సృష్టికి సందేశం కుమారి పూజ!!

 

సృష్టికి సందేశం కుమారి పూజ!!

ప్రతి ఇంటి ఆడబిడ్డ దేవతా స్వరూపంగా మారే సందర్భం కుమారి పూజలో చూడవచ్చు. కుమారి పూజ దుర్గా పూజలో ఒక ముఖ్యమైన భాగం, దుర్గాష్టమి రోజున పెళ్లికాని అమ్మాయిని దేవతకు  ప్రతీకగా పూజిస్తారు.  కుమారి పూజ దుర్గాష్టమి పూజ ముగింపులో జరుగుతుంది,  

కుమారి పూజ యొక్క ఆచారాలు మరియు దాని ప్రాముఖ్యత గురించి యోగినితంత్రం, కులార్ణవతంత్రం, దేవీపురాణం, స్తోత్రం, కవచ, సహస్రనామ, తంత్రసార, ప్రంతోసిని మరియు పురోహితదర్పణలలో వివరంగా వివరించబడింది.

 కుమారి పూజ:-

కుమారి పూజ కోసం కన్యను ఎన్నుకోవడంలో జాతి, మతం లేదా కుల భేదం లేదు.  సిద్ధాంతపరంగా, ఏ కన్య అయినా  కూడా దేవతగా భావించి పూజించవచ్చు.  అయితే, సాధారణంగా బ్రాహ్మణ కన్యను ఎన్నుకుంటారు.  పదు సంవత్సరాల లోపు ఉండే అమ్మాయిలకు వారి వయసు ప్రకారం కూడా పేర్లు పెట్టబడ్డాయి. అలాగే నవరాత్రులలో తొమ్మిది రోజుల పూజకు తొమ్మది మంది అమ్మయిలను, తొమ్మిది రూపాల్లో ఉన్న అమ్మవారికి ప్రతిరూపంగా పూజిస్తారు.   

రెండు సంవత్సరాల పాపను కుమారి అని పిలుస్తారు. ఈ అమ్మను పూజించడం వల్ల సకల దరిద్రాలు తొలగిపోతాయి.

మూడు  సంవత్సరాల పాపను త్రిమూర్తి అని పిలుస్తారు, ఈ అమ్మను పూజించడం వల్ల ధనం, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది.

నాలుగు సంవత్సరాల పాపను  కల్యాణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది

అయిదు సంవత్సరాల పాపను రోహిణి అంటారు. ఈ అమ్మను పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి  ఆరోగ్యం చేకూరుతుంది.

ఆరు సంవత్సరాల పాపను కాళిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే శత్రువుల వల్ల కలిగే ప్రమాదాలు తగ్గుతాయి. శత్రువులు తొలగిపోతారు.

ఏడు సంవత్సరాల పాపను చండిక అంటారు. ఈ అమ్మను పూజిస్తే పేదరికం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. 

ఎనిమిది  సంవత్సరాల పాపను శాంభవి అంటారు. ఈ అమ్మను పూజిస్తే ప్రతి పనిలో ఆటంకాలు తొలగి, అనుకూలత ఏర్పడుతుంది.

 తొమ్మిది సంవత్సరాల పాపను దుర్గ అని అంటారు. దుర్గాష్టమి రోజున ఈ పూజ ఎక్కువ చేస్తారు. ఈ అమ్మను పూజించడం వల్ల అన్ని రకాల సుఖ సంతోషాలు చేకూరుతాయి.

 కుమారి పూజ భక్తులకు అనేక ఆశీర్వాదాలను ఇస్తుందని నమ్ముతారు.  ఇది అన్ని ప్రమాదాలను తొలగిస్తుందని చెప్పబడింది.  కుమారి పూజ యొక్క తాత్విక ఆధారం మహిళల విలువను స్థాపించడమే. సృష్టి, స్థిరత్వం మరియు విధ్వంసాన్ని నియంత్రించే శక్తుల ఆరంభాన్ని ఈ కుమారీ పూజ సూచిస్తుంది.  సమాజంలోనూ మరియు సృష్టికి మూలం స్త్రీనే, ఆ స్త్రీకి కూడా మొదట బాల్య దశ సహజం. అయితే స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసే ఉద్దేశంతో కూడా ఈ కుమారి పూజను నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. 

ప్రస్తుత కాలంలో మహిళలపై జరుగుతున్న అమానుష దాడులలో ప్రతి మగవాడు ఆయా స్త్రీలను లేదా చిన్న పిల్లలను దేవతా స్వరూపాలుగా చూస్తే ఎలాంటి దురాగతాలు జరగవని అనిపిస్తుంది. ప్రతి స్త్రీ, ప్రతి ఆడపిల్ల ఆ పరాశక్తితో సమానమే, ఆ పరాశక్తి స్వరూపమే అని చాటి చెప్పడం ఈ కుమారి పూజలో ఒక భాగమని చెప్పవచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ