చిలుకూరు బాలాజీ ఆలయ చరిత్ర మీకు తెలుసా?
చిలుకూరు బాలాజీ ఆలయ చరిత్ర మీకు తెలుసా?
తెలంగాణలోని పురాతనమైన ఆలయాలలో చిలుకూరు బాలాజీ ఆలయం చాలా ప్రముఖమైనది. చిలుకూరు బాలాజీని ఆయన భక్తులు వీసా బాలాజీ అని పిలుచుకుంటారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఇక్కడి వెంకటేశ్వర స్వామి గుడికి ఆశ్చర్యకరమైన చరిత్ర ఉంది. శ్రీరాముని భక్తితో సేవించి చరిత్రలో గొప్ప భక్తుడిగా పేరు గాంచిన శ్రీరామదాసు మేనమామలు అయిన అక్కన్న, మాదన్నల కాలంలోనే చిలుకూరు బాలాజీ ఆలయం నిర్మాణం జరిగిందని ఆధారాలు ఉన్నాయి. చరిత్ర ప్రకారం.. ప్రజల కథనం ప్రకారం, సాంప్రదాయం ప్రకారం ఈ గుడి వెనుక చరిత్ర ఇలా ఉంది..
ఒక భక్తుడు ప్రతి ఏటా తిరుపతి వెంకన్నను దర్మించుకునేవాడు అంట. అలా ప్రతి సంవత్సరం తప్పకుండా వెళ్లే అతను ఒక ఏడాది అనారోగ్యం కారణంగా వెళ్లలేకపోయాడు. తనను సేవించే భక్తులను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుండే వెంకటేశ్వర స్వామి అతనికి కలలో కనిపించి.. "నేను ఇక్కడికి దగ్గరలోనే అడవిలో ఉన్నాను. నువ్వు తిరుమలకు రాలేకపోయాను అని ఆందోళన చెందాల్సిన పనిలేదు" అని చెప్పాడు అంట.
కలలో తనకు వెంకటేశ్వరస్వామి అలా చెప్పడంతోనే ఆ భక్తుడు పొంగిపోయాడు. వెంటనే కలలో తనకు కనిపించిన ప్రదేశాన్ని అడవిలో వెతుక్కుంటూ వెళ్లాడు. అక్కడ ఒక పుట్ట అతని కంట పడింది. అతను ఆ పుట్టను తవ్వుతుండగా పొరపాటున అతని గొడ్డలి పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామికి తగిలింది. స్వామి గడ్డం కింద, ఛాతీపైన గొడ్డలి తగలడంతో స్వామి విగ్రహానికి గాయాలు అయ్యాయట. ఆశ్చర్యకరంగా ఆ విగ్రహానికి కూడా గాయలు అయిన ప్రాంతం నుండి రక్తం విపరీతంగా ప్రవహించింది.
స్వామి విగ్రహం నుండి రక్తం ప్రవహించడం చూసిన ఆ భక్తుడు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. రక్త ప్రవాహం చూసి నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడే అతనికి ఆకాశవాణి పిలుపు వినిపించింది. పుట్టను ఆవు పాలతో ముంచెత్తండి అని ఆకాశవాణి పలికింది. దీంతో ఆ భక్తుడు ఆ పుట్టను ఆవు పాలతో ముంచెత్తాడు. అలా చేయగా ఆ పుట్టలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి స్వయంభూ విగ్రహం బయటపడింది. ఇలా బయటపడిన తరువాత స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఇదంతా జరిగిన తరువాత కొన్ని రోజులకు స్వామి వారికోసం ఒక ఆలయాన్ని నిర్మించారు. ఇదీ చిలుకూరు బాలాజీ కథ..
*రూపశ్రీ.