బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే..

 

బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే..

స్వామి వివేకానంద విజయదుందుభి మ్రోగించి పాశ్చాత్య దేశాలలో భారతీయ సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసింది చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో. తాను సాధించిన విజయాన్ని స్వామి వివేకానందుడు తన మాటల్లో  ఇలా చెప్పారు…

చికాగో సభలో “అమెరికా దేశ సోదర, సోదరీమణులారా!" అని సంబోధించాను. సభలో రెండు నిమిషాలు పాటు హర్షధ్వానాలు చెలరేగాయి. మరుసటి రోజు నుండి అమెరికాలో నేనొక సుప్రసిద్ధ వ్యక్తినయ్యాను. దీనికి కారణం నాలో ఏదో అతీత శక్తి ఉందని మీకు చెబుతున్నాను. అదేమిటంటే నా జీవితంలో ఒక్కసారి కూడా కామభావన నా మనస్సులోనికి రానీయలేదు. నా బుద్ధిని, నా ఆలోచనను, మానవులు సాధారణంగా ఆసక్తి చూపించే విషయాల నుంచి ఉన్నత శిఖరాల వైపు పయనించే విధంగా శిక్షణ ఇచ్చాను. అది ఎంత బలవత్తర శక్తిగా మారిందంటే, దానిని ప్రతిఘటించడం ఎవరితరమూ కాదు. నాకు లభించిన అఖండ విజయానికీ, ప్రపంచ చింతనా ధోరణులలో వచ్చిన గొప్ప మార్పుకూ, నా యావత్తు విజయానికీ కారణం బ్రహ్మచర్య శక్తి."

ప్రస్తుత సమాజంలో అత్యధిక సంఖ్య యువతే. భారతదేశ భవిష్యత్తు  యువత మీద ఉంది. ఈనాటి యువత పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన అన్ని రకాల వ్యసనాలకు బానిసలై శారీరకంగాను, మానసికంగాను, మేధాపరంగాను, ఆధ్యాత్మికంగాను బలహీనులు అవుతున్నారు. యువత తమ బాధ్యతలను, తమను తాము స్వాధీనంలో ఉంచుకోవడాన్ని, ఏకాగ్రత ద్వారా జ్ఞానాన్ని, నైపుణ్యాలను సంపాదించడం మర్చిపోతున్నారు. ఏ గొప్ప పనినైనా సాధించడానికి సరైన తరుణోపాయం యౌవనమే. ఆ యౌవన లక్ష్యం నేర్చుకోవడమే! సనాతన విద్యావిధానంలో విద్యార్థులను బ్రహ్మచారులు అనేవారు. అక్కడ బ్రహ్మచర్యం, విద్యార్థి జీవితం మిళితమై సాగేవి. విషయ సుఖాల కోసం, వినోదాల కోసం పరుగులు తీస్తూ సమయాన్ని వెచ్చించడం నిజంగా ఆ ఆదర్శం నుండి వైదొలగడమే. చంచలమైన మనస్సుతో ఏకాగ్రత సాధించలేరు.  

మనస్సును ఏకాగ్రం చెయ్య కుండా గొప్ప పనులు సాధ్యం కావు. "విద్యసారమంతా మనస్సును ఏకాగ్రం చెయ్యడంలోనే ఉంది, సమాచారాన్ని సేకరించడంలో లేదు” అంటారు స్వామి వివేకానంద. శరీర దారుఢ్యం, కుశాగ్ర బుద్ధి, ఉత్తేజం ఇవే ఆదర్శ యువత అలవరచుకోవాల్సినవి. యువత వ్యక్తిత్వ రహస్యం అంతా బ్రహ్మచర్యంలోనే ఇమిడి ఉంది.

అసలు బ్రహ్మచర్యం అంటే ఏమిటంటే..

విషయ వాంఛలను మనస్సులోకి రానీయకుండా, మనస్సును పవిత్రంగా ఉంచుకోవడానికి చేసే సాధననే బ్రహ్మచర్యం అంటారు. ఆలోచనలలో, మాటలలో, పనులలో విషయ సుఖాల జోలికిపోకుండా తనను తాను అదుపు చేసుకోవడమే బ్రహ్మచర్యం. ఏకాగ్రత సాధించాలంటే మానసిక ప్రశాంతత అవసరం. ప్రశాంతత అనేది మహోన్నత మానసిక స్థితి. బ్రహ్మచర్యపాలన శరీరాన్ని, మనస్సును శాంతి యుతంగాను, ప్రశాంతంగాను ఉంచుతుంది. అదే యువ శక్తి. ఆ శక్తితోనే యువత ఘనకార్యాలు సాధించేందుకు ధైర్యంతో, నూతనోత్సాహాలతో ముందంజ వేస్తారు. స్వామి వివేకానందను మహోన్నత స్థితికి చేర్చింది ఈ బ్రహ్మచర్యపాలనే. బ్రహ్మచర్యపాలన ద్వారానే మానసిక బలం, ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం, తేజస్సు, పవిత్రత, ధైర్యం, శక్తి వంటి గుణాలు అలవడతాయి.

వ్యక్తిత్వ నిర్మాణంలో బ్రహ్మచర్యం పాత్ర ఏంటంటే..

ఒక వ్యక్తి ధీరసైనికుడిగా అవడానికి చాలా సాధన అవసరం. ఒక వ్యోమగామి రోదసిలోకి వెళ్ళడానికి వెనుక ఎంతో కఠోర పరిశ్రమ దాగి ఉంది. మనస్సును నిగ్రహించి బ్రహ్మచర్యం పాటించడానికి కూడా సాధన చాలా అవసరం. మనం తినే ఆహారం, చూసే దృశ్యాలు, వినే మాటలు, వాడే పదాలు, మన సహవాసం..  ఇవన్నీ కూడా మన బ్రహ్మచర్యం మీద ప్రభావాన్ని చూపుతాయి. మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటే, దానిని నిగ్రహించడం అంత సులభం. మనస్సును నిగ్రహించాలంటే పవిత్రత తప్పనిసరి. సంపూర్ణ మనో నిగ్రహానికి కచ్చితమైన నైతిక ప్రవర్తనే మూలం అంటారు స్వామి వివేకానంద. కాబట్టి యువత గొప్ప విజయాలు సాధించాలి అంటే బ్రహ్మచర్యం పాటించడం ఎంతో అవసరం.


                                  *నిశ్శబ్ద.