మనిషిని తప్పు పని చేయకుండా ఆపేది ఏంటో తెలుసా!
మనిషిని తప్పు పని చేయకుండా ఆపేది ఏంటో తెలుసా!
దుఃఖాలు సుఖాలు జీవితంలో ఎంతో సహజమైనవి. ఎప్పుడూ తప్పు పనులు చేస్తుండే వ్యక్తి స్వభావం మారే వరకు దుఃఖాలు కలుగుతూనే ఉంటాయి. ఎలాంటి భౌతిక సహాయమైనా దానిని పూర్తిగా తొలగించలేదు. మానవుణ్ణి పవిత్రుణ్ణి చేయడం ఒక్కటే ఈ సమస్యా పరిష్కారానికి మార్గం. లోకంలో కనిపించే చెడు అంతా అజ్ఞాన ప్రభావమే. మానవుడు జ్ఞానిగా, విశుద్ధునిగా, బలాఢ్యునిగా, విద్యావంతునిగా అయిన తరువాతే లోకంలోని దుఃఖం నివర్తిల్లుతుంది. ప్రతి ఇంటినీ మనం ధర్మసత్రంగా మార్చినా, దేశాన్నంతా చికిత్సాలయాలతో నింపి, మానవుడి శీలం మార్పు చెందే వరకూ అతడి దుఃఖం ఉంటుంది.
ప్రతి పనిలోనూ మంచీ చెడుల కలయిక ఉండక తప్పదు. సత్కర్మ వలన సత్ఫలం, దుష్కర్మవలన దుష్ఫలం కలుగుతాయి. కానీ మంచి చెడులు రెండూ ఆత్మకు బంధాలే. కర్మచేస్తూ కర్మ ఫలాలలో మనం ఆసక్తులం కాని యెడల కర్మలు మనల్ని బంధింపలేవనేదే భగవద్గీతలో తెలుపబడిన తరణోపాయం. నిష్కామ కర్మాచరణ అంటే ఏమిటో తెలుసుకుంటే జీవితంలో ఎన్నో విషయాల మీద స్పష్టత ఏర్పడుతుంది.
“తస్మాదసక్తస్సతతం కార్యం కర్మ సమాచర". నిరంతరం కర్మలు ఆచరించు. కానీ వాటిలో ఆసక్తుడవు కావద్దు అనేదే భగవద్గీతలోని ముఖ్యాంశం. సంస్కారం అంటే అంతరప్రవృత్తి అని చెప్పవచ్చు. చిత్తాన్ని సరోవరంతో పోలిస్తే అందులో ఉదయించిన ప్రవృత్తి వీచిక ఒక రకమైన జాడను కలుగజేస్తుంది. అలాంటి జాడే 'సంస్కారం' అంటాం. మనం చేసే ప్రతి కార్యమూ, శరీరంలోని ప్రతి చలనమూ, మనం చేసే ప్రతి ఆలోచనా మనసులో ఇలాంటి సంస్కారాన్ని కలిగిస్తుంది. ఈ సంస్కారాలు మనకు పైకి కనబడకపోయినా అంతర్గతంగా ఉంటాయి. ఇప్పుడీ క్షణంలో నా స్థితి, ఇంతకు క్రితం నా జీవితంలో ఏర్పడివున్న సంస్కారాల సాముదాయక ఫలితం. నిజంగా శీలమంటే ఇదే.
ప్రతి మానవుడి శీలాన్నీ ఈ సంస్కారాలే నిర్ణయిస్తాయి. సంస్కారాలు ప్రబలంగా ఉంటే శీలం మంచి దవుతుంది. చెడు సంస్కారాలు ప్రబలంగా ఉంటే స్వభావం చెడ్డదవుతుంది. ఒక వ్యక్తి సదా చెడు మాటలు వింటూ, చెడు ఆలోచనలు చేస్తూ, చెడు పనులను చేస్తూ ఉంటే దుష్ట సంస్కారాల చేతుల్లో అతడొక యంత్రంగా మారి పాపం చేయడానికి అవి అతడిని పురిగొల్పుతాయి. అలాగే మంచి పనులు చేస్తున్నప్పుడు వాటివలన కలిగే సంస్కారం మొత్తం మంచిదవడంతో అతడు సంకల్పించకున్నా సత్కార్యాలను చేసి తీరుతాడు. ఒక వేళ చెడు చేయాలని అతడు కోరినా, మంచి సంస్కారాల ఫలితంగా అతడి మనస్సు అలా చేయనివ్వదు. మంచి సంస్కారాలు అతడి బుద్ధిని మరలుస్తాయి. అలాంటి వ్యక్తిలో సచ్ఛీలం సుప్రతిష్ఠితమై ఉన్నదని చెప్పవచ్చు. ఇదీ మనిషిలో రెండు కోణాల ప్రవర్తన, దాని పలితం.
◆నిశ్శబ్ద.