ధనుర్మాస విశిష్టత..  దేవతలు పిలిస్తే పలుకుతారట..!

 

ధనుర్మాస విశిష్టత..  దేవతలు పిలిస్తే పలుకుతారట..!

 

హిందూ ధర్మంలో ప్రతి మాసానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. కార్తీక మాసంతో చాతుర్మాసం పూర్తైంది.  చాలా మంది చాతుర్మాస వ్రతం చేస్తుంటారు కూడా. దాని తరువాత ఇప్పుడు ధనుర్మాసం వచ్చింది. అది కూడా డిసెంబర్ 16వ  తేదీ నుండే మొదలవుతోంది.  ఈ రోజు నుండి సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే వరకు ధనుర్మాసం సాగుతుంది.  సూర్యుడు ధనురాశిలో సంచరించే ఈ నెల రోజుల కాలాన్ని ధనుర్మాసం పేరుతో పిలుస్తున్నా దీని వెనుక చాలా గొప్ప దైవ కారణాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ ధనుర్మాసం చాలా విశిష్టతను సంతరించుకుంది.


డిసెంబర్ 16 వతేదీన సూర్యుడు ధనురాశిలో ప్రవేశిస్తాడు.  ఈ రోజు నుండి మకర సంక్రాంతి వచ్చే వరకు ధనురాశిలో ఉంటాడు. ఈ కాలాన్నే ధనుర్మాసం అంటున్నారు.

మనుషులు గడిపే ఏడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానమట. అందులోనూ ఈ రోజులో ప్రాతఃకాలం అంటే ఉదయం నిద్రలేచే కాలామే ఈ ధనుర్మాసం అంటున్నారు పురాణ పండితులు.  ప్రాతఃకాలంలో దేవతలు మేల్కునే కాలం కాబట్టి ఈ సమయంలో దేవతలను స్మరించడం,  పూజ చేయడం, దేవతలకు ఉపచారాలు చేయడం.. ఇలా ఏ దైవిక కార్యక్రమాలు చేసినా అది దేవతలకు చేరుతుందట.  అందుకే ఈ ధనుర్మాసంలో దైవ ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి.


ధనుర్మాసంలో దేవతలు మేల్కొంటారనే కారణంతోనే గోదాదేవి  ప్రతి రోజూ ఉదయాన్నే శ్రీమహా విష్ణువు మేలుకొలుపు సమయంలో పాశురాలు  ఆలపించి ప్రత్యేక పూజలు చేసిందట.  ఈ కారణంగానే ఈ ధనుర్మాసంలో గోదాదేవి పాశురాలను ప్రతిరోజూ ఒకటి చెప్పున 30రోజులు 30 పాశురాలను ఆలపిస్తూ ఆ విష్ణుమూర్తిని పూజిస్తారు.


ధనుర్మాసంలో వచ్చేదే వైకుంఠ ఏకాదశి.  ఈ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు తెరచుకుంటాయట.  అందుకే చాలా గుడులలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రజలు ఎగబడతారు.  ఈ రోజు విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి భక్తులను అనుగ్రహిస్తాడు.  వైకుంఠ ఏదాదశి రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా ఉత్తరాయణంలో ప్రతి వైష్ణవ  క్షేత్రంలోనూ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు, ఆరాధనలు,  ఆండాళ్ పూజలు. తిరుప్పావై పఠనం జరుగుతుంది.


గోదాదేవి కళ్యాణం కూడా ధనుర్మాసంలోనే జరుగుతుంది.  భోగి పండుగ రోజే  గోదాదేవి కళ్యాణం జరుగుతుంది.  ఈరోజు గోదాదేవి కళ్యాణం జరగగా.. మరుసటి రోజు వచ్చే  సంక్రాంతి పండుగతో ధనుర్మాసం పూర్తవుతుంది.  ఈ నెలరోజులూ చేసే పూజలు, దైవ ఉపచారాలు చాలా పుణ్యాన్ని,  దేవతల అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయని పండితులు చెబుతున్నారు.


                                        *రూపశ్రీ.