మణికిరణ్ శివాలయం గురించి తెలుసా...ఇక్కడ స్నానం చేస్తే ఈ సమస్య మటుమాయమట..!
మణికిరణ్ శివాలయం గురించి తెలుసా...ఇక్కడ స్నానం చేస్తే ఈ సమస్య మటుమాయమట..!
మణికిరణ్ శివాలయం.. చాలామందికి తెలియదు. ఈ శివాలయం భారతదేశంలోనే ఉంది కానీ తెలుగు రాష్ట్రాలలో కాదు. హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోని పార్వతి లోయలో వ్యాస్, పార్వతి నదులు ఉన్నాయి. ఈ నదుల మధ్య ఉన్న ఆలయమే మణికిరణ్ శివాలయం. పార్వతి నది మణికిరణ్ గుండా ప్రవహిస్తుంది. ఈ స్థలం కేవలం హిందువులకే కాకుండా సిక్కులకు కూడా చాలా ముఖ్యమైనదిగా పిలవబడుతుంది. అసలు ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటి? ఇక్కడ స్నానం చేస్తే జరిగే అద్బుతం ఏంటి తెలుసుకుంటే..
హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోని పార్వతి లోయలో పార్వతి, వ్యాస్ అనే నదులు ఉన్నాయి. ఈ నదుల మధ్య మణికిరణ్ ఆలయం ఉంది. ఇక్కడ పార్వతి నదికి ఒకవైపు శివాలయం ఉంటే.. మరొకవైపు మణికిరణ్ గురుద్వారా ఉంటుంది.
పురాణ కథనం..
పురాణ కథనాల ప్రకారం పార్వతి దేవి నదిలో స్నానం చేస్తుండగా పార్వతి చెవిపోగులు నదిలో పడిపోయాయట. శివుడు ఆ చెవిపోగులను వెతుకుతుంటే అవి ఎంతకు దొరకలేదట. శేషనాగుడు పార్వతి దేవి చెవిపోగు తీసుకుని పాతాళంలోకి వెళ్లిపోయాడట. చెవిపోగు కనబడక, శేషనాగుడ కనబడకపోవడంతో శివుడికి కోపం వచ్చింది. తన మూడవ కన్ను తెరిచేసరికి ఆ మూడవ కన్ను నుండి వెలువడే వేడి కారణంగా పార్వతి నదిలో నీరు ఉడకడం స్టార్ట్ అయ్యిందట.
శివుడి కోపానికి శేషనాగు వచ్చేశాడట. పార్వతి మాత చెవిపోగును ఇచ్చేశాడట. ఆ చెవి పోగు మణి పొదిగినది కావడంతో ఆ చెవిపోగు పడిన ప్రాంతాన్ని మణికిరణ్ అని అంటున్నారు. ఆ నదిని కర్ణపూల్ అని కూడా పిలిచేవారు.
పార్వతి నదిలో స్నానం చేసేవారికి అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయని అంటున్నారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఇక్కడ పూజలు నిర్వహించారని కూడా చెబుతారు. మరొకవైపు గురునానక్ ఈ ప్రదేశాన్ని సందర్శించాడని, దాని జ్ఞాపకార్థం ఈ ప్రదేశంలో గురుద్వారా నిర్మించబడిందని అంటున్నారు. దీనికి తగ్గట్టే పార్వతి నదికి ఒకవైపు శివాలయం ఉంటే మరొకవైపు గురుద్వారా ఉంటుంది.
*రూపశ్రీ