కర్మల గురించి భగవద్గీత ఏమి చెబుతుంది?
కర్మల గురించి భగవద్గీత ఏమి చెబుతుంది?
మన పురాణకథలలో తపస్సు చేసే ఋషులు అనేకుమంది మధ్యలో నియంత్రణ కోల్పోవటం కనిపిస్తుంది. దాంతో అంత వరకూ వారు సంపాదించిన తపశ్శక్తి భగ్నమైపోతుంది. అప్పుడు మళ్ళీ తపశ్శక్తి సాధించేందుకు, తమ భావావేశాన్ని నియంత్రించేందుకు వారు మరోసారి తపస్సు ప్రారంభిస్తారు. ఇలా ఎన్నిమార్లు నష్టపోయినా, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూండేవారు తమ లక్ష్యం సాధిస్తారు. విశ్వామిత్రుడు ఎన్నిమార్లు తపస్సు ఆపి, ప్రారంభించి, తన గమ్యం చేరుకున్నాడో అందరికీ తెలుసు. కాబట్టి కోరికలను అదుపులో ఉంచుకోవటమన్నది ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో సాధ్యమయ్యేది కాదని అర్థం చేసుకోవాలి.
కోరికలుండటం పాపం కాదు. కానీ, వాటిని అదుపులో ఉంచుకోవటం ఆనందదాయకం. అందుకోసం ప్రయత్నించి విఫలమవటంలో దోషం లేదు. చిన్నతనం లేదు. కానీ ధర్మమార్గంలో తీర్చుకోవాలి. విధ్యుక్తకర్తవ్యాన్ని నిర్వహిస్తూ, కోరికలను, ఆ పరిధిలోనే తీర్చుకోవాలి.
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హ్యకర్మణః శరీరయాత్రా౨ పి చ తే న ప్రసిద్ధ్యే దకర్మణః॥
నీ కర్మలను సక్రమంగా నిర్వహించాలి. నిర్వ్యాపారంగా ఉండటంకంటే, ఏదో పని చేస్తూండటం మేలు. పనిపాటలు లేని సోమరులకు బ్రతకటమే కష్టం.
యుద్ధం చేయనని, ఏదైనా కార్యం నిర్వహించాల్సి వచ్చినపుడు, మనిషిలో సహజంగా తలెత్తే జడత్వాన్ని, వైరాగ్యం ముసుగులో దాచుకోవాలని అర్జునుడు ప్రయత్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా సమాధానం ఇది.
ప్రతి వ్యక్తీ తన కర్మలను నిర్వహించి తీరాలి. భగవంతుడు సృష్టించిన ఈ ప్రపంచంలో విధ్యుక్త విధులను తప్పనిసరిగా నిర్వహించాలి. చదవటం, పరీక్షలు రాయటం, మంచి భవిష్యత్తును నిర్మించుకునేందుకు పునాది వేసుకోవటం ప్రతి బాలుడి కర్తవ్యం. బాల్యంలో ప్రపంచానుభవం ఉండదు. భవిష్యత్తు గురించిన ఆలోచన, అవగాహనలు ఉండవు. కాబట్టి తల్లిదండ్రులు చూపిన మార్గంలో ప్రయాణించాల్సిందే. తల్లిదండ్రులు చెప్పినట్టు చదవాల్సిందే. పరీక్షలలో ఉత్తముడుగా ఉత్తీర్ణుడవ్వాల్సిందే.
సంసారంలో ఉన్నవారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాల్సిందే. భార్య, భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అనురాగపూరితంగా జీవించాలి. తమ తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వారి పట్ల తమ బాధ్యతలను, కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నెరవేర్చాలి. అలాగే తమ సంతానానికి సరైన విద్యాబుద్ధులు నేర్పి, వారి భవిష్యత్తుకు తమ శక్తి ప్రకారం మంచి బాట చూపాలి. ఇక తాముంటున్న సమాజంలో తమ విధ్యుక్త ధర్మాన్ని నిర్వహించాలి. అంతే కానీ సంసారం దుఃఖకారణం కాబట్టి నేను సంసారం చేయను అని తప్పించుకునే వీలు లేదు. అయితే నిజంగా వ్యక్తికి వైరాగ్యభావన కలిగితే ఆ పరిస్థితి వేరు.
ఎనిమిదేళ్ళ వయస్సులో శంకరాచార్యులు సన్న్యాసం స్వీకరించారు. కానీ అది ఒక రకంగా ధర్మాతిక్రమణం అవుతుంది. అందుకని తల్లి అనుమతి తీసుకునే తరువాత సన్న్యాసం స్వీకరించారు. కానీ తల్లి అవసాన దశలో, ఎక్కడున్నా సరే 'వస్తా'నని వాగ్దానం చేశారు. నెరవేర్చుకున్నారు. అదీ కర్తవ్యపాలన అంటే!
అంటే వ్యక్తి ఇష్టాయిష్టాలు, సమాజం అతని నుంచి ఆశించే ధర్మవర్తనకూ నడుమ ఎటువంటి ఘర్షణ లేని వ్యవస్థ అన్నమాట మనది. అంతే తప్ప, ఇది నా ఇష్టం. నా ఇష్టాన్ని కాదనేందుకు నువ్వెవరు? అని తల్లిదండ్రులను నిలదీసి, సమాజాన్ని వ్యతిరేకించి తిరుగుబాటుదారులా ప్రవర్తించటం మన విధానమే కాదు. ధర్మం కోసం తన వ్యక్తిగత ఇష్టాయిష్టాలను అణచిపెట్టి, తన కోరికలను ధర్మానుసారమే తీర్చుకోవాలని మన సామాజికజీవనం నేర్పుతుంది.
అన్నీ వదిలిన అద్వైతవేదాంతి కూడా 'అమ్మ మాట' అనే ధర్మాన్ని పాటించాడు. అందుకే కర్మలు తప్పనిసరిగా చేయాలి. కర్తవ్యం నిర్వహించాలి. కానీ దాని ఫలితంపై వ్యామోహం, ఆసక్తి వంటివి ఉండకూడదు' అంటుంది భగవద్గీత.
◆నిశ్శబ్ద.