భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తే కలిగే ఫలితం ఏమిటో తెలుసా!
భగవద్గీత మొదటి అధ్యాయాన్ని పారాయణం చేస్తే కలిగే ఫలితం ఏమిటో తెలుసా!
గీత - 'గీ' అంటే త్యాగం, 'త' అంటే తత్త్వజ్ఞానం. ఈ విధంగా త్యాగాన్నీ, తత్త్వ జ్ఞానాన్నీ బోధించేదే గీత. గీత మహిమ అపారం. గీతాశ్లోకాలు పారాయణ వలన ఎన్నో సత్ఫలితాలు చేకూరుతాయి. 18 అధ్యాయాలున్న భగవద్గీత పారాయణ ఫలితాల గురించి తెలుసుకొని, ఆ ఫలాలను శ్రీకృష్ణునికి సమర్పించాలి. ఎందుకంటే 'భావ శుద్ధే హరి సాయుజ్య సిద్ధి' అనేది ఆర్యోక్తి.
గీత యొక్క అఖండ శక్తి గురించి లక్ష్మీదేవికి శ్రీమహా విష్ణువు బోధించగా, దానినే మరలా మహేశ్వరుడు పార్వతికి వివరించాడు. గీతలోని ఒక్కొక్క అధ్యాయాన్ని పారాయణం చేసినందువల్ల కలిగే అమోఘ ఫలితం కథారూపంగా పద్మపురాణంలో చక్కగా వివరించబడి ఉంది. పద్మపురాణాంతర్గతమైన గీతాధ్యాయ మాహాత్మ్యం తెలుసుకుంటే...
పూర్వ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దురాచారపరుడై, విషయలోలుడై జీవితాన్ని భ్రష్టు పట్టించుకొని అనేక యాతనలు పడి మరణించాడు. మరుజన్మలో ఎద్దుగా పుట్టాడు. మోయలేని భారాన్ని మోసి మోసి ఒక పర్వత ప్రాంతంలో భారాన్ని మోయలేక క్రిందపడి ప్రాణం విడిచాడు. ఆ దారిన పోతున్న పుణ్యాత్ములు కొందరు 'అయ్యో! పాపం ఈ వృషభం భారాధిక్యంతో పడి మరణించింది. దీనికి సద్గతి కలిగించడానికి తలా కొంచెం మనం పుణ్యం ధారపోయాలి' అని అనుకొని అందరి పుణ్యంలో కొంత కొంత ధారపోశారు. ఆ బాటసారులలో ఒక వారవనిత కూడా ఉంది. 'నేనేమీ పుణ్యం చేయలేదే! నేనేం చేయగలను?' అని విచారించింది.
అయినప్పటికీ ఈ విధంగా ఆలోచించింది. 'నేనే గనక ఏ కొంచెమైనా ఎప్పుడైనా ఏ పుణ్యమైనా చేసి ఉంటే దానిని ఈ వృషభానికి అర్పిస్తున్నాను' అని మనసారా ధారపోసింది. ఆ వారవనిత అర్పించిన పుణ్యఫలంతో ఆ వృషభం మళ్ళీ పూర్వజన్మ జ్ఞానమున్న బ్రాహ్మణుడిగా జన్మను పొందింది. తనకు ఉత్తమ గతి కల్పించడానికి తన పూర్వజన్మ సుకృతాన్ని ధారపోసినవారవనితగృహానికి వెళ్ళాడు. 'నీవు నాకు ధారపోసిన సుకృతం ఏమిటి' అని అడిగాడు. ఆమె ఒక చిలుకను చూపి ఆ చిలుక పలుకులతోనే తన చిత్తం పునీతమైందని చెప్పింది. ఆ ఇరువురు ఆ చిలుక వద్దకు వెళ్ళి, 'నీకీ సుకృతం ఎలా లభించింది' అని అడిగారు.
అప్పుడా చిలుక పూర్వజన్మలో తానొక గొప్ప పండితుడిననీ, గర్వంతో గురుదూషణాది పాపాలు అనేకం చేశాననీ, కొంత కాలానికి మరణించి చిలుకగా పుట్టి అరణ్యంలో అతి దీనంగా కాలం గడుపుతూ ఉండేదాన్ననీ చెప్పింది. “అలా ఉండగా ఒక మునివరేణ్యుడు నన్ను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి పోషించసాగాడు. ఆ ఆశ్రమంలోని శిష్యులకు ఆ మునివర్యుడు భగవద్గీత ప్రథమ అధ్యాయాన్ని నిరంతరం బోధిస్తూ ఉండేవాడు. దాన్ని విని విని క్రమంగా నేనూ ఉచ్చరించడం నేర్చుకొన్నాను. సదా ఆ శ్లోకాలు పలుకుతూ ఉండేదాన్ని. అంతలో ఒకనాడు ఒక దొంగ నన్ను అపహరించి ఈ వారవనితకు అమ్మాడు. ఆమె కూడా మాటిమాటికీ నా నోట పలికే గీత ప్రథమ అధ్యాయాన్ని వింటూ ఉండేది. అందుచేతనే ఆమె పాప విముక్తురాలైంది. తద్వారా సుశర్మకు సద్గతి లభించింది”. అని ఆ చిలుక చెప్పింది.
తస్మా దధ్యాయ మాద్యం యః పఠేత్ శ్రుణుతే స్మరేత్ అభ్య సేత్తస్య న భవేత్ భవాంభోధిర్దురుత్తరః
గీత ప్రథమాధ్యాయాన్ని ఎవరు చదువుతారో, వింటారో, లేక సదా స్మరిస్తారో వారు సంసారమనే భవసాగరాన్ని సులభంగా తరించగలరు. అంతేకాదు, పూర్వజన్మ స్మృతి, సద్గతి కూడా లభిస్తుందని తెలుస్తోంది.
*నిశ్శబ్ద.