ఊర్వశి ఎలా పుట్టిందో తెలుసా?
ఊర్వశి ఎలా పుట్టిందో తెలుసా?
పురాణాల గురించి తెలుసుకుంటే అందులో ఎన్నో విషయాలు ఆశ్చర్యపరుస్తాయి. ఇంద్రుడి దగ్గర గంధర్వ కన్యలు ఉండేవారు. వారు ఎంతో అందమైనవారు. రంభ, మేనక, తిలోత్తమ ఆయన దగ్గర ఉండేవారే… అయితే ఊర్వశి పుట్టడం కాస్త ఆసక్తిగా ఉంటుంది.
ప్రజాపతి అయిన ధర్మమూర్తికి నరనారాయణులు జన్మించారు. వాళ్ళిద్దరూ తపస్సు చేసేందుకు గంధమాదన పర్వతానికి వెళ్ళారు. వారు ఘోరతపస్సును ప్రారంభించారు. వారి తపస్సు దేవేంద్రుడిని కలవరపరచింది. దాంతో ఇంద్రుడు మదనుడిని పిలిచాడు. వాళ్ల తపస్సును భగ్నం చేయమన్నాడు. మదనుడు, రతి, మేనక, తిలోత్తమ, విప్రచిత్త వంటి అత్యంత ఆకర్షణీయమైన సౌందర్యవతులను తీసుకుని తపోవనానికి వచ్చారు. వారంతా తమ రకరకాల చర్యలతో నరనారాయణులను ఆకర్షించాలని ప్రయత్నాలు ఆరంభించారు. నారాయణుడు కామాన్ని జయించినవాడు. చెక్కు చెదరలేదు. కానీ నరుడు కామాన్ని జయించే ప్రయత్నంలో ఉన్నవాడు మాత్రమే. దాంతో అతడు కళ్ళు తెరిచాడు. సౌందర్యవతులైన స్త్రీలను చూశాడు. అతడి మనస్సు చలించింది.
మనస్సు చలించటం అనేది అంటు వ్యాధి వంటిది. ఒకరి మనస్సు చలిస్తుంది. ఈ చలించిన మనస్సుకు అనుగుణంగా వారు ప్రవర్తిస్తారు. అది చూసి పక్కనున్నవారిలో కూడా ధైర్యం ప్రవేశిస్తుంది. 'నేనూ అలా ఎందుకు ప్రవర్తించకూడదన్న ఆలోచనకు ఊపు వస్తుంది. అంతవరకూ అణచిపెట్టిన కోరికలు శక్తిమంతమవుతాయి. ఇలా ఒకరి నుంచి మరొకరికి పాకి పోతుందీ మనస్సు చలించడం. కొంత కాలానికి అది సమాజంలో ఒక సంప్రదాయంలా చలామణి అయ్యే స్థాయికి వస్తుంది.
ఉదాహరణకు ఒకప్పుడు సినిమాల్లోకి మర్యాదస్థులు వచ్చేవారు కాదు. సినిమాల్లో నటించేందుకు ఆడవాళ్ళు ముందుకు వచ్చేవారు కారు. ఒకరు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. ఆ తరువాత ఒకరొకరుగా సినిమాల్లోకి రావటం ప్రారంభమైంది. విద్యాధికులు, సంప్రదాయ కుటుంబాలూ సినిమాల వైపు మళ్ళాయి. ప్రారంభంలో నాయికానాయకులు దూరం నుంచే ఒకరినొకరు చూస్తూ నిట్టూర్పులు విడిచేవారు. ఆ తరువాత దగ్గర దగ్గరకు రావటం మొదలైంది. ఇంతలో ఓ నాయిక అతి తక్కువ దుస్తులతో నటించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు వస్త్రహీనంగా నటించటం సాధారణమైంది. ఇలా ఎవరో ఒకరు ఓ అడుగు ధైర్యంగా ముందుకు వేస్తే, నెమ్మదిగా ఆ దారి రహదారి అవుతుంది.
నారాయణుడికి ఇది తెలుసు. అందుకే చలిస్తున్న నరుడి మనసును అదుపులో పెట్టాలని నిశ్చయించాడు. తన ఊరుపు నుంచి ఓ సుందరమైన నవయౌవనవతిని సృజించాడు. ఎదురుగా ఉన్న లావణ్యవతుల సౌందర్యాన్ని తలదన్నే ఊర్వశిని సృష్టించాడు. ఆమె సౌందర్యాన్ని చూసి ఇంద్రుడి పటాలమంతా సిగ్గుపడింది. అసమాన సౌందర్యం తమది అని గర్విస్తున్న వారంతా తమ ఎదురుగా నిలచిన నిరుపమానసుందరిని చూసి, తమ ఓటమిని అంగీకరించి, తలపంచుకుని వెళ్ళిపోయారు. దాంతో, నరుడి దృష్టి తన ఎదురుగా ఉన్న దేవతాస్త్రీల నుంచి, నారాయణుడు సృష్టించిన ఊర్వశి వైపు మళ్లింది. ప్రపంచంలోని అందం క్షణికం అని గ్రహింపుకు వచ్చింది. ఒక సౌందర్యాన్ని చూసి మైమరచేలోగా మరో సౌందర్యం దాన్ని మించి కనిపిస్తుందని, దానికి అంతు లేదని అర్థమైంది. ప్రపంచంలో అనుపమానమైన అసమాన సౌందర్యం విశ్వసృష్టికారుడిదేనని బోధపడింది. నరుడి దృష్టి స్థిరమైంది. సంచలనం అణగిపోయింది.
◆నిశ్శబ్ద.