ఔషధంగా పనిచేసే గసగసాలు (Medicinal Values in Cuscus)
ఔషధంగా పనిచేసే గసగసాలు
(Medicinal Values in Cuscus)
గసగసాలను మనం అనేక వంటల్లో ఉపయోగిస్తాం. ఆవాల కంటే చిన్నగా, తెల్లగా ఉండే గసగసాలు ఒట్టిగా తిన్నా భలే రుచిగా ఉంటాయి. గసగసాల గురించి మనలో చాలామందికి ఇంతవరకే తెలుసు. కానీ ప్రాచీన కాలంలో మహర్షులు గసగసాలను ఔషధంగా భావించారు. ఆయుర్వేద వైద్యంలో గసగసాలను ఉపయోగించి ఎన్నో ఔషధాలను తయారుచేస్తారు. రోజూ కాసిని గసగసాలను సేవిస్తే అన్ని రకాలుగా మంచిదని చెప్పారు. సంస్కృతంలో గసగసాలను సంవీరణం అని, ఉశేరం అని పిలుస్తారు. తెల్లటి సన్న పూసల్లా ఉండే గసగసాలు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
గసగసాలకు ఏయే అనారోగ్యాలను తగ్గించే శక్తి ఉందో చూద్దాం.
శరీరంలో ఉన్న వేడిని తగ్గిస్తాయి.
అల్సరు, కడుపులో మంట లాంటివి నివారణ అవుతాయి.
ఒక్కోసారి ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరదు. ఏదో తెలీని తపనగా, తీరని దాహార్తిగా ఉంటుంది. ఈ లక్షణం కనిపించినప్పుడు కాసిని గసగసాలు తిన్నట్లయితే వెంటనే తగ్గుతుంది.
పిత్త, వాత, పైత్య దోషాలను గసగసాలు నివారిస్తాయి.
గసగసాలు సేవించడం వల్ల చలవ చేస్తుంది.
మేహజ్వరం, పైత్యజ్వరం, వాంతులు లాంటి ఇబ్బందులు తగ్గుతాయి.
ఋతుక్రమంలో ఏర్పడే అధిక రక్త స్రావాన్ని అరికడతాయి.
వమనంలో రక్తం పడితే కష్టం. ఇలా జరిగినప్పుడు తక్షణం కాసిని గసగసాలను సేవించినట్లయితే సత్వర ప్రయోజనం ఉంటుంది.
మధుమేహం, క్షయ, మూర్చ రోగాలు తదితర దీర్ఘకాలిక వ్యాధులను సైతం గసగసాలు నివారిస్తాయి.
మితిమీరిన ఉద్రేకాలు, భ్రమలు లాంటి కొన్ని మానసిక వ్యాధులకు గసగసాలు దివ్య ఔషధంలా పనిచేస్తాయి.
గసగసాలు ఔషధప్రాయమే కాదు, ఇందులో ఎన్నో బలవర్థక పదార్థాలు ఉన్నాయి. వివరంగా చెప్పుకుంటే... పెసలు, వేరుశనగలు, అలసందలు మొదలైన గింజల్లాగే గసగసాలు మంచి పోషకాహారం. ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రిబోఫ్లేవిన్, నయాసిన్, విటమిన్ బి-6, ఫోలేట్ లాంటివి విస్తారంగా ఉన్నాయి. 3.6గ్రాముల గసగసాల్లో 100 కాలరీల శక్తి ఇమిడి ఉంటుంది. గసగసాలు పిస్తాతో సమానం అని కూడా చెప్తున్నారు.