ఏలినాటి శనిలో శని దేవుడిని శాంతింపజేసే మార్గాలు ఇవే..!

 

ఏలినాటి శనిలో శని దేవుడిని శాంతింపజేసే మార్గాలు ఇవే..!

 


హిందూ మతం జ్యోతిషశాస్త్రంలో శని దేవుడికి చాలా ప్రాముఖ్యత ఉంది.  శని దేవుడిని పూజించడానికి శనివారం ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. శని దేవుడిని న్యాయ దేవుడని,  కర్మ ప్రదాత అని పిలుస్తారు. వ్యక్తి చేసిన కర్మల ప్రకారం వారిని శిక్షించే వాడు శని దేవుడు.  కర్మ ప్రకారమే అందరికీ ప్రతిఫలం ఇస్తాడు.  చాలామంది జాతకంలో ఏలినాటి శని,  అర్థాష్టమ శని వంటివి చూస్తూ ఉంటారు.  వీటి కారణంగా జీవితంలో చాలా ఒడిదుడుకులు,  కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు.  అతని జీవితం పోరాటాలు, అడ్డంకులు మరియు ఆర్థిక  ముఖ్యంగా పదే పదే డబ్బు కోల్పోవడం, వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొవడం,  లేదా ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి.   ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలి అంటే శనిదేవుడిని శాంతింపజేసుకోవాలి.  ఇందుకోసం ఏం చేయాలంటే..

శనివారం తీసుకునే కొన్ని ప్రత్యేక చర్యలు శని దేవుడి అశుభ దృష్టిని శాంతపరుస్తాయి.  జీవితంలో కొత్త శక్తిని,  సానుకూలతను తీసుకువస్తాయి. ఈ చర్యలు ఒక వ్యక్తిని ఆర్థికంగా బలంగా మార్చడంలో కూడా సహాయపడతాయి. శనివారం భక్తితో,  పద్ధతి ప్రకారం చేయడం ద్వారా శని దేవుడి ఆశీర్వాదాలను పొందగల  ప్రభావవంతమైన చర్యలను తెలుసుకుంటే..

 ఆవనూనె,  నల్లటి వస్తువులన దానం..

శనివారం సాయంత్రం గుడికి  వెళ్లి అక్కడ నవగ్రాహాల దగ్గర  శనిదేవుని విగ్రహానికి ఆవనూనెను సమర్పించి "ఓం శం శనైశ్చరాయ నమః" అనే మంత్రాన్ని జపించాలి. దీని తరువాత నల్లటి బట్టలు, నల్ల నువ్వులు, మినపప్పు, బూట్లు, చెప్పులు లేదా దుప్పట్లను పేదవారికి దానం చేయాలి. ఈ వస్తువులను దానం చేయడం ద్వారా శనిదేవుని ఆశీర్వాదం లభిస్తుందని,  ఆర్థిక అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు.

రావి చెట్టు పూజ..

శనివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించి దానికి నీరు పోయాలి. ఆ తర్వాత ఏడు ప్రదక్షిణలు చేసి శనిదేవుడిని ధ్యానించి ప్రార్థించాలి. ఈ పరిహారం శని దోషాన్ని శాంతపరచడానికి,  ఇంట్లో ఆనందం,  శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడుతుందట.

హనుమంతుని పూజ..

హనుమంతుడిని  శని దేవునికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తారు. శనివారం సుందరకాండ లేదా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా శని దేవుడి చెడు దృష్టి నుండి రక్షించబడవచ్చు. ఇది మానసిక ప్రశాంతతను ఇస్తుంది,  జీవితంలోని సవాళ్లను తగ్గిస్తుంది.

పేదలకు చేసే సేవ..

శని దేవుడిని న్యాయవంతుడిగా,  పేదల రక్షకుడిగా భావిస్తారు. ఆకలితో ఉన్నవారికి ఆహారం పెట్టడం, వికలాంగులకు సహాయం చేయడం లేదా శనివారం వీధులు శుభ్రపరిచే సిబ్బందికి సహాయం చేయడం శని దేవుడికి చాలా ఇష్టమైనవట. ఈ సేవ శని దోషాన్ని తగ్గిస్తుంది,  జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందట.


                                 *రూపశ్రీ.