీకు వందనం.

31.దుర్గభా: ప్రకాశం గల తల్లీ నీకు వందనం.

32.దుర్గదారిణీ: రహస్యాన్ని ఛేదించే తల్లీ నీకు వందనం.

ఈవిధంగా అర్థాన్ని తెలుసుకుని ముప్పైరెండు నామాలను ఉచ్చరించడంలో ఎలాంటి తప్పులు లేకుండా అమ్మమీద భారం వేసి 108 సార్లు జపంలాగా చేయడం వల్ల కలిగే మార్పులు కచ్చితంగా అనుభవములో చూడగలరు.

◆ వెంకటేష్ పువ్వాడ