ఈ సృష్టి ఎలా పుట్టిందో తెలుసా?

 

 

ఈ సృష్టి ఎలా పుట్టిందో తెలుసా?

ఈ సృష్టి ఎప్పటిది ఎవరికీ తెలియదు. అయితే పురాణాల ప్రకారం పరబ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించి తన శరీరములోని ఎడమభాగము నుండి ప్రకృతి స్వరూపిణిని సృష్టించాడు. ఆమే ఆదిశక్తి, పరాశక్తి, జగన్మాత, శక్తిని సృష్టించాక పరమేశ్వరుడు సృష్టి ప్రారంభించాడు. ఆ సమయంలో పరమేశ్వరుని సంకల్పము వల్ల నీలమేఘశ్యాముడు నాలుగు చేతులు కలవాడు, ఆ చేతులలో శంఖ, చక్ర, గదా, పద్మములను ధరించినవాడు. లక్ష్మీదేవితో కూడిన వాడు అయిన శ్రీమన్నారాయణుడు ఉద్భవించాడు. పరమేశ్వరుడు అతడికి పట్టువస్త్రములు, మణిమయ కిరీటము, కౌస్తుభము ప్రసాదించాడు.

అతడు పీత వస్త్రములు ధరించాడు కాబట్టి పీతాంబరుడు, శ్రీ లక్ష్మీ సమేతుడు కాబట్టి మాధవుడు, విశ్వవ్యాప్తి కాబట్టి విష్ణువు అయ్యాడు.  సృష్టికి ముందుగా పుట్టాడు కాబట్టి పురుషోత్తముడు అని ప్రసిద్ది చెందాడు. 

పరమేశ్వరుడు నారాయణుడికి "ఓం నమశ్శివాయ" అనే పంచాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశించి "నారాయణా! సర్వకాల సర్వావస్తలయందు ఈ మంత్రాన్ని జపించు. ఈ జగసృష్టిలో నీదే ముఖ్యపాత్ర" అని చెప్పాడు.

ప్రకృతి త్రిగుణాత్మకమైనది. అనగా సత్వ,రజ, తమోగుణములతో కలిసి ఉన్నది. పరబ్రహ్మ, తన వీర్యమును, గుణ సంచలనము లేనప్పుడు ప్రకృతిలో ప్రవేశపెట్టాడు. దీనివల్ల మహత్తత్త్వము పుట్టింది. మహత్తత్త్వము వికారము పొందటం వల్ల అహంకారము జనించింది. ఈ రకంగా అవ్యక్తమైన పరబ్రహ్మ నుండి మహత్తత్త్వము. అహంకారము వచ్చినాయి. అహంకారము నుండి పంచతన్మాత్రలు ( శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంధాలు). వాటి నుండి పంచభూతాలు (పృధివి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము), వాటి నుండి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము ఉద్భవించినాయి.

 శ్రీ మహావిష్ణువు సృష్టి చేయగోరి వేదములు, 24 తత్త్వములు, త్రిగుణములను ఒక్కసారి స్మరించాడు. ఆ సమయంలో అతని నాభి నుండి మహా పద్మము ఒకటి ఆవిర్భవించింది. అందులో ఐదు ముఖాలతో బ్రహ్మ, సరస్వతీ సమేతుడై ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ తమోగుణ ప్రధానుడు. కనుచూపుమేరలో బ్రహ్మకు జలము తప్ప ఏదీ కనిపించలేదు. అప్పుడు పరమేశ్వరుని ఆజ్ఞపై ఓంకార జపం చెయ్యటం మొదలు పెట్టాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చి లక్ష్మీ నారాయణుడు ప్రత్యక్షమైనాడు. విష్ణువును చూసి బ్రహ్మ "నీవు ఎవరవు? ఇచ్చటికేల వచ్చితివి?" అన్నాడు. 

దానికి నారాయణుడు "కుమారా! జగత్తును సృష్టించాలనే కోరికతో ముందుగా నాభికమలము నుండి నిన్ను సృష్టించాను. సృష్టికి ఆధారమైన వేదములను నీకు ప్రసాదిస్తున్నాను. నీకే వరం కావాలో కోరుకో" అన్నాడు.

అప్పుడు తమోగుణ ప్రధానుడైన బ్రహ్మ "నేను స్వయంభువును, ఆది పురుషుడను. నా పుట్టుకకు కారణం నువ్వు ఎలా అవుతావు?" అని అడిగాడు. విష్ణువు ఎంతగా నచ్చచెప్పాలని ప్రయత్నించినా బ్రహ్మ వినలేదు. దాంతో విష్ణువు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు.

అప్పుడు పరమేశ్వరుడు ఓంకార నాదం చేస్తూ జ్యోతిర్లింగ రూపంలో బ్రహ్మ, విష్ణువుల మధ్య ఉద్భవించాడు. ఆ లింగాన్ని చూసి బ్రహ్మ, విష్ణువులు అమితాశ్చర్యము పొందారు. ఆ లింగానికి తుది మొదలు కనిపించలేదు. జ్యోతిర్లింగానికి ఆద్యంతములు కనుగొన్నవాడే అధికుడు అని నిర్ణయించుకున్నారు తండ్రీ కుమారులు. విష్ణు యజ్ఞవరాహ రూపంలో అధోముఖంగాను, బ్రహ్మ హంస వాహనం మీద ఊర్ధ్వముఖంగాను ప్రయాణం చేశారు.. ఇలా వంద సంవత్సరాలు గడచినాయి. కాని బ్రహ్మ విష్ణువులు ఆ లింగము యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోయారు. అప్పుడు ఆ ఇద్దరూ "ఇంతకాలమైనా జ్యోతిర్లింగము యొక్క తుది, మొదలు కనుక్కోలేకపోయినాము. మనలో ఎవరు గొప్ప అనేది తేలలేదు. కాబట్టి ఇద్దరం కలిసి ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్ధిద్దాము" అనుకుని పరమేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో పరిపరివిధాల ప్రార్ధించారు.

వారి ప్రార్థన మన్నించిన పరమేశ్వరుడు పినాకపాణియై వారి మధ్యన సాక్షాత్కరించి. బ్రహ్మను చూసి "బ్రహ్మదేవా! ఈ జగత్తును సృష్టించటం కోసం నువ్వు విష్ణువు యొక్క నాభికమలము నుండి పుట్టావు. సరస్వతీదేవి నీకు తోడుగా ఉంటుంది. ఇప్పుడు తమోగుణము చేత ఆవరించబడి ఉన్నావు. ఆ కారణంచేత నీవెవరివో నీకు తెలియటం లేదు. విష్ణుమూర్తి ఇచ్చిన వేదాలను ఆధారము చేసుకుని సృష్టి కార్యక్రమము కొనసాగించు" అన్నాడు..

తమోగుణుడై బ్రహ్మ, పరమేశ్వరుని లక్ష్యపెట్టలేదు. అంతేకాకుండా "నేను సృష్టికర్తను. నాకు ఐదు ముఖాలున్నాయి. మరి నాకు ఐదు ముఖాలెందుకున్నాయి?" అన్నాడు. దానికి పరమేశ్వరుడు కోపించి ఎడమచేతి చిటికెన వ్రేలి గోటితో బ్రహ్మ యొక్క ఐదవతలను ఖండించివేశాడు. బ్రహ్మను తమోగుణం వదలిపోయింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమించమని పరమేశ్వరుని వేడుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై "బ్రహ్మదేవా! వేదాలను తీసుకో. ఆ విజ్ఞానము వల్ల సృష్టి ప్రారంభించు" అని చెప్పాడు. అప్పటి నుండి త్రిమూర్తులు ముగ్గురూ సృష్టిని నడిపించడం ప్రారంభించారు.

                                      ◆నిశ్శబ్ద.