Read more!

మనసుకు మంచి ఔషధం ఏమిటో తెలుసా?

 

మనసుకు మంచి ఔషధం ఏమిటో తెలుసా?


మనసు కామ క్రోధాలతో నిండి, అతి శిధిలమై ప్రవర్తిస్తోంది. అన్ని వేళల్లో, దోష దుర్గంధాలతో కూడుకొన్న విషయానుభవాల కోసమే పరుగులు తీస్తోంది. పెద్దలు చెప్పే మార్గాన్నీ, సత్కార్యాల్నీ స్వీకరించమన్నప్పుడల్లా మొరాయిస్తోంది. దీని కదలికలు నెమలి పింఛపు తుదికొనలా అతి చంచలం.


మీరు వీధికుక్కను చూశారు కదా! అది ఏ పనీ లేకపోయినప్పటికీ వీధులలో అటూ ఇటూ తిరుగుతూ, ఆయాసపడుతుంటుంది. అలాగే, ఈ మనస్సు కూడా నిరర్థకంగా, నిష్కారణంగా, నిష్ప్రయోజన కరంగా అన్ని వేళల్లో 'అటూ ఇటూ' తిరుగుతుంది. దురాశల వలలో చిక్కుకొన్న మనసుకు 'తృప్తి' అన్న మాట ఎక్కడిది? జల్లెడలో నీరు పోస్తుంటే నిండేదెప్పటికి చెప్పండి!


ఒక పదార్థాన్ని మనం ,ప్రీతిపూర్వకంగా ఆశ్రయించి'నప్పుడు మన మనోచిత్రాలు ప్రవర్తిస్తున్నాయి. 


ప్రీతి కలిగియుండే స్వభావం = చిత్తం; మననము చేసే స్వభావం మనస్సు. ఈ మనస్సులో 'చిత్తవృత్తులు' అనే సుడిగుండాలున్నాయి. క్రూరత్వం, పరవంచన, దురభ్యాసం మొదలైనవి ఇందులో యథేచ్ఛగా సంచరిస్తున్నాయి.


మహాత్మా! నూతిలోకి దింపబడిన ఏతామును దానికి కట్టిన త్రాడు క్రిందకి పైకి తిప్పుతూనే ఉంటుంది చూశారా? మేము కూడా భోగవాంఛలతో, కామక్రోధాలతో కూడుకొన్నవాళ్ళమై మూడు లోకాల్లో మనస్సుతో తిప్పబడుతున్నాం. ఈ మనస్సును పట్టుకొని నియంత్రిద్దామా అంటే... దీనికి ఒక రూపమే లేదు! తమ లాంటి జ్ఞానులు “మనస్సు అనబడు ఒకానొక వస్తువు లేదు. దానికి అస్తిత్వమే లేదు" అని చెబుతూ ఉంటారు.


ఈ చిత్తం క్రోధాగ్నిజ్వాలలతో నన్ను కాల్చి వేస్తోంది. ఇది అగ్ని కన్నా వేడి కొండ కన్నా కఠినం. దీన్ని మేము అసలు జయించగలమంటారా? స్వల్ప వస్తువుల కోసం పరుగెత్తుతూ, స్వల్పత్వాన్నే పొందుతూ, నరకాదుల రుచి ఏమిటో మళ్ళీ మళ్ళీ చూపించే ఈ చిత్తం యొక్క గమనాన్ని నిరోధించటమెలాగో చెప్పండి?


ఒక సింహాన్ని ఉత్తచేతులతో బంధించవచ్చునేమో, సముద్ర జలాన్నైనా పానం చెయ్యవచ్చునేమో, హిమాలయ పర్వతాన్ని కూడా పెకలించవచ్చునేమో, అగ్నినైనా భక్షించవచ్చునేమో! కానీ ఈ చిత్తాన్ని నిరోధించడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. ఇది అవివేకాన్ని ఆశయించి ఉండడం వల్ల అన్ని ఉపాధుల్లోనూ ఏకస్థమై ఉన్న 'ఆత్మ' దీనికి ఏ మాత్రం కనిపించడం లేదు. ఏం తెలుసుకొన్నా, ఎంత బోధించినా ఎల్లప్పుడూ భేదభావాన్నే పొందుతోంది. సామ్య సమతా భావాల్ని హరించివేసి, దుఃఖాలను కలిగించడంలో పావీణ్యం చూపు తోంది. అనేక విషయాలలో అంతులేని ఆసక్తిని కల్పించుకొని, అందులో జడత్వం వహించి నిదురపోతోంది. ఎంతలేపినా నిదుర లేవదు. సామరస్య పూర్వకమైన ఆత్మజ్ఞానం కోసం ఏ మాత్రం ప్రయత్నం చేయదు. ఇప్పుడు నేనేం చేయాలో నాకు " అర్థమవడం లేదు.


ఈ మనస్సే అంతటికీ కారణం. ఇది క్షీణిస్తే లోకాలు క్షీణిస్తాయి. విజృంభిస్తే లోకాలు కూడా విజృంభిస్తాయి. కొండపై అడవులు పెరుగుతున్నట్లు, సర్వ సుఖదుఃఖాలు ఈ మనస్సు నుండే బయలుదేరుతున్నాయి. ఆచార్యులు ఎంత బోధించినా, ఇది తన జాడ్యాన్ని  త్యజించడం లేదు. క్రూరుడైన పోకిరివాడు పసిబాలుణ్ణి బెత్తము చూపించి బెదిరిస్తున్నట్లు ఇది నన్ను బెదిరిస్తోంది. ఈ 'మనస్సు' అనే వ్యాధికి ఉత్తమమైన ఔషధం వివేకమే కదా! అలాంటి ఔషధంతో ఇది క్షీణిస్తే సుఖ దుఃఖ వికారాలు కూడా క్షీణిస్తాయి. 


                                 ◆నిశ్శబ్ద.