Read more!

ఆత్మజ్ఞానం గురించి చక్కని వివరణ!

 

ఆత్మజ్ఞానం గురించి చక్కని వివరణ!

ఆత్మజ్ఞానం గురించి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకునే గమ్యాన్ని చేరే మార్గాన్ని అవలంబించడం ఒక్కటే సరిపోదనీ, దానితో పాటు మనకు సాధనలో ఆనందం కలగాలనీ శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంద్రియ సుఖాల నుండి కలిగే ఆనందం  అశాశ్వత తత్త్వాన్నీ, తాత్కాలిక స్వభావాన్నీ చూడడం నేర్చుకోవాలి. ఇంద్రియ సుఖాలలో మునిగితేలడం వల్ల ఏ విధంగా మన స్వేచ్ఛను కోల్పోతామో విచారించి, అదే విధంగా ఎన్నటికీ తృప్తి చెందని స్వభావమున్న ఈ సుఖాల గురించి ఆలోచించి, వాటి హానికరమైన ప్రభావాన్ని గుర్తిస్తే వైరాగ్యం అలవడుతుంది. మానసిక విశ్లేషణను మనం చేసే పుణ్యకర్మలతో బలోపేతం చేస్తే, తప్పనిసరిగా వైరాగ్యం కలుగుతుంది. నిజమైన వైరాగ్యం పుణ్యకార్యాల వల్లనే లభిస్తుంది.

భక్త తులసీదాసును అతని భార్య అన్న ఒక్క మాట ఆయన్ని ఆధ్యాత్మిక పథం వైపు నడిపించింది. శ్రీరామచంద్ర ప్రభువు పట్ల భక్తి, ప్రేమ వైపునకు మరలించింది. ఈ ప్రపంచం పట్ల వైరాగ్యం కలిగేలా చేసింది. జీవితంలో అంతకు ముందు చాలాసార్లు ఆయన అలాంటి మాటలను విని ఉంటారు గానీ, అవి ఆయనపై ఎలాంటి ప్రభావాన్నీ చూపలేదు. కానీ సరియైన సమయం వచ్చినప్పుడు (ఆయన చేసిన పుణ్యకార్యాల ఫలితం రావడం ప్రారంభం కాగానే), భార్య మాట్లాడిన సాధారణ, సరళమైన

 మాటలు ఆయన జీవితంలో అసాధారణమైన మార్పును తెచ్చి ఆయన ఒక మహాత్మునిగా పరివర్తన చెందడానికి కారణమయ్యాయి.

చాలామందికి జీవితంలో అలాంటి వైరాగ్యం ఒక్క చిన్న మాట వల్ల గానీ, ఒక్క సంఘటనతో గానీ వస్తుంది. వారు పూర్వం ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా అది జరుగుతుంది. కాబట్టి తీవ్రమైన విచారణ, లేక ఆలోచన చేసినంత మాత్రాన మనం ఆశించిన వైరాగ్యం మనకు కలగదు. ఒక ఇంద్రియానికి సంబంధించిన వస్తువుతో అనుబంధం ఏర్పడిన తరువాత ఆ వస్తువును దాని నుంచి వేరు చేస్తే (విడదీస్తే) ఏమి జరుగుతుందన్న విషయం గురించి విచారించాలి. అప్పుడు మనస్సు చాలా కలవరానికి గురి అవుతుంది. ఆ అంతరాయాన్ని తొలగించాలని ఆ వస్తువు కోసం మళ్ళీ అన్వేషిస్తాం. మళ్ళీ ఆ వస్తువు దొరికితే ఎంతో సంతోషిస్తాం. అది మనంతట మనం సృష్టించుకున్న సమస్యను మనమే పరిష్కరించడం లాంటిది. అందువల్ల ఆ వస్తువు మనకు సంతోషాన్నిస్తుందా? లేక ఆ వస్తువు సృష్టించిన మానసిక అలజడిని దూరం చేయడం వల్ల సంతోషం కలిగిందా? అని జాగ్రత్తగా పరిశీలించాలి. మన మనస్సు ప్రశాంతత చెందడం వల్లనే సంతోషం కలుగుతుందన్నదే అసలైన సత్యం. ఇంద్రియాలు ఒక వస్తువును ఆశించక ముందు మనస్సు ప్రశాంతంగానే ఉంది. వస్తువును ఆశించిన తరువాత అది లభించకపోతే ప్రశాంతతను కోల్పోతుంది. ఆ వస్తువును తిరిగి పొందిన తరువాత అది మళ్ళీ ప్రశాంతతను పొందుతుంది. అందువల్ల ఆ వస్తువు వల్లనే సంతోషం కలిగిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది.

మంచి ఎండలో నడిచి వచ్చిన తరువాత చెట్టు నీడ కిందకు వచ్చిన వ్యక్తికి అది ఎంతో ఆహ్లాదాన్నీ, సంతోషాన్నీ కలిగిస్తుంది. అంతకు ముందే నీడలో కూర్చున్న వ్యక్తికి అది అంత ఆనందాన్ని కలిగించదు. ఇక్కడ  నీడ వల్లనే ఆనందం కలుగుతున్నదనుకోవాలా? లేక ఎండలో నడిచి వచ్చినందువల్ల అది కలిగిందనుకోవాలా? అదేవిధంగా, మనస్సు దేనినైనా కోరి, దాని గురించి అలజడి చెందినప్పుడు ఆ అలజడికి కారణమైన దాన్ని తొలగిస్తే సంతోషం కలుగుతుంది.

ఏ వస్తువునైనా సరే మనకు అలజడి కలిగించడానికి ఎందుకు అనుమతించాలి? అసలు మనస్సు కలవరపడడానికే మనం అనుమతించకపోతే, అప్పుడు సహజంగానే ప్రశాంతతను పొంది స్వేచ్ఛగా ఉంటాం. మన సంతోషమంతా ఆ వస్తువుపైనే ఆధారపడి ఉందనుకోవడం వల్లనే మనకు అలజడి కలుగుతోంది.


                                      *నిశ్శబ్ద.