త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే…… జగజ్జనని!!

 

త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే…… జగజ్జనని!!

 

సృష్టిలో ప్రతిచోటా మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి చెడు రెండు కవలపిల్లలా ఓకేదగ్గర ఉంటాయి. అయితే మంచిని తీసుకుని చెడును వదిలిపెట్టమని పెద్దలు మనకు చెబుతూ ఉంటారు. అయితే చెడు పెరిగినపుడు దాన్ని అంతం చేయడానికి, ప్రజలను కాపాడటానికి ఆ దేవతలు చేసిన పోరాటాలు, వారి విజయ దుందుభి నాధాలు పండుగలుగా చేసుకుంటారు సకలజనులు. 

అలాంటి పండుగే దసరా కూడా. పది రోజులు జరిగే ఈ పండుగలో నవరాత్రుల శోభ అంతా ఇంతా కాదు. నవరాత్రులూ అమ్మవారు ఒక్కో రోజు ఒకో రూపంలో దర్శనమిస్తూ ఆ రూపం వెనుక  కథ ద్వారా, రూపంలో దాగున్న అర్థం ద్వారా ప్రజలకు జీవనాభాష్యం చెబుతుంది.

నవరాత్రుల సందడిలో భాగంగా అష్టమి నాడు అమ్మవారు దుర్గా దేవిగా దర్శనమిస్తుంది. దుర్గా దేవి లోకానికి దేవత. ఎన్నోరూపాలు ఎన్నో గుణాలు. శివుని భార్య పార్వతి దుర్గ అంశే. భక్తుల ప్రార్థనలను బట్టి ఈ దేవి 64 రూపాలలో వుంది.  ఆ అరవై రూపాలను నింపుకున్న ఆ దుర్గా మాత ఎంతో  శక్తివంతమైనది. చాలామంది అష్టమి నాడు ఆయుధపూజ చేయాలని చెబుతుంటారు అయితే అష్టమి నాడు అమ్మవారిని దుర్గ రూపంలో కొలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు కూడా శక్తిని ప్రసాదించే ఆదిశక్తిగా దుర్గను చెప్పుకుంటారు.  ఈ అమ్మ కోటి సూర్యులు కలిస్తే ఎంత వెలుగు ఉద్భవిస్తుందో అంత వెలుగును నింపుకుని భగభగ మండిపోతున్న లావాలా, కోప స్వరూపిణిగా ఉంటుంది. అయితే ఆ శక్తిని భరించలేక త్రిమూర్తులు ఆమెను ప్రార్థించి శాంతించమని, ఆ శక్తి ప్రభావాన్ని ఈ సృష్టి భరించలేదని కోరుకోగా ఆ దుర్గా దేవి మూడు భాగాలుగా చీలిపోయి, లక్ష్మీ, సరస్వతి, పార్వతి రూపాలుగా మారిపోతుంది. ఆ మూడు రూపాల అవతారాలే అందరూ చెప్పుకునే ఇతర దేవతా స్వరూపాలు. 

అలాంటి శక్తిస్వరూపిణి అయిన దుర్గను అష్టమి నాడు పూజించడం వల్ల దుర్గతులు అంటే మనిషి జీవితంలో కష్టాలు, ఆపదలు, ప్రమాదాలు వంటివి తొలగిపోతాయి.

దుర్గాదేవికి ఎరుపు రంగు బట్టలు అలంకరించి, ఎరుపు పూలతో పూజ చేసి, ఎర్రని అక్షింతలు సమర్పించాలి.

"ఓం దుం దుర్గాయైనమః" అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు చెప్పుకోవాలి. 

దక్షిణ భారత దేశంలో ఎన్నో రౌద్రరూపాల్లోను కన్య, కామాక్షి, ముకాంబిక వంటి శాంత స్వరూపిణిగాను దర్శన మిస్తుంది. కేరళలో భగవతి, ఆంధ్రలో జోకులాంబిక, తమిళనాడులో కణ్ణకి అనేవి కూడా దేవి రూపాలే. దేవీ దుర్గ పూజ భారతదేశంలో 4000 సంవత్సరాల నుండి జరుగుతోంది. ఆధునిక భారతదేశంలో రామకృష్ణ  పరమహంస దుర్గాదేవి పరమభక్తుడు. మహాభారత సమయంలో కూడా దుర్గాదేవి పూజవుంది. విరాటుని కొలువులో అజ్ఞాతంలో వుండేముందు పాండవులు దుర్గాదేవిని పూజిస్తారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు

శ్రీకృష్ణుడు అర్జునుడ్ని దుర్గాదేవిని పూజించ మంటాడు. ఇలా పురాణాల నుండి కూడా వివిధ సందర్భాలలో దుర్గాదేవిని పూజించిన సందర్భాలు ఉన్నాయి.

దృర్గాష్టమి రోజు దుర్గా సూక్తం, దుర్గాశత అష్టోత్తరం  పఠించాలి.  

గుమ్మడికాయ, బెల్లం దానం చేస్తే ఎన్నో సమస్యలు తీరుతాయి

పులగం, పరమాన్నం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి.

◆ వెంకటేష్ పువ్వాడ