మరణాన్ని బట్టి మనిషి ప్రాణం ఏ అవయవాల నుండి బయటకు వెళుతుందో తెలుసా!
మరణాన్ని బట్టి మనిషి ప్రాణం ఏ అవయవాల నుండి బయటకు వెళుతుందో తెలుసా!
ఈ భూ ప్రపంచం మీద అన్ని ప్రాణులకు మరణం తప్పనిసరి. మరణం గురించి పురాణ గ్రంథాలలో పలు విషయాలున్నాయి. మనిషి ఏ స్థితిలో ఉంటే ప్రాణం ఎలా పోతుందనే విషయం గురించి గరుడ పురాణంలో ఆసక్తికర విషయాలు పేర్కొనబడ్డాయి. మనిషి శరీరంలో నవరంధ్రాలు ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే.. రెండు కళ్లు, రెండు చెవులు, ముక్కు, విసర్జన అవయవాలు, నోరు.. మొదలైన వాటిని నవరంధ్రాలు అంటారు. మనిషి మరణ స్థితిని బట్టి వారి ప్రాణం వివిధ అవయవాల నుండి బయటకు వెళుతుంది. ఇందులో కూడా మంచి, చెడు రెండూ ప్రస్తావించబడ్డాయి. అర్థమయ్యేలా చెప్పాలంటే మనిషి మరణాన్ని, మనఃస్థితిని బట్టి మనిషి ప్రాణం నవ రంధ్రాలలో ఏదో ఒక అవయవంలో నుండి వెళ్లిపోతుంది.
ఏ వ్యక్తి తన పనిని భక్తి శ్రద్దలతో నిర్వహిస్తాడో, తన బాధ్యతలను శ్రద్దగా పూర్తీ చేస్తాడో అతని ప్రాణం ముక్కునుండి బయటకు వెళుతుందట. దేవుడిని భక్తితో పూజించిన వాడు, దైవ భక్తికి అంకితం అయిన వారికి కూడా ప్రాణం ముక్కు నుండి బయటకు వెళుతుందని గరుడ పురాణంలో ఉంది. మనిషి తన జీవితంలో తన మతాన్ని భక్తి విశ్వాసాలతో అనుసరించినట్టైతే ఆ వ్యక్తి ప్రాణం అతని నోటి నుండి బయటకు వెళ్లిపోతుందట. ముక్కు నుండి, నోటి నుండి ప్రాణం వెళ్లడాన్ని శుభప్రదమైనదిగా పరిగణిస్తారు.
చాలామందికి జీవితం మీద ఆశ ఉంటుంది. మరణం సమీపిస్తున్నా సరే ఇంకా బ్రతకాలని, కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో అనుబందం పెంచుకుని వారికి దూరం కావడం అస్సలు ఇష్టం లేక అదే ధ్యాసలో మరణించేవారికి ప్రాణం కళ్లలో నుండి బయటకు వెళుతుందట. అదే విధంగా జీవితమంతా డబ్బు సంపాదనలో గడిపి,డబ్బునే లోకంగా చేసుకుని బంధాలు, అనుబంధాలను, దైవాన్ని, భక్తిని అన్నింటినీ వదిలినవారు మరణించినప్పుడు వారి ప్రాణం విసర్జన అవయవాల నుండి బయటకు వెళ్లిపోతుందట. ఇలా కళ్లలోనూ, విసర్జన అవయవాలలోనూ ప్రాణం పోవడాన్ని అస్సలు మంచిది కాదని, అలా మరణించినవారి ఆత్మ అశాంతితో ఉంటుందని గరుణ పురాణంలో పేర్కొనబడింది.
*నిశ్శబ్ద.