దృష్టి సోకడం అనేది నిజంగా ఉందా? (Drushti or Disti)

 

దృష్టి సోకడం అనేది నిజంగా ఉందా?

(Drushti or Disti)

తలనొప్పి, కడుపునొప్పి, తిన్నది జీర్ణం కాకపోవడం, తలతిరగడం, కడుపులో తెమలడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోవడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే. అందునా పసి పిల్లలకు తరచూ దృష్టి సోకినట్లు భావిస్తుంటాం. ఉన్నట్టుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేక దిష్టి తగలడమేనా?

 

దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగదీసి నిప్పులో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్ర నీళ్ళని దిష్టి తగిలిన వ్యక్తికి నివాళించి మూడు దారులు కలిసే ప్రదేశంలో పారబోస్తారు. ఇంకొందరు చెప్పు, లేదా చీపురుతో దిష్టి తీస్తారు.

 

విరగ్గాసిన చెట్లు, నిండా పండిన చేలు, సమృద్ధిగా పాలు ఇచ్చే పాడి పశువులు, నిర్మాణంలో ఉన్న ఇళ్ళు లేదా భవంతి, కొత్తగా కొన్న వాహనం మొదలైన వాటికి కూడా దిష్టి తగులుతుందనే నమ్మకం ఉంది. వీటిక్కూడా దృష్టి సోకకుండా నివారణోపాయాలు ఉన్నాయి. మంత్రించిన నల్లదారం, మంత్రించిన నిమ్మకాయలు, వాకిట్లో గుమ్మడికాయ కట్టడం, గుమ్మానికి మూడు నిమ్మకాయలు కట్టడం, దిష్టిబొమ్మ వెళ్ళాడదీయడం, రాక్షసబొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేస్తుంటారు.

 

అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడం లేదా చక్కగా పండిన చేనుకు ఉన్నట్టుండి ఏదో రూపంలో హాని జరగడం, పాడి పశువు పాలు ఇవ్వకపోవడం మొదలైనవి యాదృచ్చికంగా జరుగుతాయా లేక దృష్టి సోకడమే సిసలైన కారణమా? ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా? ఇందులో శాస్త్రీయత ఉందా లేక ఇది కేవలం మూఢనమ్మకమా?

 

దిష్టి తగలడాన్ని తేలిగ్గా తీసేయలేమని చెప్పారు పెద్దలు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢ నమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుందో చూద్దాం.

 

మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్నిసార్లూ ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్తు కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలోచనాసరళి లాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. ఎక్స్-రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా! ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది.

 

కనుక వక్ర దృష్టి, ఈర్ష్యాసూయలతో కూడిన తీక్ష్ణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు.